బెడిసికొడుతున్ననోట్లవ్యూహం ,బడా బాబులు సురక్షితం,

నోట్ల రద్దు ప్రభావంపై ఈ రోజు ఇద్దరు పెద్ద సంపన్నులతో మాట్లాడాను. వాడకానికి చిల్లర రాేకపోవడం తప్పిస్తే వారికి ఏ సమస్యా లేదు. వారి లావాదేవీలు లక్షణంగా నడిచిపోతున్నాయి. బ్యాంకుల్లో డిపాజిట్లు చేసుకోవడంపైనా ఆంక్షలు లేవు. చాలా కాలం నుంచే పెద్ద నోట్ల రద్దు మాటలు వినిపిస్తున్నందువల్ల ముందే జాగ్రత్త పడ్డారు. ఇంకా ఏదైనా వుంటే రకరకాల వ్యక్తులతో ఉద్యోగులతో పంపిస్తున్నారు. కొంత మార్పిస్తున్నారు. ముందే బినామీ ఖాతాలలో వేసింది ఎలాగూ బ్యాంకులే మార్పించి పెడతాయి. మన దేశంలో వున్న చట్టాల ప్రకారం బ్యాంకుల్లో వేసేందుకు ఐటి అనుమతి అక్కర్లేదు. నిరాకరించేందుకు వాటికీ హక్కులేదు. తర్వాత ఏదైనా జరుగుతుందా అంటే చాలా తక్కువ.అసలు డిక్లరేషన్‌ చేయకపోతే మన ఐటి అసలు పట్టించుకోదని ఒక పెద్ద నిర్మాణ రంగ వ్యాపారి అన్నారు. తమలాటి వాళ్లం నోట్లను వూరికే పోగు పోసిపెట్టుకోమని ఎక్కడో ఒకచోట ఆస్తులుగా మార్చేస్తుంటామని ఆయన స్పష్టం చేశారు.
ఇదేగాక ఆస్పత్రులు, ప్రైవేటు సంస్థల విషయానికి వస్తే ప్రజల దగ్గర నేమో తాజా నోట్లు తీసుకుని తమ దగ్గర వున్న పాత నోట్లను డిపాజిట్టుగా పంపించవచ్చు. దానిపై ఎలాటి ఆంక్షలూ వుండవు. ఆ విధంగా వారికి రెండు విధాల మేలు కలుగుతుంది. ప్రభుత్వ వ్యవస్థలన్నిటినీ కూలగొట్టి ప్రైవేటు మయం చేసి ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులలో లేదా సంస్థల్లో చెల్లింపులకు పాత నోట్లు వాడొచ్నన్నంత మాత్రాన కలిగే ఉపశమనం ఎంత వుంటుంది? ఆస్తిపన్నులు లక్షల్లో బకాయిలు కట్టేవారెలాగూ సామాన్యులు కాదు కదా?  మోడీ ప్రభుత్వ స్వభావం ఈ సమయంలోనే బయిటపడిపోయింది.సరిగ్గా ఈ సంక్షుభిత సమయంలోనే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వేల కోట్ల విలువైన ఘరానాబాబుల బాకీలను దాదాపు రద్దు చేసేసింది.అందులో సంచలనంసృష్టించిన విజరుమాల్యా బాకీ కూడా ఒకటి. ఇప్పటి వరకూ బ్యాంకుల్లో పేరుకుపోయిన మాయబాకీలు 1,12,000 కోట్లు వసూలు చేసేందుకు ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలు లేవు.కాని ఇప్పుడు ఆ పేరుతో ప్రజల చేతుల్లోని డబ్బును దుబ్బుకు కొరగాకుండా చేసి సహస్ర కోటీశ్వరుల అప్పులు మాత్రం అవతలపెడుతున్నది. రాజ్యసభ చర్చలో సిపిఎం కార్యదర్శి సీతారాం ఏచూరి ఈ విషయం లేవనెత్తితే ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బాకీలు రద్దు చేయలేదని మొండిబకాయిల కింద పక్కన పెట్టడం మాత్రమే జరుగుతున్నదని వివరణ ఇచ్చారు. అలా ఎందుకు చేశారు? మరి కఠిన నిర్ణయాలూ, సర్జికల్‌ స్ట్రయిక్స్‌ చేయాల్సిన చోట చేయకుండా ఏ పాపం తెలియని కోట్లాది మంది భారతీయులను ఎందుకు బలిచేశారు?
పెద్ద నోటును ఇప్పుడు ప్రవేశపెట్టారు. బడా బాబుల నిల్వలు ఇప్పుడు 2000 నోట్లలో సురక్షితంగా వుండిపోతాయి. వారికి ఈ యాభై రోజులలోనూ ఆ నోట్లు మార్చుకోవలసిన అవసరమే కలగదు. మామూలు వాళ్లకు అది రోజువారి అవసరాలకు అక్కరకు రాదు. మార్చుకోవడానికి చిల్లర దొరకదు. ఇది రెండు విధాల శిక్షే. ఇప్పటికి ఇంకా 1000,500 నోట్లు పెద్దగా విడుదల కాలేదు గనక 2000,100 నోట్లతో నెట్టుకు వచ్చే అస్తవ్యస్త పరిస్థితి ఎక్కడా వూహించనిది.బిజెపి ప్రతినిధులు ఈ పరిస్థితిని సమర్థించుకోవడానికి ఆర్థికంగా తలకిందులైన గ్రీసునో మరో దేశాన్నో పోల్చిచూపిస్తున్నారు.నిష్కారణంగా ఈ దేశాన్ని అంతటి సంక్షోభంలోకి నెట్టాలనుకున్నార నిర్ణయంలో అశాస్త్రీయత అవకాశవాదం ఆర్భాటం అలా వుంచి అమలు జరిపిన తీరు అసమర్థతకు అద్దం పడుతుంది.ఈ దేశ ప్రభుత్వం తనకు అవసరమైన నోట్లను ముద్రించుకోవడానికి నెలల తరబడి సమయం తీసుకునేంత దుస్థితిలో వుందన్నమాట. నిర్ణయం పై స్థాయిలో తీసుకుని ముందస్తుగా ముద్రణ చేసి వుండొచ్చు.100 నోట్లు ఎలాగూ వుండేవే గనక వాటి సంఖ్య పెంచినంత మాత్రాన అనుమానాలు రావలసిన అవసరమే వుండేది కాదు. క్రమానుగతంగా పంపిణీలో వాటి నిష్పత్తి పెంచి పెద్దనోట్లను తగ్గించి మామూలుగానే మార్పు తీసుకుని రావచ్చు.1978లో ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు చట్టం చేసి మరీ అమలు జరిపింది. ఏ సమస్యా రాలేదు.కాని మోడీ సర్కారు తీరే వేరు.ఇక్కడ ప్రయోజనం కన్నా ప్రచారం ప్రధానం. నాటకీయత ముఖ్యం.మోడీజీ సాహసాన్ని ఆకాశానికెత్తి తక్షణం వచ్చే యుపి ఎన్నికలలోనూ తద్వారా తర్వాతి పార్లమెంటు ఎన్నికల్లోనూ రాజకీయ లబ్దిపొందడం ముఖ్యం.కాబట్టే ఈ హఠాత్‌ ప్రకటనలూ బూటకపు ప్రచారాలూ కపటపు సిద్ధాంతాలూ కన్నీళ్లు పెట్టుకోవడాలు. తానేదో రాబిన్‌హుడ్‌లాగానో లేక అపర విప్లవకారుడిగానో నల్లధనంపై వీరభోగ వసంతరాయలలాగా విరుచుకుపడినట్టు మోడీజీ చెబుతున్నారు. వారు నన్ను బతకనివ్వరంటున్నారు.యాభై రోజుల తర్వాత ఫలితాలు కనిపించకపోతే ఉరితీయండని సవాలు చేస్తున్నారు. నల్లధనం సమస్యను సమర్థంగా దారితప్పించినందుకు సదరు మహా మహా సంపన్నులు ఆయనకు సన్మానం చేస్తారుగాని ఎందుకు ప్రాణాలు తీస్తారు? అలాగే ఈ యాభై రోజుల జీవన బిక్కచచ్చిన బడుగుజనం బతుకుజీవుడా అనుకుంటారు గాని మొత్తం ఫలితాలు సమీక్షించి ఉరితీసేంత ఓపిక ఎక్కడ మిగులుతుంది?

అసలు నోట్లరద్దుకు ఉపయోగించిన సెక్షన్‌ 26(2) ఏదైనా సీరిస్‌ను రద్దుచేసి వాటి బదులు కొత్తనోట్ల జారీ చేయడానికి తప్ప మొత్తం రద్దు చేయడానికి పనికిరాదని సుప్రీం కోర్టులో కపిల్‌ సిబాల్‌ చేసిన వాదన ఆసక్తికరమైంది.బ్యాంకులు కస్టమర్లకు అడిగినప్పుడు డబ్బు ఇస్తామని హామీఇచ్చి మరీ తీసుకుంటాయి అలాటి సంస్థలు ఆంక్షలు పెట్టడం ఎలా చెల్లుతుందనేది మరో ప్రశ్న
ఇక వేలికి నల్లఇంకు పూయడం మరో ప్రహసనం. ఏ తప్పు చేయని వారు ఎందుకు ఇంకు పూయించుకోవాలి?ఎన్నికల సమయంలో శిక్షణ పొందిన వారు కూడా సరిగ్గా చేయలేని పని ఇప్పటికే పనిభారంతో సతమతమవుతున్న బ్యాంకు సిబ్బంది చేయగలరా?
అయినా మోడీజీకి ఇవన్నీఎందుకు ప్రచారం వుంటే చాలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *