నోటు దెబ్బకు ప్రజాగ్రహం- దిక్కుతోచని ప్రభుత్వం
ఈ రోజు ఉదయం ఏదో చిన్న చికిత్సకోసం డాక్టరు దగ్గరకెళ్లాను. ఆయనేమీ రాజకీయాలున్నవారు కాదు. నోట్ల నిర్ణయంతో మోడీ ఓడిపోతాడని ఆయన ఠక్కున చెప్పేశారు. పేషంట్లు రాకపోవడమే గాక బయిట విన్నది కూడా అలాగే వుందని ఆయన అంటున్నారు. ఈ వారం రోజుల్లో అనేక చోట్ల ఇలాటి మాటలే వినిపిస్తున్నాయి. నేను వాటిని వూరికే ప్రస్తావించాను తప్ప అంచనాలు చెప్పడం లేదు. అయితే ముందస్తు వ్యూహం సన్నాహాలు లేకుండా తీసుకున్న ఆనాలోచిత నాటకీయ చర్య అనర్థకమని తేలిపోయింది. దీనిలో లోపాలు లొసుగులు నిన్న మొన్న చెప్పుకున్నాం.ఈ రాజకీయ నష్టాన్ని కొంతైనా తగ్గించేందుకే ప్రధాని అంతటి వ్యక్తి కన్నీళ్లు పెట్టుకోవలసి వచ్చింది. గుజరాత్ మారణహౌమం సమయంలో ప్రధానిగా వున్న వాజ్‌పేయి కూడా కనీళ్లు పెట్టుకుని కవిత్వం రాయడం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అవి ఆయనను కాపాడలేదు ఇక ఈయన సంగతి ముందు ముందు చూడాలి.
ఆదివారం అర్ధరాత్రి అధికారికంగా మోడీ నోట్ల సంక్షోభంపై సమీక్ష జరిపి కొన్ని సవరణలు ప్రకటించారంటేనే సమస్య తీవ్రత తెలిసిపోతూ వుంది. ఆర్థిఖ శాఖ కార్యదర్శి శశికాంత దాస్ నోట్ల మార్పిడిలో స్వల్ప పెరుగుదల ప్రకటించారు గాని అదేమంత ప్రభావం చూపదు. నిజంగా మేలు జరగాలంటే ఒక పరిమితిమేరకైనా పాత నోట్ల వాడకాన్ని అనుమతించాలి. తప్పదు.
ప్రతిపక్షాల వరకూ ఈ సమస్యపై తీవ్ర పోరాటానికి సిద్ధమవుతున్నాయి. పార్లమెంటులో వాయిదా తీర్మానం ఇస్తామని సిపిఎం నేత సీతారాం ఏచూరి ప్రకటించారు. ఆయనతో మాట్లాడేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనదైన శైలిలో ప్రయత్నించి ప్రచారమిచ్చారు. తెలంగాణ మంత్రి కెటిఆర్ దీనివల్ల కలిగిన నష్టాన్ని బాహాటంగా తప్పుపట్టారు. జెడియు, బిజూ జనతా,ఎన్‌ఎస్‌పి మాత్రమే ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించాయి. కాబట్టి ఇది పెద్ద దుమారం కాకతప్పదు. ఇంత పెద్ద దేశంలో వారం రోజుల పాటు వాణిజ్య కార్యకలాపాలు స్తంభించిపోతే వచ్చే నష్టం వేల కోట్లలో వుంటుంది. వ్యాపారాల మాట అటుంచి ఏపూట పని ఆ పూట తిండిగా బతికే శ్రమజీవులకూ నిరుపేదలకూ బక్క రైతులకూ ఇది సమ్మెట పోటుగా మారింది. ఇక చిన్న వ్యాపారాలు , రోజు వారి అమ్ముకోవలసిన కూరగాయలు వంటి రంగాలు చితికిపోతున్నాయి. ఇదంతా చిన్న సమస్యగా తాత్కాలిక వ్యవహారంగా మోడీ బృందానికి కనిపించవచ్చు గాని ప్రజలపై ఈ ప్రభావం మాత్రం చాలా తీవ్రంగా వుంది. తగిన పాఠం కూడా చెబుతుంది.

