(కె)టిఆర్‌ఎస్‌ – ఫలితాలతో పనిలేని సుహృద్భావ హామీ?

ktr2222ktr1111(కె)టిఆర్‌ఎస్‌ – ఫలితాలతో పనిలేని సుహృద్భావ హామీ నిస్తారా?

. జిహెచ్‌ఎంసి ఎన్నికలలో టిఆర్‌ఎస్‌ సారథిగా కెటిఆర్‌ రంగ ప్రవేశం చేసిన తర్వాత వ్యూహాత్మకంగానే అత్యుత్సాహంప్రదర్శిస్తున్నారు. అంతకుముందు మాట్లాడిన తీరుకుపూర్తి భిన్నంగా స్నేహగీతాలాపన సాగిస్తున్నారు. ఆఖరుకు పార్టీ పేరును తెలుగురాష్ట్రసమితిగా మారుస్తామనీ భీమవరంనుంచి పోటీ చేయొచ్చనీ చెప్పి తర్వాత ఇదంతా జోక్‌ అని సర్దుకున్నారు. వందస్థానాలు గెలుస్తామని వేలసార్లు ప్రకటించడమే గాక మేయర్‌ తమవారు కాకపోతే రాజీనామా చేస్తానని సవాలు విసిరారు. ఆయన సవాలు వంద స్థానాలు తెచ్చుకోవడంపైనే అన్నట్టు మీడియా వ్యాఖ్యతలు ప్రతిపక్షాలు ప్రతిస్పందిస్తే ే టిఆర్‌ఎస్‌ వారు మేయర్‌ పీఠం గురించేనని సన్నాయి నొక్కులునొక్కారు. ఆ రోజున నమస్తే తెలంగాణలో ఆ సవాలును ఏమాత్రం ప్రముఖంగా ఇవ్వకపోవడం గమనించదగ్గది. పైకి ప్రచారార్భాటం చేస్తున్నా పాలకపక్షం ఆచితూచి వ్యవహరిస్తుందని చెప్పే ఉదాహరణలు. కెటిఆర్‌ మితిమించిన అత్యుత్సాహంతోనే ఇవన్నీ మాట్లాడాల్సిన పనిలేదనుకునేవారూ వున్నారు. తమ నేతను దూరం పెట్టారని హరీష్‌ అనుయాయులలో ఆవేదన ఆగ్రహం వున్నాయి. రేపు జయాపజయాలను బట్టి వాటి ఉధృతిని బట్టి రేపు ఆయన మాటల విలువ లేదా విమర్శ వుంటాయి. అవి నారాయణ్‌ఖేడ్‌పైనా ప్రభావంచూపిస్తాయి.
ప్రస్తుత ప్రచారంలో కాంగ్రెస్‌ టిడిపి బిజిపి నేతలు ఉద్యమ కాలంలో ఉద్రేకాలు రెచ్చగొట్టడం,విగ్రహాలపై దాడి వంటి మాటలు గుర్తు చేస్తున్నారు. ఇది రాజకీయంగా వాంఛనీయం కాదు. కలసి వుండాల్సిన ప్రజల మధ్య మళ్లీ పాత ఉద్రేకాలు పురికొల్పడం వల్ల ప్రయోజనం లేదు. పైగా సిపిఎం మినహా తక్కిన పార్టీలన్నీ రెండు వైపులా రెండు విధాల మాట్లాడిన సంగతి అందరికీ తెలుసు. కమ్యూనిస్టేతర పార్టీల నేతలు చాలామంది తెలంగాణలో తీవ్ర వ్యాఖ్యలే చేశారు. రేవంత్‌ రెడ్డి, పయ్యావుల కేశవ్‌, పొన్నం ప్రభాకర్‌, మధుయాష్కీ, లగడపాటి వంటి చాలా మంది ఉద్రేకాలు పెంచేలా మాట్లాడారు. ఆ రోజుల్లో ప్రజలు కూడ విజ్ఞత గలవారే గనక నాయకులు కవ్వింపులకు లోనవకుండా ప్రశాంతత కాపాడుకున్నారు. ఇప్పుడు విభజన తర్వాత ఆ అవసరమూ వుండదు. ఇప్పుడు టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం తన పట్టుపెంచుకోవాలని చూస్తున్నది తప్ప ఉద్రిక్తతలు కోరుకోదు.పైగా హైదరాబాదులో పెట్టుబడులు వ్యాపారాలు సినిమా మీడియా తదితర రంగాల్లో అందరి వాటా వుందని దానికి బాగా తెలుసు. తెలుగుదేశం ఎంఎల్‌ఎలే పార్టీలు మార్చేసినపుడు గతంలో దానికి ఓటు వేసిన వారిలోనూ కొంత మార్పు కనిపిస్తుంది.నగరంలోని వ్యాపార వర్గాలు సంపన్న తరగతులు పాలించేపార్టీతో మంచిగా వుండటం అనివార్యమనుకుంటారు. ప్రాంతీయ సామాజిక కారణాల రీత్యా తెలుగుదేశం వెనక వున్న చోట్ల కూడా కవితనో కెటిఆర్‌నో ఆహ్వానించి మంచి చేసుకుందామన్నట్టు చూస్తున్నారు. అసలు ఇద్దరు ముఖ్యమంత్రులూ సర్దుబాటు చేసుకున్నారనీ, రెండు రాష్ట్రాల పాలక కుటుంబాల సామాజిక తరగతులతో కొత్త సమీకరణ జరుగుతుందని కూడా ఒక ప్రచారం నడుస్తున్నది. ఈ నేపథ్యంలో నిజాం కాలేజీలో జరిగిన ప్రారంభ సభలో చంద్రబాబు నాయుడు టిఆర్‌ఎస్‌ను రాజకీయంగా ఒక్క విమర్శకూడా చేయకపోవడం చర్చనీయమైంది.తమకాలంలో అభివృద్ధి జరిగిందనీ, 2019లో అధికారానికి తీసుకురావాలనీ చెప్పినా నామకార్థంగా చెప్పినట్టేవుంది. లోకేష్‌మాటల్లోనూ అభివృద్ధికి సంబంధించిన పోలికలతో పోటీ తప్ప రాజకీయ పదునులేదు. అసలు అధినేత నుంచి తమకు అండదండలు ఆర్థిక వనరులు రావడం లేదని టిటిడిపి నేతలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. బిజెపి అచ్చంగా మజ్లిస్‌ సీట్ల గురించే మాట్లాడుతూ మతపరమైన ఎత్తుగడలు కొనసాగిస్తున్నది.చండీయాగకర్తగా వాళ్లను మించిపోయిన కెసిఆర్‌ మజ్లిస్‌తో లోపాయికారి అవగాహన చేసుకున్నారు.
సిపిఎం సిపిఐ ఎంసిపిఐలోక్‌సత్తా తదితర పార్టీలు వన్‌ హైదరాబాద్‌ పేరిట రంగంలో వున్నాయి. ఇప్పటికి 60 సీట్లకు సంబంధించిన పోటీలపై అవగాహనకు వచ్చాయి.గతంలో సిపిఎంకు ఒకసారి కార్పొరేషన్‌లో స్థానం వుండేది. శివారు మునిసిపాలిటీలలో కౌన్సిలర్లు వుండేవారు. ఇప్పుడు కూడా అలాటి చోట్ల కొంత ప్రభావం వుంటుంది. కార్మికులు పేద ప్రజలు నివసించే చోట్ల వారికోసం పోరాడిన కమ్యూనిస్టులకు కొంత ఓటింగు వుంది. స్థానిక ఎన్నికలు గనక స్వతంత్రులు కూడా ఫలితాలను ప్రభావితం చేయొచ్చు. టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు జాబితాలు ప్రకటించగా ఎన్‌డిఎ సీట్ల పంపకం చర్చలు ముగించి సిగపట్ల గోత్రంలో పడింది. కేంద్ర మంత్రులూ పవర్‌స్టార్లు అగ్రనేతల జోక్యాల వరకూ వున్నా సఖ్యత సమస్యగానే వుంది.

రాజకీయ వ్యూహాలు వాదోపవాదాలు పక్కనపెట్టి చూస్తే – వాస్తవానికి హైదరాబాదును విశ్వనగరం అంటూ హంగామా ఎంత చేసినా సమస్యల మయంగానే వుంది. పట్టుమని గంటసేపు వర్షం కురిస్తే చాలా ప్రాంతాలు జలాశయాలవుతాయి. మూడోవంతు జనాబా ఇప్పటికీ మురికి వాడల్లోనే వుంటున్నది. వేలకోట్లు వ్యయమవుతున్నా పనులు నత్తనడక నడుస్తున్నాయి.టిఆర్‌ఎస్‌ వచ్చాక కూడా ఈ పరిస్తితిలో పెద్ద మార్పులేదనేది నిజం. భవనాల తరలింపుపైనా అనేక తొందరపాటు ప్రకటనలు చేశారు. మెట్రో రైల్వే ఆలస్యం చేసిన కెసిఆర్‌ ఆ కారణంగా ఆర్థికభారం పెంచడం తప్ప అదనంగా సాధించింది లేదు. ఆ రోజుల్లో ఆయన బొమ్మలకు పూజచేసిన సుల్తాన్‌బజార్‌ వ్యాపారులే ఇప్పుడు ధర్నాలు చేస్తుంటారు.నిజానికి మెట్రో సమస్యలోనూ ముందుగా జోక్యం చేసుకుని కొనసాగుతుందని చెప్పింది కెటిఆరే! ఈ ఎన్నికల ప్రచారం ప్రారంభించేముందు ఆ రైలులో విహరించిందీ ఆయనే. గోదావరి జలాలు నెత్తిన చల్లుకుని ఫోటోల్లో కనిపించిందీ ఆయనే.
ఆయన చెబుతున్నట్టుగా ఏదో విధంగా హైదరాబాదు కార్పొరేషన్‌పై టిఆర్‌ఎస్‌ జెండా ఎగిరినా సీట్లన్నీ వచ్చిపడిపోతాయనుకోవడం అతిశయోక్తి. తమ సుహృద్భావ సందేశాన్ని త్రికరణశుద్ధిగా వారు నిరూపించుకోవలసి వుంటుంది. మినీ ఇండియా హైదరాబాదులో ఎలాటి ప్రాంతీయ పోకడలు వివాదాలు తలెత్తకుండా సమతుల్య విధానం తీసుకోవలసి వుంటుంది. రేపు ఫలితాలు మరో విధంగా వచ్చినా సుహృద్భావం దెబ్బ తినకుండా చూస్తామని టిఆర్‌ఎస్‌ మాట ఇవ్వాలి. హైదరాబాదులో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడం, పేదల సదుపాయాలను పెంచడం, ప్రజల మధ్య కుల మత ప్రాంతీయ తేడాలకు అతీతంగా ఐక్యతా భావన కాపాడ్డం అన్ని పార్టీల బాధ్యత. టిఆర్‌ఎస్‌ నుంచి ఆ విధమైన సమగ్ర విధానం వస్తుందేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *