మోడీ జపాన్‌ అణుడీల్‌- ఎపి ఢమాల్‌!

11-vzgnrns4-arr_11_2929280f kovvada11

రెండు రోజుల జపాన్‌ పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశ ప్రధాని షింజో అబెతో కుదుర్చుకున్న అణు ఒప్పందం ప్రభావం ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్‌పైనే పడుతుంది. ఎందుకంటే అనేక చోట్ల అణువిద్యుత్‌ కర్మాగారాల స్థాపనకు వ్యతిరేకత వస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం ఏరికోరి ఆహ్వానిస్తున్నది. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలోనూ, నెల్లూరు జిల్లాలోనూ వీటిని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రస్తుతం దేశంలో అణు విద్యుత్‌ ఉత్పత్తి 6219 మెగావాట్లు వుండగా మరో ఎనిమిదేళ్లలో దీన్ని మూడు రెట్లు పెంచాలని కేంద్రం భావిస్తున్నదట. పర్యావరణ పరంగానే గాక భద్రత రీత్యా కూడా ఈ అణుకర్మాగారాల స్థాపనకు ప్రజల నుంచితీవ్ర వ్యతిరేకత వుంది. ఇదే జపాన్‌లో సునామి వచ్చినపుడు పుకుషిమా అణువిద్యుత్‌ కేంద్రం ప్రమాదానికి గురైనప్పుడు ప్రపంచమంతా ఎంత ఆందోళన చెందిందో మర్చిపోలేము. అదే దేశం నుంచి అణు విద్యుత్‌ పరికరాలు కొనుగోలు చేయడం ఆసక్తికరమే గాక ఆందోళన కరం కూడా. అయితే ప్రపంచంలో ఈ పరికరాల తయారీపై జపాన్‌ కంపెెనీ తోషిబా గుత్తాధిపత్యం వుంది.ఆ రంగంలో దాదాపు 75 శాతం ఆ దేశమే తయారు చేస్తుంది.జపాన్‌ స్టీల్‌ వర్క్స్‌తో కలసి రియాక్టర్ల నిర్మాణం జరుగుతుంటుంది. అమెరికాలోని వెస్టింగ్‌హౌస్‌ కూడా తోషిబా అనుబంధ సంస్థవంటిదే. జపాన్‌ను పక్కనబెడితే రష్యా చైనాలకు ఆ సామర్థ్యం వుందట.ఫ్రాన్స్‌ వంటి దేశాలు కూడా తోషిబాతో కలసి పనిచేస్తుంటాయి. కాబట్టి ముందు జపాన్‌తో అవగాహనకు వస్తే తక్కిన ప్రపంచం కూడా ఒప్పుకుంటుందని ప్రభుత్వ వ్యూహంగా వుంది. ఇందుకోసం ఆరేళ్లుగా జపాన్‌తో మంతనాలు జరుపుతున్నారు.మోడీ కూడా గత ఏడాది ప్రాథమిక అవగాహనకు వచ్చారు. అయితే ఆ తర్వాత జపాన్‌ కొన్ని సందేహాలు వెలిబుచ్చింది. వాటికి సమాధానంగా ఈ ఒప్పందంలో రద్దు క్లాజు ఒకటి చేర్చారు. భారత దేశం మరోసారి అణుపరీక్ష జరిపితే ఈ ఒప్పందం దానికదే రద్దయిపోతుందని ఆ క్లాజు సారాంశం. కాబట్టి ఇక్కడ మన విధాన నిర్ణయాన్ని విదేశాల చేతుల్లో పెడుతున్నామన్నమాట. కొవ్వాడ అణుపార్కు డిజైనింగ్‌ సమయంలోనే తోషిబా అమెరికాలోని వెస్గింగ్‌ హౌస్‌, జనరల్‌ ఎ లక్ట్రికల్స్‌ను కొనుగోలు చేసింది. మోడీ అమెరికా పర్యటన సమయంలో ఇరు దేశాల అణు ఒప్పందాలపై వేగంపెరిగింది. ఇప్పుడు జపాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందం కూడా పార్లమెంటు ఆమోదం పొందితేనే చెల్లుతుంది. వ్యాపార ప్రయోజనాల కోసం అదేమంత పెద్ద సమస్య కాకుండా ఆ దేశం జాగ్రత్త పడొచ్చు. కాబట్టి ఎపి గుండెలపై అణు కుంపటి రగులుతుందన్న మాట. పారా హుషార్‌!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *