ట్రంపును మించిన కంపు -మీడియా వర్మ- ప్రజల కర్మ

అమెరికా అద్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ జె ట్రంప్ విజయంపై నా అభిప్రాయాలు అంచనాలు ఈ వెబ్‌పేజిలోనూ ఛానళ్లలోనూ మిత్రులతో పంచుకున్నాను. ఎవరైనా అలా చేయొచ్చు. అగ్రశ్రేణి ప్రముఖులు చాలామంది తమ స్పందనలు తెలియజేశారు కూడా. ఎవరి భావాలు వారివి. కాని ఈ క్రమంలో రామ్‌గోపాల్ వర్మ అనే దర్శకుడు(దురదృష్టవశాత్తూ తెలుగువారే) వెలిబుచ్చిన అభిప్రాయాలకు హిందూస్తాన్ టైమ్స్ పత్రిక ప్రపంచంలోనే అత్యంత దారుణమైన వర్ణదురహంకారానికి నిదర్శనంగా పేర్కొంది. ఆయన ట్వీట్లు, వాటిపై తన వ్యాఖ్యలు కూడా ప్రచురించింది. నిజానికి ఓటింగుకు ముందే ట్రంప్ కొద్దికొద్దిగా స్వరం మార్చుకుంటూ వచ్చారు. గెలిచిన తర్వాత మరింత సమన్వయరాగం ఆలపించారు. కాని ఎప్పటి విజయాలో చూపించుకుంటూ -ఒకటిన్నర దశాబ్దంగా ప్లాపులు అందులోనూ అనేక జుగుప్సాకరమైన ఎబ్బెట్టయిన చిత్రాలు తీస్తూ . వికృత వ్యాఖ్యానాలూ చేస్తూ వస్తున్న వర్మ ట్రంపుకన్నా కంపుగా మారి వెకిలి రాతలకు దిగారు. నల్లజాతి వారిని స్త్రీలను అవమానించే అనేక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అద్యక్షుల భార్యల అందచందాలపైనా ట్వీట్లు పారేసుకున్నారు. 60 ఏళ్ల వయసులోనూ ట్రంప్ శృంగార వీరుడుగా వున్నట్టు కీర్తించారు. ట్రంప్ గెలుపును వూహించింది తానొక్కడే అయినట్టు కూడా అతిశయాలు చెప్పారు. ఆ పదాలు ఎందుకు గాని హిందూస్తాన్ టైమ్స్ కొన్ని అక్షరాలు మూసి చూపించింది. తిట్లు విమర్శల రూపంలోనైనా సరే మీడియాలో వుంటే వర్మ ప్రయోజనం నెరవేరుతుంది(పర్పస్ సర్వ్‌డ్ అన్నమాట)
ఇప్పుడు వర్మ చిత్రాలు వాటి తప్పొప్పులు చర్చించే పని పెట్టుకోవడం లేదు. మనం ఏమన్నా నా ఇష్టం(అదే ఆయన పుస్తకం పేరు కూడా) అంటారు. నచ్చితే చూడండి లేకపోతే లేదు అని గొప్పగా చెప్పేస్తారు. ఇక్కడొక విషయం ఏమంటే హైవే మీద ఎవరైనా ఇష్టానుసారం మాట్లాడుతుంటే లేక చేస్తుంటే మనం వారిస్తాము. చీదరించుకుంటాము. ఇన్ఫర్మేషన్ ఎంటర్‌టైన్‌మెంట్ హైవే మీద కూడా అంతే. మరీ వికృత వ్యాఖ్యలు చేస్తే తప్పంటాము. చెత్తంటాము. ఇంతకూ ఏ ప్రచారం లేనప్పుడు లేదా మసాలా తక్కువైనప్పుడు వర్మ వస్తే చూపిద్దామనుకునే మా మీడియా మిత్రులు కూడా ఇందుకు బాధ్యులు కాకుండా పోరు.
340 కోట్ల ఇంగ్లీషు ప్రాజెక్టు గురించి కూడా వర్మ మీడియాలో కథనాలిచ్చిన మరుసటిరోజే ఈ వికృత వ్యాఖ్యలు వచ్చాయని గుర్తిస్తే ఆయన ప్రచార వ్యూహం తెలుస్తుంది. కొంతకాలం కిందట నాకు తెలిసిన ఒక వ్యాపారవేత్త వర్మతో చిత్రం తీస ి కోట్లతో చేతులు కాల్చుకోవడమే గాక కనీసం మనిషిగా చూడలేదని వాపోయారు. పేరు అనవసరం. విషయమేమంటే ి బకరాలు మరింత మంది దొరకాలంటే మీడియా మోత తప్పనిసరి కదా? కాని అందుకోసం మహిళలను నల్లజాతి వాళ్లను లేదా మరికొన్ని తరగతుల వారిని కించపర్చేలా మాట్లాడ్డమే నీతిమాలిన వ్యవహారం.