నోట్ల మృతులకు సంతాపం మానవత్వం కాదా?

నోట్లరద్దు సమస్యపై పార్లమెంటు వరుసగా వాయిదాలు పడుతున్నా ప్రధాని నరేంద్ర మోడీ తన బెట్టు సడలించకపోవడం ఆశ్చర్యం అనిపిస్తుంది.నోట్లకోసం క్యూలలో మరణించిన వారికి సభలో సంతాపం తెల్పాలన్న సీతారాం ఏచూరి తదితరుల ప్రతిపాదనను ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తున్నది? రైలు ప్రమాద మృతుల వలెనే వారు కూడా అన్యాయంగా ప్రాణాలు కోల్పోలేదా? వారికి సంతాపం తెల్పడం మానవత్వం కాదా?
ప్రధాని సమక్షంలో ఓటింగుతో ముగిసే విధంగా చర్చ జరగాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ఆయనే సమాధానం ఇవ్వాలని అడుగుతున్నాయి. ఈ సమస్యపై మొదట ప్రకటన చేసిందీ, జపాన్‌ నుంచి యుపి వరకూ ప్రతిచోటా దానిపై మాట్లాడింది ఆయనే గనక సర్వాధినేతగా ఆయన పాల్గొనడం అవసరమే. నిజానికి రాష్ట్రాల ముఖ్యమంత్రులనూ ఆఖరుకు తన మంత్రివర్గ సహచరులను కూడా విశ్వాసంలోకి తీసుకోకుండా మోడీ చేసిన ఈ నాటకీయ నిర్ణయంపై పార్లమెంటులో తనుగా ప్రకటన చేయడం ప్రజాస్వామ్య సంప్రదాయం. ఆ పనిచేయకపోగా అదేపనిగా అడుగుతున్నా నిరాకరించడమంటే సభ పట్ల గౌరవం ప్రశ్నార్థకమవుతుంది. మోడీ కావాలంటే చర్చలో పాల్గొనవచ్చు గాని సమాధానం ఆయన ఇవ్వదలుచుకోలేదని బిజెపి కేంద్ర మంత్రులు అధికారికంగా ప్రకటిస్తున్నారు. ప్రజలకు నేరుrgగా చెప్పిన తర్వాతనైనా ప్రజా ప్రతినిధులకు సభా ముఖంగా వివరించాల్సిన బాధ్యత మోడీపై వుంటుంది. కొంత రభస తర్వాతనైనా ఆయన ఈ విషయంలో నిర్ణయం మార్చుకోవలసి వుంటుంది.
ఇదే సమయంలో కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ చొరవ పెంచడం కూడా కనిపిస్తుంది. సభలోనూ వెలుపలా ఎటింఎల దగ్గరా ఆయన తీవ్ర నిరసన తెలిపారు. మోడీ సన్నిహితులకు మాత్రమే ఈ నిర్ణయం వల్ల లాభం జరిగిందని ఆయన విమర్శించారు. తన మిశ్రమ ప్రభుత్వ రాజకీయావసరాల కోసం ఈ నిర్ణయాన్ని అమితంగా స్వాగతించిన బీహార్‌ ముఖ్యమంత్రి నితిష్‌ కుమార్‌ కూడా ఈ రోజు ప్రజల కష్టాల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేయడానికి పాత నోట్లు వాడొచ్చనీ, కోటి రూపాయల లోపు రుణాలు చెల్లించవచ్చనీ ఈ రోజు రిజర్వు బ్యాంకు వెసులుబాటు ప్రకటించింది. బ్యాంకులకు నగదు చేరవేత సమయాన్ని 21 రోజుల నుంచిఆరు రోజులకు కుదించింది.బహుశా రానున్న రోజుల్లో కేంద్రం రిజర్వు బ్యాంకు కూడా మరింత దిగిరావడం అనివార్యమవుతుంది. యుపి పంజాబ్‌ ఎన్నికల్లో మేలు చేస్తుందనుకున్న నిర్ణయం ఇప్పుడు బెడిసి కొడుతున్నట్టు బిజెపి వ్యూహకర్తలలో ఆందోళన మొదలైంది.అందుకే మోడీ కూడా సామాన్యులు సంతోషిస్తున్నారనడం మానేసి వారి సమస్యల గురించి చెబుతున్నారు.ఈ సర్దుబాటునే సభలోనూ చూపిస్తే రేపైనా జరుగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *