హౌదాతో ఉద్యోగాలూ పెరిగాయి

ashok-leyland-pantnagar-sidcul-rudrapur-uttarakhand
2012లో ప్రణాళికా సంఘం ఉత్తరాఖండ్‌, హిమచల్‌, కాశ్మీర్‌లలో ప్రత్యేక హౌదా రాయితీల ప్రభావంపై అద్యయనం చేయించింది. హిమచల్‌ ప్రదేశ్‌లోని త్రివేణి పరిశోధనా సంస్థకు అనుబంధమైన స్టెల్లార్‌సొసైటీ ప్రణాళికా సంఘ ప్రాయోజకత్వంలో జరిపిన ఈ సుదీర్ఘ అధ్యయన నివేదిక మూడు రాష్ట్రాల్లోనూ పారిశ్రామికీకరణ ఉపాధి సంపద పెరుగుదల వివరాలు నిర్దిష్టంగా అందజేసింది. ఈ అధ్యయనంలో భాగంగా అధికారిక పత్రాలు నివేదికలు మాత్రమే గాక పెట్టుబడులు పెట్టిన వారిని కూడా విస్తారంగా ఇంటర్వ్యూలు చేసి అభిప్రాయాలు సేకరించారు.
జమ్మూ కాశ్మీర్‌లో 1989 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 59,621 మందికి ఉద్యోగాలు దొరికాయి. 8091 యూనిట్లు ఏర్పడ్డాయి. ఫ్యాక్టరీల సంఖ్య శాతంగా చూస్తే 15.15శాతం పెరుగుదల వుంది. స్థిరపెట్టుబడి 91శాతం పెరిగింది. మొత్తం పెట్టుబడులు 84శాతం పెరిగాయి.
హిమచల్‌లో 10,104 కోట్ల పెట్టుబడులు రాగా 95,618 మందికి ఉద్య్‌ోగాలు వచ్చాయి. 7606 యూనిట్లు నెలకొన్నాయి. ఫ్యాక్టరీల శాతం 25.70 పెరిగింది. స్థిరపెట్టుబడి 85శాతం పెరిగింది.మొత్తం పెట్టుబడులు 85 శాతం పెరిగాయి.
అందరికంటే ఎక్కువగా ఉత్తరాఖండ్‌లో 23,915 కోట్ల పెట్టుబడులు, 1,61,610 ఉద్యోగాలు, 16,102 యూనిట్లు కనిపిస్తున్నాయి. ఫ్యాక్టరీలు ఇక్కడ 27.79శాతం పెరిగాయి. స్థిరపెట్టుబడి 162 శాతంపెరిగింది.మొత్తం పెట్టుబడులు139 శాతం పెరిగాయి.
అభివృద్ది శాతం చూస్తే 2008-09లో ఉత్తరాఖండ్‌లో 134, హిమచల్‌లో 28, జమ్మూ కాశ్మీర్‌లో 57శాతంగా వుంది. నిెకరంగా కలిసిన విలువ మొత్తం ఉత్తరాఖండ్‌లో 338 శాతం వుంది. దీని విలువ 28,43,285. ఇది హర్యానా కంటే ఎక్కువ. హిమచల్‌లో ఇది 13,33,237గా , 139 శాతంగా వుంది.ఇది పంజాబ్‌ను దాటిపోయింది.ఇక జమ్మూ కాశ్మీర్‌ అంకెలు అందుబాటులో లేవు గాని శాతంగా చూస్తే 278 వుంది.
అస్సాంను తీసుకుంటే దారిద్య్రం శాతం 1973-74లో 51 శాతం వుంటే 2010-11కు 32 శాతానికి వచ్చింది.కేంద్ర నిధుల కారణంగా విద్య వైద్యం వంటి సామాజిక సూచికలు మెరుగుపడ్డాయని ప్రణాళికా సంఘం తేల్చింది. కేంద్రం ప్రత్యేక సహాయమే లేకపోతే ఇది జరిగేది కాదని నిపుణులు నిర్ద్వంద్వంగా తేల్చిచెప్పారు. ప్రోత్సాహకాలు ఇచ్చినా పరిశ్రమల రంగంలో పురోగతి ఇక్కడ అంతగా లేదన్నది అధ్యయనాల సారం. చమురు సహజవాయువు తదితర ప్రకృతి వనరులు పుష్కలంగా వున్న రాష్ట్రమైనా బంగ్లాదేశ్‌ నుంచి భారీ వలసలు, రాజకీయ అస్థిరత దాని అభివృద్ధికి శాపంగా మారాయి. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి ప్రత్యేక సహాయమే లేకపోతే అసలు ఒక రాష్ట్రంగానే మనగలిగేది కాదంటారు
కాగ్‌ కార్యాలయం డైరెక్టర్‌ జనరల్‌ గోవింద భట్టాచార్జీ తన పుస్తకంలో(ఆక్స్‌ఫర్డ్‌ ప్రచురణ). ఇక నాగాలాండ్‌ 1970,80లలో వున్న పరిస్థితిని దృష్టిలోకి తీసుకుంటే ఈ ప్రత్యేక హౌదా వల్ల గణనీయమైన ప్రగతి సాధ్యమైందంటారు. జాతీయ స్తాయిలో సగటున 27.5శాతం వున్న దారిద్య్ర శాతం నాగాలాండ్‌లో( 39 శాతం నుంచి) 19 శాతానికి తగ్గింది. పారిశ్రామికాభివృద్ది లేకున్నా ప్రభుత్వ కార్యకలాపాలు పెరగడం వల్ల ఇది సాధ్యమైంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ రాస్ట్రంలో 80 శాతం మంది అక్షరాస్యత సాధించారు.
ప్రత్యేక తరహా హౌదా వల్ల ఉద్యోగాలు, వాటికి లభిస్తున్న జీతనాతాలు ఆదాయలు ఎలా వున్నాయో కూడా చూడొచ్చు.
అన్నిటికన్నా కీలకమైన ఉద్యోగితను పరిశీలిస్తే ఈ కాలంలో ఉత్తరాఖండ్‌లో 87 శాతం, హిమచల్‌లో 39 శాతం, జమ్మూ కాశ్మీర్‌లో 22 శాతం ఉపాధి, ఉద్యోగాలు పెరిగాయి. కార్మికులకు అంద ేప్రతిఫలం ఉత్తరాఖండ్‌లో 172 శాతం, హిమచల్‌లో 94శాతం, కాశ్మీర్‌లో 47 శాతం పెరుగుదల వుంది. వాస్తవంగా ఈ మూడు రాష్ట్రాల కంటే అభివృద్దిచెందిన పంజాబ్‌ హర్యానా యుపి వంటి చోట్లనుంచి కూడా ఈ ప్రత్యేక హౌదా రాష్ట్రాలకు వచ్చి పనులు చేసుకుంటున్నారు. స్థానికంగా ఒకోసారి పనివారి కొరత కూడాఎదురవుతున్నదని యజమానులు చెబుతున్నారు.
. ఈ మూడు రాష్ట్రాలలోనూ పెట్టుబడులు పెట్టినవారిని విచారించగా 89 శాతం మంది తాము ఈ రాయితీలు వున్నందునే వచ్చామని సమాధానమిచ్చారు.66.7శాతం మంది ఇంకా పెట్టుబడులు పెట్టాలనే ఉత్సాహం కనబర్చారు. ఇవి పోటీకి దోహదం చేశాయని 88 శాతం మంది చెప్పారు. వీరిలో 44 శాతం మంది తమ యూనిట్లను విస్తరించుకునే యోచనలో వున్నారు. అదే సమయంలో తమకు ఇచ్చే రాయితీలు త్వరగా విడుదల చేయాలనీ, వాటికి సంబంధించిన కాలవ్యవధిపై ఒప్పందం వుండాలనీ, ఒకసారి ఇచ్చిన రాయితీలను ముందస్తు అవగాహన లేకుండా మార్చరాదని కూడా పారిశ్రామికవేత్తలుచెబుతున్నారు
.
కాబట్టి ప్రత్యేక హౌదా వల్ల ప్రయోజనం వుండదనే వాదన అర్థం లేనిదే కాదు, కావాలని చేస్తున్న అసత్య ప్రచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *