సీట్ల పెంపుపై “షా” మాటే చెల్లింది

ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరగబోవని కేంద్ర హౌంశాఖ అధికారికంగా చెప్పేసింది. ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఒత్తిడి మేరకు కొంత పరిశీలన జరుగుతున్నా బిజెపి అద్యక్షుడు అమిత్‌ షా ద్వారా ఆయా శాఖలు పెంపుదల వద్దని పట్టుపడుతున్నాయని నేను ఈ నెల 13న ‘సీట్లపెంపుపై ఫీట్లు’ రాశాను.వాస్తవానికి అప్పటికి ఇరు రాష్ట్రాల పాలకపక్షాల ముఖ్యులూ తమకు అధికారికంగా సమాచారం వచ్చిందనే చెబుతున్నారు. నాతో మాట్లాడిన బిజెపి కీలక నేతలు కూడా ఈ ప్రచారాన్ని చూసి తమ అధినాయకత్వం ఏమైనా మనసు మార్చుకుందేమోనని సందేహంలో పడిన పరిస్థితి వచ్చింది. అయితే ప్రధాని మోడీ ఎప్పటికీ తన కుడిభుజం అమిత్‌ షా అభిప్రాయానికి అత్యధిక విలువనిస్తారన్నది బహిరంగ రహస్యం. తెలుగు రాష్ట్రాల్లో సీట్లు పెంచితే బిజెపికి కలిగే ప్రయోజనం వుండకపోగా పాలకపక్షాలు మరింత బలోపేతం అవుతాయని ఆయన స్పష్టమైన అంచనాతో అడ్డుపడుతూ వచ్చారు. చివరకు ఇప్పుడు హౌం శాఖ పార్లమెంటులో ప్రశ్నకు సమాధానంగా చెప్పేసింది. ప్రశ్న వేసిన టిజివెంకటేశ్‌కు కూడా స్థానికంగా వచ్చి చేరినవైసీపీ ఎంఎల్‌ఎతో సమస్య వుంటుంది మరి.పార్టీలు మారి చేరినవారు వెనక్కు వెళ్లకపోయినా కొత్తగా వచ్చేవారు మాత్రం తప్పక వెనక్కు తగ్గడానికి ఈ ప్రకటన దోహదం చేయొచ్చు. మరి ప్రధాని కార్యాలయం నుంచి తమ ముఖ్యమంత్రులకు అధికారికంగా సమాచారం వచ్చిందని కొందరు చెప్పిన మాట నిజం కాదని తేలిపోయింది. అదే సమయంలో వున్నవారు అధినేతలకు మరింతగా లోబడివుండవలసిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలోనైతే సీట్ల పెంపును దృష్టిలోపెట్టుకునే జిల్లాల విభజన చేశారని సమాధానం వచ్చేది.చంద్రబాబు నాయుడు అధికారికంగా పార్టీ సమావేశాల్లో చెప్పడం లోకేశ్‌ కూడా ఆ దృష్టితోనే మాట్లాడ్డం పరిపాటిగా మారింది. ఇప్పుడు అవన్నీ మారిపోయినట్టే. ఇప్పుడున్న సమస్యల మధ్య మోడీ ప్రభుత్వం రాజ్యాంగం 170 వ అధికరణాన్ని సవరించి సీట్ల పెంపు చేయడంపై అసలు దృష్టి పెట్టడం జరిగే పని కాదు. విభజన చట్టంలోని నిబంధనలను తీసుకొచ్చి ఒప్పించాలంటే ప్రత్యేకాసక్తి వుండాలి. కాని బిజెపి ప్రయోజనాలకు భిన్నమైన పని ఎందుకు చేస్తారు? ప్రత్యేక హౌదా లేదా సమస్యల పరిష్కారంపైనే శ్రద్ధ పెట్టని వారు టిడిపి టిఆర్‌ఎస్‌లను ఎందుకు బలోపేతం చేయాలనుకుంటారు? అయితే ఇంతటితోనే ముఖ్యమంత్రులు వూరుకుంటారని కాదు, వారి ప్రయత్నాలు ప్రయాసలు కొనసాగిస్తూనే వుంటారు. తప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *