బెడిసికొట్టిన బిజెపి పాచికలు – చలనం లేని తెలుగు పాలకులు
యూనివర్సీటీ ఆఫ్ హైదరాబాద్(యువోహెచ్) లో దళిత విద్యార్థి వేముల రోహిత్ విషాదాంతం ఒక సంచలనంగా మారిందంటే అతిశయోక్తి కాదు. ఒక విద్యా సంస్థలో మొదలైన ఆందోళన దేశాన్ని ఇంతగా కదిలించిన సందర్భం ఇటీవలి కాలంలో లేదు. పెచ్చుపెరిగిన మత తత్వ రాజకీయాలు, కుళ్లు కుల వివక్షలు, విశ్వవిద్యాలయాల్లో కాషాయ ప్రభుత్వాధినేతల పెత్తనం వంటివన్నీ కలసి ఇంతటి దురవస్థను తెచ్చిపెట్టాయి. వివిధ పార్టీల జాతీయ నాయకులు ముఖ్యమంత్రులు హైదరాబాద్ రావడం, సందేశాలు పంపడం కేంద్రానికి మింగుడు పడకున్నా ప్రజాస్వామ్య రాజకీయాలలో దాన్ని నిరోధించే శక్తి ఎవరికీ వుండదు. ఆఖరుకు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఏదో ఒక మేరకు విచారం వెలిబుచ్చాల్సి వచ్చింది. రోహిత్ ఆత్మహత్య చేసుకోవలసిన దురదృష్టకర పరిస్థితులు వుండటం బాధాకరమని ఆయన పేర్కొన్నారు గాని నిజానికి అవి అధికారపక్షం పుణ్యాన పెరిగినవే. యూెవోహెచ్ కేంద్రం అధీనంలోది గనక వివాదం ఎబివిపితోనే గనక బిజెపి రాజకీయ బాధ్యత తప్పుకునే అవకాశమే లేదు.కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ లేఖరాసి వత్తిడి పెంచిన వాస్తవాన్ని ఖండించడం కుదరదు కూడా. ఆయన ప్రజలకు దగ్గరగా వుంటారా అనేది ఇక్కడ చర్చ కాదు. అవన్నీ ఏమున్నా ఆరెస్సెస్ భావజాలాన్ని తుచ తప్పకుండా పాటించే దత్తాత్రేయ యూనివర్సిటీ జాతి వ్యతిరేకుల అడ్డాగా మారిపోయిందని చెప్పడం చాలా అవమానకరం. ి దేశమే అసహనానికి అడ్డాగా మారిపోయిందన్న ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో లౌకిక వాదుల విశాల వేదిక విస్త్రత ప్రతిఘటన అవసరాన్ని హెసియు చాటిచెప్పింది.
జరిగిన దానికి క్షమాపణలు చెప్పి తక్షణ నివారణ చర్యలు తీసుకోవలసింది పోయి బిజెపి దాని అనుబంధ సంస్థలు ప్రత్యక్ష పరోక్ష మిత్రులు మరోసారి విద్యార్థులపైనే దాడి చేశారు. పుండుమీద కారం చల్లినట్టు వ్యవహరించాయి. పోలీసులు ఉన్నతాధికారులు నివేదికల్లో పేర్కొన్న వాస్తవాలకు విరుద్ధమైన విడ్డూరవాదనలు చేస్తున్నారు. అసలా ఎబివిపి విద్యార్థిపై పెద్దగా దాడి జరిగిందే లేదని కోర్టుకు పోలీసులు నివేదించారు. బిసి వర్గానికి చెందిన మోడీ గురించి , సోషల్ ఇంజనీరింగ్ గురించి గొప్పలు చెప్పే బిజెపి వారు ఆందోళనలో ముఖ్యాంశాలు వదలిపెట్టి ఆత్మాహుతి చేసుకున్న రోహిత్ దళితుడవునా కాదా అనే మీమాంస రగిలించారు. మీడియాలో కొందరు ప్రబుద్దులు, సోషల్‌మీడియాలో అగ్రవర్ణ వీరశైవులు రెచ్చిపోయి మృతునికి కళంకం ఆపాదిస్తున్నారు. విద్యార్థులను పరామర్శించడమే శవరాజకీయం అనేవారు శవం కులం వెదికే పని మొదలుపెట్టారు.మంత్రి సృతి ఇరానీ దళిత(ఎఎస్‌యు) విద్యార్థుల సస్పెన్షన్ నిర్ణయంలో దళిత అధ్యాపకులు కూడా భాగంగా వున్నారని ప్రకటించి వారు కొన్ని బాధ్యతల నుంచి వైదొలగడానికి కారకులైనారు. వారంతా పాలనా బాధ్యతలనుంచి వైదొలగడంతో మరో సంక్షోభం మొదలైంది.పైగా ఇది ఇతర యూనివర్సీటీలకూ వ్యాపిస్తున్నది.
