సిఎం సీటైనా మైలేనా? జీయర్ స్వామి తీరే వేరు!
త్రిదండి రామానుజ చిన జీయర్ స్వాముల వారి గొప్పతనం గురించి చాలా వింటుంటాము. కాని ఆయన పద్ధతులు కొన్ని చాలా విచిత్రంగా వుంటాయి. ఉదాహరణకు ఒకసారి నాకు చాలా సన్నిహితుడైన వ్యక్తి ఆయనకు శిష్యులకు ఆతిధ్యమిచ్చారు. ఆ సందర్భంగా పాదాలకు నమస్కరించబోతే ఠక్కున వెనక్కు తీసుకున్నారట. ఏమంటే తాకితే శక్తులు పోతాయని శిష్యులు వివరించారు. మొన్న ఆయన షష్టిపూర్తికి ఘనంగా జరిగిన సభలో చూడండి- వేదికపై సాక్షాత్తూ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ పాదాభివందనం చేయబోతే( బహిరంగంగా పాదాభివందనాలు సరైనవేనా అనేది వేరే ప్రశ్న) కాళ్లు వెనక్కు తీసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మాత్రం ఆ అవకాశం లభించినట్టు కనిపించింది.
ఇక ఇప్పుడు కెసిఆర్ అధికార నివాసంలో ప్రవేశించిన తర్వాత తన సీటులో కూచునేముందు స్వామిని అధిష్టింపచేశారు. ఆయన ఒకింత సంకోచిస్తుంటే చెప్పి మరీ రెండు సార్లు కూచోబెట్టారు. కాని స్వామీజీ కూచోవడానికి ముందు తర్వాత జరిగిన తమాషా చూడండి- శిష్యులు ఒక వస్త్రమో లేక కృష్ణాజినమో కాదంటే మరొకటో వేసి తీయడం.. ఇది చాలా లాఘవంగా జరిగిపోతుంటుంది.
సర్వమానవ సమానత్వం వసుధైక కుటుంబకం అంటుంటాం గాని భూసురులుగా అందులోనూ భూసురోత్తములుగా పరిగణించబడే వారి కథే వేరు. కొంతమంది ఇది కాకుండా కెసిఆర్ ఆంధ్రా జియ్యర్ను పిలిపించారని ఆనందించే పోస్టులు పెట్టారు. ఎవరి కోణం వారిది. ఎవరి భయభక్తులూ శక్తియుక్తులూ ఆసక్తులూ వారివి. అందులోనూ అధికార ముద్ర వున్నప్పుడు కొన్ని పరిమితులు తప్పవుు.ఎక్కడైనా ఎప్పుడైనా . కాని మైలపడిపోవడం వంటివి మానవీయం ఎంతమాత్రం కాదు. ఈ మొత్తం క్రతువులోనూ కెటిఆర్ పరిమితంగా పాలుపంచుకోకపోవడం విశేషం. లేదంటే మొక్కులూ పాదాభివందనాలలో కావలసినంత కనిపించి వుండేవారే కదా.. ఆయుత చండీయాగంలోనూ తక్కువగానే కనిపించారు. ఇంకా హరీష్‌రావు ఎక్కువగా ముందుంటారు. చాందసాలు తిరగబెడుతున్న ఈ రోజుల్లో ఇది అభినందనీయమే.