టినాపై జగన్‌పార్టీ అతి భరోసా

jagan babu11
రాజకీయాలు తెలిసిన వారందరికీ గత కొన్నేళ్లలో వాడుకలోకి వచ్చిన టినా ఫినామినా తెలుసు. దేర్‌ ఈజ్‌ నో అల్టర్‌నేటివ్‌(టిఐఎన్‌ఎ) అనే మాట మామూలుగా అధికార పక్షానికి వాడుతుంటారు. కాంగ్రెస్‌ చాలా కాలం తనకు ప్రత్యామ్నాయం లేదనుకుంది. ఇప్పుడు దానికి పార్లమెంటులో ప్రతిపక్ష హౌదా లేకుండా పోవడమే గాక కర్ణాటక తప్ప మరే పెద్ద రాష్ట్రమూ చేతిలో లేదు. బిజెపి కూడా గతంలో అలా అనుకుంది గాని ఒక్క సారికే ఓడిపోయింది. ి ఆంధ్ర ప్రదేశ్‌కు వచ్చే సరికి అధికారం నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ నానా తంటాలు పడుతున్నారు.విధానాలు తప్పయినా సమర్థించుకోవడానికి వ్యతిరేకత పెరక్కుండా చూసుకోవడానికి చిట్కాలు వెతుకుతున్నారు. కాని తమాషా ఏమిటంటే ఇక్కడ టినా తమకు వర్తిస్తుందని వైఎస్సాఆర్‌ పార్టీ విపరీతమైన నమ్మకంతో వుంది. చంద్రబాబుపై వ్యతిరేకత పెరుగుతున్నది గనక అది మాకు గాక మరెవరికి లాభం చేస్తుంది? మా పార్టీ మా నాయకుడు జగన్‌ తప్ప జనానికి వేరే ప్రత్యామ్నాయం ఏముంది ? అంటూ ఆ పార్టీ నేతలు పలువురు ప్రశ్నలు వేస్తున్నారు. ఏది ఎలా పోయినా తమ కార్యాచరణ ఉధృతంగా వున్నా లేకున్నా ఎన్నికల నాటికి ప్రభుత్వ వ్యతిరేతక తమ వైపు తిరగడం అనివార్యమని వారు గొప్పగా చెబుతున్నారు. ఒకరో ఇద్దరో గాక వేర్వేరు చోట్ల వేర్వేరు సందర్భాల్లో కలిసిన వివిధ స్థాయిల నాయకులు ఇదే పల్లవి ఆలపిస్తున్నారంటే బహుశా విధానపరంగా వారు ఈ నిర్ణయం తీసుకుని వుండాలి.
ప్రభుత్వం తప్పిదాలు నిజం, వ్యతిరేకత పెరగుతున్న మాట నిజం. కాని అదంతా వైసీపీపై అనుకూలతగా మారిపోతున్నదా? మారిపోక తప్పదా? అనేవి కీలక ప్రశ్నలు. ఆ మాటకొస్తే జగన్‌ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఆ ఆకర్షణ 2014 ఎన్నికల్లోనూ అంతకు ముందూ వున్నంత జోరుగా ఇప్పుడు వున్నాయా? ఉన్నాయనే అంటున్నారు అనుకుంటున్నారు వైసీపీ నేతలు. అధిష్టానం కూడా. పైగా ముఖ్యమంత్రి కాలేదనే వాస్తవాన్ని సరిగ్గా అర్థం చేసుకుని కారణాలు సమీక్షించుకుని సరిదిద్దుకునే బదులు జగన్‌ ఇప్పటికీ ఆ పరిస్థితి అలాగే వున్నట్టు తమ ప్రభుత్వం ఏర్పడ్డం ఖాయమైనట్టు లెక్కలు వేసుకుంటున్నారట. ‘మంత్రివర్గం’లోకి తీసుకోవడం గురించి కూడా అప్పుడప్పుడూ ప్రస్తావనలు వస్తుంటాయట. ఇదంతా వింటుంటే వైసీపీ కొంత అతిశయోక్తులలో వున్నట్టు కనిపిస్తుంది. వారి బలం ,ఓటింగు ప్రధాన ప్రతిపక్ష స్థానం అన్నీ నిజమే గాని ఇవి 2014 లాగే ఇప్పుడూ వున్నాయని, 2019కి ఇలాగే వుంటాయని అనుకోవడంలో వాస్తవితక ఏమంత లేదు. నిజానికి ఆ పార్టీలోనూ అంతర్గత అసమ్మతి తక్కువగా లేదు. జగన్‌ వ్యవహార శైలి మారాలని కోరే సీనియర్లు అసలు అవకాశమే దొరకని జూనియర్లు కూడా తమదైన శైలిలో సణుగుతూనే వున్నారు.లోపల పరిస్థితే ఇలా వుంటే ప్రజల్లో వుండదా? వేగంగా మారుతున్న పరిణామ క్రమంలో ఎప్పటికప్పుడు ప్రజల్లో వుంటూ కదలిక చూపే బదులు వున్న పునాది సుస్థిరమని నమ్ముకుని కాలం గడిపేస్తే సరిపోదు. తెలుగుదేశంపై విమర్శ ఒక భాగమే గాని అదొక్కటే అధికారం తెచ్చిపెట్టదు. పైగా ఆ విమర్శించే హక్కు పవన్‌ కళ్యాణ్‌కో మరోకరికో లేదని మా మాటే వింటారని అనుకోవడం కూడా పొరబాటే. కొత్త శక్తులు వస్తుంటాయి. కొత్త సమీకరణలు ఏర్పడుతుంటాయి. వాటిని బట్టి ఫలితాలూ మారవని లేదు.2009లో చిరంజీవి ప్రజారాజ్యం నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ కావాలని తెచ్చారని తెలుగుదేశం విమర్శిస్తుండేది.ఇప్పుడు పవన్‌ను కూడా బిజెపి టిడిపి కీలుబొమ్మ అన్నట్టు వైసీపీ మాట్లాడుతున్నది. ఇలాటివి ప్రజలు పెద్దగా మెచ్చరు. విమర్శించడం ఉద్యమించడం, ప్రజలను ఆకర్షించడం అందరూ చేస్తూనే వుంటారు. ప్ర్రతిపక్ష నేతగా జగన్‌ విఫలమైనాడనటం సరికాదని శక్తికొద్ది చేస్తున్నాడని నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. అయిత శక్తియుక్తులు పెంచుకోవలసిన బాధ్యత కూడా ఆయనపై వుంది. చంద్రబాబును విమర్శించడం ఓకే.తనపై వచ్చే విమర్శలను సరిదిద్దుకోవడం కూడా ముఖ్యమే. అవన్నీ లేకుండా టినామ స్మరణతో దాన్నే నమ్ముకుని కూచుంటే కుదిరేపని కాదు.పజల పూర్తి విశ్వాసం పొందిన వారే ప్రభుత్వాలు ప్రాతినిధ్యాలు పొందుతారు. అంతేగాని వైసీపీ టీడీపీల ఓటింగు లేదా మద్దతు ఎప్పుడూ స్థిరోభవ అని ఒకే రకంగా వుండదు.పైగా ప్రతిపక్షంలో ఆ విధమైన ఆలసత్వం మొదటికే మోసం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *