గంగిరెద్దులూ ,గడ్డాలూ.. కెటిఆర్‌ వాక్కులు

సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బృందం మహాపాదయాత్రపైన, తెలుగుదేశం నేత రేవంత్‌రెడ్డి రైతుయాత్రపైన,ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శలపైన మంత్రి, ప్రిన్స్‌ చామింగ్‌ కెటిఆర్‌ తనదైన శైలిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వాధినేతలు ప్రతిపక్షాలపై దాడి చేయడం సహజమే. కాని ఈ సందర్భంగా ఆయన ఉపయోగించిన మాటలే తమాషాగా వున్నాయి. సంక్రాంతి రాకముందే ఎర్రటి,పచ్చటి కండువాలు కప్పుకుని గంగిరెద్దులు వస్తున్నాయన్నారు. మామూలుగా గంగిరెద్దులంటే చెప్పిందానికల్లా తలవూపుతాయని అందరికీ తెలుసు.డూడూ బవసన్న అని తలాడించేట్టయితే గులాబి కండువా కప్పుకుని పాలక వ్యవస్థలో భాగమై పోయేవారే కదా! అలా మారిపోయిన చాలామంది ఈ వేదికపైన వెలుపలా కూడా వున్నారు కదా! తమ పార్టీల కండువాలు తాము కప్పుకున్న వారు ఫిరాయించిన వారికంటే ఎంతోకొంత మెరుగు. తెలంగాణ సాయుధ పోరాట కాలం నుంచి ప్రజలకు ఎదురుతిరిగి పోరాడ్డం నేర్పిన ఎర్ర కండువాలు ఎప్పటికీ గంగిరెద్దులవడం జరగనిపని. వాస్తవానికి ఎన్నికల సమయంలో ఈ కండువాలు కెసిఆర్‌ కెటిఆర్‌లకు బాగానే కనిపించాయి. ప్రజల్లోకి వెళ్లి ప్రశ్నించడం మొదలు పెడితే తప్పయిపోయింది. ఇక ఉత్తమ్‌ కుమార్‌ గడ్డం ప్రktr2-1తిజ్ఞకు ి కవిత, కెటిఆర్‌లతో సహా పాలక పక్ష ప్రముఖులంతా ఎందుకింత ప్రచారం కల్పిస్తున్నారో అర్థం కాదు. అంతకన్నా ఆయన లేవనెత్తిన విధానపరమైన విమర్శలను దృష్టిలోకి తీసుకోవడం మంచిది. ఏమైనా ప్రతిపక్షాల క్రియాశీలతను అపహాస్యం చేయడం ి తగనిపని. అందులోనూ అప్రతిహతంగా కొనసాగుతామనే వారు అంత అసహనానికి గురి కావడమెందుకు? ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఏ మెట్రో రైలు విషయంలోనో లేక మరేదైనా సమస్యలోనో కాస్త త్వరపడితే పొరబడితే కెటిఆర్‌ నెమ్మదిగా సరిచేస్తుంటారు. కాని ప్రతిపక్షాలపై దాడి విషయంలో తన సహజశైలికి భిన్నంగా దాడికి దిగడం ఆసక్తికరమే కాని ఆరోగ్యకరం కాదు. ముఖ్యంగా కాంగ్రెస్‌ను పదేపదే ఎత్తిపొడిచే పాలకపక్షం చివరి నిముషం వరకూ దానిలో కలసిపోవడానికి తలుపులు తెరిచే వుంచిందని కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పటి వరకూ పాలించిన తెలుగుదేశంలో కాంగ్రెస్‌లో భాగంగా వుండి..ఆ పాలనలో మునిగితేలిన ఎంతోమందిని పక్కనపెట్టుకుని టిఆర్‌ఎస్‌ నేతలు గతంతో తమకేమీ సంబంధం లేదన్నట్టు మాట్లాడితే సరిపోతుందా? రాష్ట్రావతరణ తర్వాత చెప్పింది అడిగితే రెండేళ్లేనంటారు, అంతకు ముందు కాలంతో బాగా సంబంధం వుండి కూడా కొత్తవాళ్లలా మాట్టాడతారు. దానంతటికీ తలూపూలంటే గంగిరెద్దులు గులాబీ కండువాలు కప్పుకోవలసిందేనంటారా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *