ప్రజల చెవుల్లో ప్యాకేజీ పూలు – పార్ట్‌ 2

గుళ్లో కుళ్లు చేయకపోతే గుగ్గిలం వేసినంత పుణ్యమని సామెత. బిజెపి టిడిపి కూటమి ఘనంగా వాగ్దానం చేసి వంచించిన ప్రత్యేక హౌదా వమ్ము చేసి ప్యాకేజీ ప్రహసనం నడిపించారు. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించిన తాడూ బొంగరం లేని ఉత్తుత్తి ప్యాకేజీ ఇప్పటికీ నిర్దిష్టరూపం తీసుకున్నది లేదు. దానికింద ఎంత వస్తుందో క్వాంటిఫికేషన్‌ జరిగిందే లేదు.మొదటి ఏటి రెవెన్యూ లోటు లెక్క, రాజధాని ఖర్చులు,పోలవరం పద్దులు ఒక్కటంటే ఒక్కటి తేలిస్తే ఒట్టు. ఇక హౌదాతో సంబంధం లేవని చెప్పిన పారిశ్రామిక రాయితీలు వెనకబడిన ప్రాంతాల ప్యాకేజీలు కూడా మిథ్యగానే వున్నాయి. . అక్కడ రాజ్యసభలో కెవిపి రామచంద్రరావు హౌదాపై ప్రవేశపెట్టిన ప్రైవేటుబిల్లునేమో ద్రవ్య బిల్లుగా నిర్ధారించారు. ఇక్కడ ఆర్థిక మంత్రి స్వయంగా ప్రకటించిన ద్రవ్య రాయితీలనేమో అస్పష్టంగా దాటేశారు. ఇదంతా మాటల కందని మాయగా వుంది.వాటి ద్వారా ఎంత వస్తుందో ఎప్పుడు వస్తుందో తేల్చేబదులు తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్యాకేజీకి చట్టబద్దత ప్రహసనం మొదలుపెట్టారు ఈ లోగా బిజెపి ఎపి పరిశీలకుడు సిద్ధార్థనాథ్‌ సింగ్‌ అరుణ్‌జైట్లీ మాటే శాసనం(చట్టం) అని కొత్త పల్లవి ఎత్తుకున్నారు. సాక్షాత్తూ నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చట్టసభలో ప్రతిపక్షం ఆమోదంతో చేసిన లిఖిత పూర్వక ప్రకటనకే చట్టబద్దత లేదంటూ రద్దు చేసిన కేంద్రం ఆర్థిక మంత్రి చేసిన అరకొర ప్రకటనను అధికార పూర్వకంగా తీసుకోవాలనడం ఎంత దారుణం? దానికి చట్టబద్దత కల్పించాలని టిడిపి ఎంపి కింజారపు రామ్మోహననాయుడు లోక్‌సభలో లాంచనంగా అడిగారు గాని నిర్దిష్టత లేని ఆ ప్రకటనకు ఎలా చట్టం చేస్తారు? చేసేవారైతే ఆ ప్రకటన తర్వాత జరిగిన అనేక క్యాబినెట్‌ సమావేశాల్లోనే చేసి వుండేవారు.ప్రధాని నరేంద్ర మోడీ జైట్లీ బృందం మంచి కసరత్తుచేసిందని కితాబిచ్చారే గాని పార్లమెంటులో పెట్టి చట్టంచేస్తామని ఏనాడూ అనలేదు.అసలు హౌదాపైన గాని ప్యాకేజీ పైన గాని ఇంతవరకూ ఆయన పెదవి మెదిపిందే లేదు. కాని చంద్రబాబు నాయుడు లోకేష్‌తో సహా తెలుగుదేశం నేతలు ఈ ఉత్తుత్తి ప్యాకేజీనే హౌదా కన్నా గొప్పదని పొగిడేసి వెంకయ్య నాయుడును సన్మానాలతో ముంచెత్తారు. మీతో కలసి వస్తామన్న ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ఇదంతా అయ్యాక బండి ముందు గుర్రం వెనక అన్నట్టు ఇప్పుడు చట్టబద్దత కోసం కృషి చేస్తామని బయిలుదేరడం రాజకీయ కపన నాటకంలో ద్వితీయాంకంలా వుంది. ఆదిలోనే సిద్ధార్థుల వారు తోసిపుచ్చారు గనక జరిగేదేమీ వుండదు కూడా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *