నారాయణ – అగ్రీ టు డిజగ్రీ!

సిపిఐ నాయకులు డా.కె.నారాయణ కొణిపాకం,తిరుపతి సందర్శించడంపై మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో నేను సామాన్య మతం విశ్వాసాలు వంటి సాధారణాంశాలు వివరించి తనపై కథనాలకు ఆయనే జవాబు చెప్పడం సముచితంగా వుంటుందని మాత్రమే రాశాను. .ఆయన తన సందర్శనలు స్పందనలపై సవివరమైన ప్రకటన చేశారు. అన్ని ప్రధాన పత్రికలు ప్రచురించిన వార్తలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు గనక వచ్చిన వాటిపై పెద్ద అభ్యంతరం లేదని అనుకోవచ్చు. దానిపై కూడా నేనెలాటి వ్యాఖ్యానం చేయబోవడం లేదు.అది వారికి సంబంధించిన విషయం. నేను ఏదైనా వ్యాఖ్య చేసినప్పుడు సంబంధిత ప్రముఖులు సమాధానమిస్తే లేక ప్రకటనచేస్తే ఇవ్వడం పరిపాటి. మాజీ డిజిపి దినేష్‌ రెడ్డి అయినా బిజెపి టిడిపి నాయకులైనా లేక మీడియా మిత్రులైనా సరే. ఈ పద్ధతి పాటిస్తున్నాను.అదే రీతిలో ఇప్పుడు ఆయన ప్రకటన పూర్తిగా ఇక్కడ పొందుపరుస్తున్నా. దాని సారాంశం ఎవరి కోణంలో వారు అర్థం చేసుకోవచ్చు. వ్యక్తిగత అంశాలకూ గౌరవ మర్యాదలకు ఏ విధమైన ప్రచారం ఎంత మేరకు అనుమతించాలనేది ఆయా నాయకులే నిర్ణయించుకోవలసిన విషయం.

హైదరాబాద్‌,
16.11.2016.
ప్రచురణార్థం:
లెట్‌ అజ్‌ అగ్రి టు డిజగ్రీ
నేను కుటుంబంతోపాటు తిరుమల వెళ్ళి ”వెంకన్న”ను దర్శించుకున్న సందర్భంగా అన్ని ప్రధాన పత్రికలు వార్తలు ప్రచురించినందుకు ధన్యవాదాలు. ఆ వార్త రాగానే సోషల్‌ మీడియాలో విమర్శలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్ళు సంతోష పడతారనుకున్నా, కానీ వారు కూడా విమర్శించారు. నా కార్యక్రమాలపై శ్రద్ధ ఉంటే తప్ప విమర్శించలేరు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
నేను చదువు కొరకు గుంటూరు వెళ్ళక పోయి ఉంటే చిత్తూరు జిల్లాలోనే ఉండి ఉంటే నేనీస్థాయిలో మాత్రం ఖచ్చితంగా ఉండేవాడిని కాను. ఏ విధంగా మలుపు తిరిగేదో చెప్పలేను. నా కుటుంబ నేపథ్యం – జిల్లాలో రాజకీయ ప్రభావం వేరు. ఆనాడు నేను భక్తుడ్నే. నేను నా పద్ధతి అని కొంత మంది గర్వంగా చెప్పుకుంటారు. మనం సమాజంలో ఒక్కళ్ళం. సామాజిక పరిస్థితిలో విభిన్న అభిప్రాయాలుంటాయి. వాటిని గౌరవిస్తూనే మనం నమ్మిన విషయాలపై రాజకీపడకుండా ఉండటమే మంచిది. నేను ఎఐఎస్‌ఎఫ్‌లో చేరాక ఉద్యమాలు-రాజకీయ తరగతులు, చారిత్రిక భౌతికవాదం – తాజా రాజకీయ అవగాహన పెరగడంతో మూఢ నమ్మకాలపై నమ్మకం పోయింది. ఆక్రమంలోనే పూజలు – దర్శనాలకు దూరమయ్యాను. అంతే గానీ అసహ్యం కలగలేదు. ఎక్కడికెళినా గుడులు, చారిత్రక కట్టడాలు చూస్తాను. శ్రీకాళహస్తి ఈశ్వరగుడి నిర్మాణ స్వరూపం (ఆర్కిటెక్‌) అద్భుతం.
తిరుమలలో యువజన సంఘాలు, ట్రేడ్‌ యూనియన్‌ నిర్మించాం. అనేక పోరాటలు చేశాం. హాకర్స్‌పై అటు గుండాలు, ఇటు పోలీసులు చేసే దౌర్జన్యాలను ఎదుర్కొన్నాం. అదే సందర్భంలో తిరుమల ఆధునీకరణను సమర్థించాం. దాని వలన స్థానికుల స్థానభ్రంశంపై పోరాటం చేసి ప్రత్యామ్నాయ వసతి, వృత్తికి సౌకర్యాలు కల్పించడంలో సఫలీకృతులయ్యాం.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఉద్యోగస్తుల సమస్యలపై ఆందోళన చేశాం. మొట్ట మొదటసారి పురోహితులకు కూడా ఎఐటియుసి ఎర్ర జెండా ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు, గర్బగుడితో సహా, పట్టణ బంద్‌ను నిర్వహించాం. గర్భగుడిలో ఉన్న మైక్‌ ద్వారా శ్రీకాళహస్తి ప్రజలందరికి వినబడే మైకుల ద్వారా ఉపన్యాసం ఇచ్చాను. ఎంత కమ్యూనిస్టును అయినా, నేను సమాజంలో మనిషినే. నాకు కుటుంబం, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులున్నారు వారంతా మూసబోసిన కమ్యూనిస్టులు కారు. వారి అభిప్రాయాలను గౌరవించడమంటే, నేను నమ్మిన సిద్ధాంత కార్యాచరణను వదులుకోవాలా?
అందులో తిరుపతి తిరుమలకు దర్శనార్థం వస్తారు. అక్కడున్న రద్దీ వలన నా సహాయం అడుగుతారు. కొన్ని సందర్భాలలో నన్ను కూడా గుడి లోపలికి రమ్మంటారు. అలాంటప్పుడు వాళ్ళతో వెళతాను. వాళ్ళు పూజలు చేసికుంటుంటే నేను వారితో పాటు ఉంటాను. ఒకసారి గుడిలో పలికి వెళ్ళాక ఆ సాంప్రదాయాలను గౌరవించకుండా ఉండటం సభ్యత కాదు. అంత వరకు అక్కడ సాంప్రదాయాన్ని పాటించడం అవసరం, మర్యాద కూడా.

అన్నమయ్య కీర్తనలు అవగాహన చేసికుంటే అనేక ప్రగతిశీల భావాలు చూడగలం. ”చండాలుడనే” (మాదిగ) పదాన్ని వాడడం మనం గమనిస్తే, ఆనాడే ఇలాంటి ప్రగతిశీలభావాలు వ్యక్తీకరించడం గొప్పే. అలాంటి సంఘటనలు భారత, భాగవత, రామాయణాలలో చూడవచ్చు. రాజకీయాల జోక్యం వలన మతాన్ని కూడా రాజకీయంగా వాడుకోవడానికి జరిగిన ప్రయత్నమే వికృత రూపం తీసుకున్నది. మత నమ్మకాలు వ్యక్తిగతం. అంత వరకు ఎవరో అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. అయితే దాన్ని సామాజికపరంగా చేసి ప్రజలపై రుద్దడానికి ప్రయత్నించడమే ప్రమాదం. చివరికి ప్రభుత్వాలే పెద్ద భక్తులై ”భక్తి రసం డ్రైనేజిలో ఏరులై పారుతుందని” గుజ్జుల మల్లారెడ్డి చెప్పినట్టు వికృత రూపం తీసుకోవడమే అభ్యంతరకరం.
కమ్యూనిస్టులుగా ప్రజల మనోభావాలను కూడా అర్థం చేసుకోవాలి. కేవలం రాజకీయ, ఆర్థికపరంగానే కాదు. సాంస్కృతిక విధానంలో కూడా ప్రజల పాత్రపై సానుకూల ఆలోచన రావాలి. వినాయక నిమజ్జనానికి కోట్ల మంది యువత స్పందిస్తున్నారు. తిరుమలకు సగటున రోజుకు ఒక లక్ష మంది వస్తున్నారు. వారినంతా ప్రగతిశీల వ్యతిరేకులుగా చూడగలామా? లెనిన్‌ చెప్పినట్టు మత భావాలను తుపాకి గొట్టం ద్వారా పరిష్కరించలేం.
అయితే తిరుమల దర్శన తర్వాత ”నారాయణ మారిపోయాడని, చెప్పేదొకటి, చేసేదొకటని” అటు మతోన్మాదులు మొదలు వామపక్షవాదుల్లో సైతం విమర్శించవచ్చు. నాకు ప్రాణ స్నేహితుడు ఫోన్‌ చేసి తీవ్రంగా మందలించాడు. ”లెట్‌ అజ్‌ అగ్రి టు డిజగ్రీ” అన్న సమాధానం చెప్పాను తప్ప వాదనకు దిగలేదు. అదే సమాధానం లెట్‌ అజ్‌ అగ్రి టు డిజగ్రీ.

– డాక్టర్‌ కె. నారాయణ,
సిపిఐ జాతీయ కార్యదర్శి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *