ఉభయ చంద్రులూ నరేంద్ర రాగమే!.. నోట్ల పోరాటానికి దూరమే!!
నోట్లరద్దు వల్ల ప్రజలకు కలిగిన నష్టాలపై దేశంలో కొంతమంది ముఖ్యమంత్రులు కూడా నిరసన తెల్పుతున్నారు. పోరాటం చేస్తున్నారు.కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తన మంత్రివర్గ సభ్యులతో సహా తిరువనంతపురంలో ఆర్‌బిఐ కార్యాలయం దగ్గర ధర్నా చేశారు. ఇది అసాధారణ చర్య. కేరళ సహకార బ్యాంకుల్లో లక్షా 27 వేల కోట్లు వున్నాయని రైతులు ఎంతో కష్టపడి జమచేసిన ఈ డబ్బు వారి అవసరాలకు అక్కరకు రాకుండా చేయడం అన్యాయమని ఆయన వాదించారు. ఈ చర్య వల్ల ప్రజలకూ రాష్ఠ్ర ప్రభుత్వాలకు కలిగే సమస్యలతో పాటు తమ సహకార వ్యవస్థ కూడా సంక్షోభంలో చిక్కుకుంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. నోట్ల కొరత తీరేవరకూ పాత నోట్లను అనుమతించాలని కోరారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనదైన శైలిలో అందరికీ నాయకత్వం వహించాలని ప్రయత్నం చేసి విఫలమైనారు గాని విధానపరంగా గట్టి వ్యతిరేకతే ప్రకటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సరేసరి. కొందరు ఆరెస్సెస్ బిజెపి నేతలు కూడా విమర్శించడం చూశాం. కాని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల పరిస్థితి ఇందుకు భిన్నంగా వుంది. నేను మొదటే వ్యాఖ్యానించుకున్నట్టు మొదట్లో చంద్రబాబు నాయుడు స్వాగతించగా కెసిఆర్ విమర్శ చేసినట్టు పరోక్ష కథనాలు వచ్చాయి.ఆయన మంత్రివర్గ సహచరులూ పార్టీ నేతలు కూడా ఆ తరహాలోనే మాట్లాడారు. పాతనోట్లను ప్రభుత్వ చెల్లింపులకు అనుమతించాలని కూడా ప్రతిపాదన చేసి అమలుకు తెచ్చారు.
అయితే పార్లమెంటు సమావేశాలలోనూ టిఆర్‌ఎస్ ఎంపిలు ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తారని అందరూ భావించారు. ఆ ఎంపిలూ అలాగే మాట్లాడారు. ఆ దశలో కెసిఆర్ దూకుదుగా వెళ్లవద్దని సమస్యలను మాత్రం సామరస్యంగా దృష్టికి తేవాలని ఆదేశించారట. లోక్‌సభలో ప్రతిపక్షాలు నిరసన తెల్పుతుంటే ప్రశ్నలు అడిగిన వారు టిఆర్‌ఎస్ టిడిపి సభ్యులే కావడం గమనార్హం. ఆ విధంగా కేంద్రానికి తమ మద్దతు ప్రకటించారన్నమాట.తర్వాత ప్రధాని మోడీ నుంచి కెసిఆర్‌కు ఆహ్వానం రావడం..ఢిల్లీ బయిలుదేరడం.. నోట్లరద్దువల్ల దేశానికి మేలు జరిగేట్టయితే బలపర్చాలని భావిస్తున్నట్టు సంకేతాలు చూస్తే పరిస్థితి మారింది. ఈ సమయంలో మోడీ మెప్పు పొందడానికే ఉభయ తెలుగు రాష్ట్రాధినేతలు నిర్ణయించుకున్నట్టు స్పష్టమవుతున్నది. టిఆర్‌ఎస్ లేదా కెసిఆర్ ఏదైనా సన్నాయి నొక్కులు నొక్కినా గట్టిగా విమర్శించడం మాత్రం జరగదు. అది వారి ఇష్టమే గాని సుప్రీం కోర్టే విమర్శించిన మేరకైనా రాష్ట్రనేతల నుంచి ప్రత్యక్ష స్పందన రాకపోవడం దురదృష్టకరం. ఎన్టీఆర్ జ్యోతిబాసు రామకృష్ణ హెగ్గే వంటివారు ఆ రోజుల్లో చేసిన పోరాటం వల్ల రాష్ట్రాలకు హక్కులు వచ్చాయి. ఇప్పుడు వాటి ప్రమేయమే లేకుండా ముఖ్యమంత్రులనైనా విశ్వ్ణాసంలోకి తీసుకోకుండా కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం చేసింది. రాష్ట్రాల ఆదాయాలకు గండి కొట్టింది.రేపు జిఎస్‌టి కూడా వస్తే అవి పూర్తిగా చిక్కుల్లో పడిపోతాయి. అయినా సరే మన ముఖ్యమంత్రులు కేంద్రంతో సఖ్యతకు తప్ప సమరానికి సిద్ధంగా లేరు. ఏం చేద్దాం?ప్రజల కన్నా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనుకుంటున్నారేమో!
votuku notu settlement kaadukada?