ఇంతకు ముందు అమీర్ ఖాన్ విషయంలోనూ.. ఢిల్లీలో చర్చీలపై దాడుల విషయంలోనూ మోడీ ఇలాగే చేశారు. మొదట ఆయన అనుయాయులు సహచరులు విమర్శలపై వీరంగం తొక్కుతారు. ప్రధాని మాట్లాడకపోవడంపై విమర్శల వాన కురుస్తుంది. అదంతా అలా జరగనిచ్చి ఆ పైన దాని గురించి ఖండనో విచారమో వ్యక్తం చేయడం మోడీ తెరహాగా వుంది. ఇప్పుడు వారణాసిలోనూ కొన్ని నిరసనల తర్వాత ఇలా చెప్పినట్టు సమాచారం. పార్టీ అగ్రనేత వెంకయ్య నాయుడు, జాతీయ కార్యదర్శి మురళీధరరావు, కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ వంటివారంతా సమర్థించుకోవడానికి అవతలివారిపై దాడికి తంటాలు పడుతుంటే తాపీగా చూసిన మోడీ హఠాత్తుగా ఏవో రెండు ఓదార్పు వచనాలు పలకడంపై ప్రతిపక్షాల విమర్శలు కొట్టిపారేయలేము.. భారత మాత ఒక ముద్దుబిడ్డను కోల్పోయింది అంటూ మోడీ మాత్రం ఉద్వేగాత్మక భాషను ఉపయోగించారు. అలాగైతే తమ మంత్రి సృతి ఇరానీ మాట్లాడేదేమిటో కూడా ప్రధాని తెలుసుకోలేదా? మందలించి మార్చలేదా అనేది ప్రశ్న. ఇప్పుడు ఆయన మాట్లాడగానే ఇరానీ రోహిత్ తల్లితో ఫోన్‌లో సంభాషించడం అన్నీ జరిగిపోతున్నాయి. మరికొన్ని సర్దుబాటు చర్యలు తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. గుజరాత్ ఘటనలపై విచారం వ్యక్తం చేస్తారా అన్నప్పుడు కారుకింద పప్పీ పడితే బాధపడరా అంటూ వ్యాఖ్యానించి విమర్శలు కొనితెచ్చుకున్న మోడీ తర్వాత అనునయ వాక్యాల అవసరం గుర్తించారు. లౌకికవిలువలూ సామాజిక న్యాయం కోసం పోరాడే చైతన్యం గల ఈ దేశంలో ఏకపక్ష భాష గుజరాత్ వెలుపల చెల్లుబాటు కాదని తెలుసుకున్నారు. రోహిత్ విషయంలోనూ అలాగే విచారం వెలిబుచ్చారు గాని అసలు జరగాల్సింది ఆ కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రక్షాళన. పాతుకుపోయిన వివక్షతా ధోరణుల తొలగింపు. ఆ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవలసిన దురదృష్టకర పరిస్థితులు మార్చేందుకు అవసరమైన సాహసోపేత సమగ్ర చర్యలు ప్రకటిస్తారేమో చూడాలి.అప్పుడే ఆయన మాటలకు నిజమైన విలువ.
దత్తన్న లేఖ, సస్పెన్షన్లు ఆత్మహత్యలెపౖన పొరబాటు జరిగిందని ఒప్పుకుని దిద్దుబాటు చర్యలు తీసుకుంటే ఇంతకన్నా మెరుగ్గా వుండేది. కాని బిజెపి రాజకీయ సైద్ధాంతిక స్వభావం అందుకు సిద్ధమయ్యే ప్రసక్తి వుండదు. కమ్యూనిస్టులనూ లౌకిక వాదులను మేధావులను శాపనార్థాలు పెట్టేస్తే అదే సర్దుకుంటుందనేది వారి ఆలోచన.. సస్పెన్షన్ల నిలిపివేత ఆలస్యంగా ప్రకటించిన అసమగ్ర చర్య. నిజానికి చాలామాసాలుగా స్కాలర్‌షిప్పుల బిగింపుతో సహా అనేక కక్ష లేదా శిక్ష చర్యలు సాగిపోతున్నాయి. ఇంతటి సంఘీభావం తర్వాత కూడా తప్పు దిద్దుకోవడానికి మీనమేషాలు లెక్కిస్తున్న వైస్‌ఛాన్సలర్ అప్పారావు గాని, కేంద్రం గాని ఈ ఒత్తిడి ే లేకపోతే మరెంత నిర్లక్ష్యపూరితంగా వుండేవారో వూహించవచ్చు. ఈ ఉద్రిక్తత కొనసాగుతుండగానే ప్రతిష్టాత్మకమైన జవహర్‌లాల్‌నెహ్రూ యూనివర్సిటీకి మరో కాషాయానుయాయిని వైస్ చాన్సలర్‌గా వేశారంటే పట్టువిడుపులకు సిద్దంగా లేరన్నది స్పష్టం. విశ్వ విద్యాలయాల్లో మొదలైన ఆందోళనలు ఉద్యమాలే అనూహ్య మార్పులకు కారణమైనాయి. నెమ్మదిగా ఇక్కడా ఆ చరిత్ర పునరావృతమైతే ఆశ్చర్యపోనవసరం లేదు.
కదలని తెలుగు పాలకులు
. ఇది కేంద్రానికి సంబంధించింది గనక తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలకు వచ్చిన ప్రమాదమేమీ లేదు. నిజానికి వేముల రోహిత్ ఆత్మహత్య వెంటనే విసిపైన కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయలపై ఎఫ్‌ఐఆర్‌లో అభియోగాలు నమోదు చేయడంలో పోలీసులు గట్టిగానే వ్యవహరించారు. అయితే కథ అక్కడితో ఆగిపోయింది. దానిపై ఎలాటి కొనసాగింపు లేదు. కేంద్రం కూడా ఏదో పరిశీలనా నివేదిక పేరుతో సరిపెట్టడం తప్ప ప్రక్షళన చేసింది లేదు. రాజకీయ ఇబ్బందులను బట్టి కేంద్రం కదల్లేదని తెలుస్తూనే వుంది.కాని చంద్రశేఖరరావు చంద్రబాబు నాయుడు ఎందుకు వేగంగా స్పందించలేదు? ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, రాహుల్‌గాంధీ, సీతారాం ఏచూరి, సురవరం, తమ్మినేని చాడా వంటి వారంతా బాధితులను సందర్శిస్తే ముఖ్యమంత్రి కెసిఆర్‌గాని లేక ఆయన ప్రభుత్వం పార్టీల తరపున గాని ఎవరూ ఎందుకు సందర్శించలేదో అర్థం కాదు. జిహెచ్‌ఎంఎసి ఎన్నికలకోసం హైదరాబాదులోనే మకాం వేసిన టెక్నో సావీ మంత్రి కెటిఆర్ విద్యాసంస్థలతో తరచూ ముఖాముఖి జరుపుతుంటారు గదా ఆయనైనా ఎందుకు దయచేయలేదు? దత్తాత్రేయ ఇంటిని తెలంగాణ జాగృతి కార్యకర్తలు ముట్టడించి వుండొచ్చు గాని వారి అధినేత్రి పరామర్శించేందుకు రాకపోవడంలో ఆంతర్యం ఏమిటి? అలాగే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని ఆయన సహచరులు గాని అగ్గిబరాటాలుగా చెలరేగిపోయే రేవంత్ రెడ్డి వంటి వారు గాని దళిత నేతలు మోత్కుపల్లి నరసింహులు గాని మొహం చూపించకపోవడానికి కారణమేమిటి?(ఒక్క జూపూడి ప్రభాకరరావు వస్తే విద్యార్థులు వెనక్కు పంపేశారు) మన ముఖ్యమంత్రులు మాట్లాడకపోతే మానె కనీసం ప్రకటనలు చేసేందుకు కూడా సిద్ధం కాలేదు. టిడిపి టిఆర్‌ఎస్‌లు ఆ పని చేయకపోవడానికి స్థానిక జాతీయ కారణాలు కనిపిస్తున్నాయి. హైదరాబాదు ఎన్నికల్లో అన్ని కులాల ఓట్లు రావాలంటే కేవలం దళితులతో ముడిపడిన ఈ ఆందోళనకు దూరంగా వుండాలి. రెండోది కేంద్రంలో బిజెపితో మంచిగా వుండాలంటే ఇందులో తలదూర్చనేకూడదు.
ఈ పార్టీలు ప్రభుత్వాలు ప్రయోజనాలను బట్టి తప్ప ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం వంటి అంశాలకు విలువ నిచ్చేవి కావని దీన్ని బట్టి అర్థం అవుతున్నది. అసహనంపైన ఇప్పటి వరకూ ఉభయ చంద్రుల నుంచి ప్రకటనే రానప్పుడు ప్రతిఘటనను బలపర్చేందుకు ప్రత్యక్షంగా కదలిరావడం వూహకందేదేనా?
