ట్రంప్‌ విజయంలో సంకేతాలు

watch-the-most-quotable-moments-from-trumps-new-hampshire-victory-speech

రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ జాన్‌ ట్రంప్‌ అమెరికా45 వ అద్యక్షుడుగా మంచి ఆధిక్యతతో ఎన్నికవడం అంచనాలను తలకిందులు చేసిందనే మాట చాలా మంది వ్యాఖ్యాతలు మీడియా సంస్థలనుంచి వస్తున్నది. కాని ఆయన మాటలు ఎంత వికృతంగా విద్వేషపూరితంగా వున్నా ప్రస్తుత అమెరికా సమాజ నేపథ్యంలో ఆయన విజయం సాధించే అవకాశాలు వున్నాయనే అంచనాలూ కూడా వుంటూనే వచ్చాయి. కాని బలమైన కార్పొరేట్‌ మీడియా శక్తులు హిల్లరీ క్లింటన్‌ గెలిస్తే సురక్షితంగా వుంటామని భావించడంతో ఆమెకే అధిక ప్రచారం లభించింది. 72 అమెరికా పత్రికల్లో ఒక్కటి మాత్రమే ట్రంప్‌ను బలపర్చింది. అయితే హిల్లరీని గత పదహారేళ్ల అమెరికా అధికార వ్యవస్థలో భాగంగానూ, స్వయంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతగానూ ఓటర్లు పరిగణించారు. ట్రంప్‌ ఎంత అసహ్యంగా అహంభావంతో మాట్లాడినా ఆయనను వ్యవస్థకు బయిటివ్యక్తిగా ఏదైనా మార్పు చేసే శక్తిగా పరిగణించారు. ఇలా జరగాలనే ఆయన అందరూ విమర్శిస్తున్నా తన మాటతీరు మార్చుకోలేదు. అంతకంతకూ దూకుడుగా వెళ్లారు. విధాన స్పష్టత లేకపోయినా అమెరికాలోని వలస దార్లను నిలిపేస్తానని ముస్లిములకు వీసాలు నిరాకరిస్తామని, ఔట్‌ సోర్సింగ్‌ ఆపేస్తామనీ, నాటోతో సహా బయిటదేశాల భారం తగ్గిస్తామని ఏవేవో వాగ్దానాలు చేశాడు. అమెరికా గొప్పతనం దెబ్బతినిపోతుందని రెచ్చగొట్టాడు. నిరుద్యోగం పాక్షిక నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితిలో ఇవి బాగా ఆకట్టుకున్నాయి. పైగా డెమొక్రటిక్‌ పార్టీ ప్రచారం యావత్తూ ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలు అశ్లీలత వంటి వాటిపై నడిచింది తప్ప విధానపరమైన అంశాలు లేవనెత్తలేదు. ఎందుకంటే వారికీ ఇంతకంటే భిన్నమైన విధానాలేమీ లేవు.
నిజానికి విదేశాంగ విధానం, అమెరికా ప్రయోజనాల రక్షణ, కార్పొరేట్‌ అనుకూలత, కార్మికులపై వేటు వంటి విషయాల్లో ఉభయులవీ కుడి ఎడమ విధానాలే తప్ప తేడా నామమాత్రం.హిల్లరీ చాలా కాలం భర్తతో కలసి, తర్వాత విదేశాంగ మంత్రిగా వున్నారు. కాబట్టి ఇప్పుడున్న సమస్యల సృష్లిలో ఆమె పాత్రకూడా వుందని ఓటర్లు భావించారు. అసలు ఇద్దరు అభ్యర్థులలో ఎవరిని తక్కువ అసహ్యించుకుంటున్నామనే కోణంలో తప్ప ఇష్టప్రకారం ఎన్నుకోలేదు. మూడో అభ్యర్థిగా వచ్చిన బిన్నీ శాండర్స్‌ కొన్ని మౌలిక సమస్యలు లేవనెత్తి తన స్థానం స్థిరపర్చుకున్నాడు.కాని ఆయనపై ఒత్తిడి తెచ్చి తప్పించారు. షరామామూలుగా రెండు పార్టీల ఘర్షణగా ఎన్నిక నడిచింది. ఈ రెండింటి విధానాల్లో మౌలికమైన తేడా ఏమీ వుండదు. ట్రంప్‌ను కాదని హిల్లరీని ఎన్నుకోవలసిన విధాన తేడాలేమీ ఓటర్లకు కనిపించలేదు.పైగా గత 145 ఏళ్ల అమెరికా చరిత్రలోనూ డెమోక్రటిక్‌ పార్టీ వరుసగా మూడోసారి గెలిచిన ఉదాహరణే లేదు. కనుక హిల్లరీ ఓటమికే అవకాశం ఎక్కువని అర్థమవుతూనే వుంది. అయినా ఆనుకూల పత్రికలు ఆఖరు వరకూ ఆమెకే బ్రహ్మాండమైన మద్దతు చూపుతూ వచ్చాయి. చివరకు ఇప్పుడు ఫలితం వేరే వచ్చిందంటున్నారు. నిజానికి ఇది అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థ దుర్గతికి ప్రతిబింబం. ఇద్దరిలో ఎవరూ మాకు ఇష్టంలేదని న్యూయార్క్‌ టైమ్స్‌ ఇంటర్వ్యూలో ప్రతిపదిమంది ఓటర్లలోనూ ఎనిమిది మంది చెప్పారట.
వాగాడంబరం, జాతి ద్వేషం, అసభ్య భాషణం ఓటర్లను ఆకర్షించే అవకాశాలు అప్పుడప్పుడూ వస్తుంటాయి. కాని అవన్నీ అధికారంలోకి వచ్చాక ఎలా చేస్తారనేది జాగ్రత్తగా గమనించాలి. తప్పనిసరిగా ట్రంప్‌ వివాదాస్పదంగానూ విద్వేషపూరితంగానూ వ్యవహరించే అవకాశాలెక్కువ.

భారత దేశానికి మొదటి నుంచి డెమోక్రాట్లతో ఎక్కువ సంబంధం. కాబట్టి ట్రంప్‌ ఎన్నిక ి నష్టమంటున్నారు గాని నిజానికి మనపై ఆంక్షలు పెట్టిన విషయంలో డెమోక్రాట్ల ప్రభావమే ఎక్కువ. 1998లో అణుపరీక్షల తర్వాత ఆంక్షలు ప్రకటించింది కూడా వారే. దేశంలోని ఉగ్రవాదులకు లేఖలు రాయడం, మానవ హక్కులు శాంతి గురించి మాట్లాడ్డం డెమొక్రాట్లకు అలవాటు. అయితే చివరకు అవన్నీఇతరులపై చర్యలకు కారణమవుతుంటాయి. ఒబామా 2010లో వచ్చినప్పుడు అమెరికా విమానాలకు ఆర్డరు పెట్టకపోవడంతో బాగా నిరుత్సాహంతో వెళ్లారు. పాకిస్తాన్‌కు సహాయం కూడా వారి హయాంలోనే అధికంగా అందుతుంటుంది. పైగా ఈ సారి ట్రంప్‌ను బిజెపి హిందూత్వ శిబిరం పూర్తిగా బలపర్చింది. ఆయన కోసం పూజలు చేశారు.ముస్లింలపై తీవ్రంగా మాట్లాడిన ట్రంప్‌ శైలి వారికి నచ్చింది. కాబట్టి ఇక్కడ మోడీత్వకు ట్రంప్‌ శైలికి బాగా అమరుతుంది. ఢిల్లీలోని అమెరికా రాయబారి రిచర్డ్‌ వర్మ భారత దేశం పట్ట విధానం విషయంలో ఎలాటి మార్పు వుండదని ముందే ప్రకటించారు. కాబట్టి ఈ విషయంలో పెద్దగా ఆందోళన అవసరం లేదు. అయితే మొత్తం ప్రపంచం దృష్టితో చూసినప్పుడు మాత్రం మరింత మితవాదం, ద్వేషభావం వైపు వెళ్లడానికి ఇది కారణమవుతుంది. రానున్నరోజుల్లో అమెరికాలో ఈ తరహా శక్తులు పుంజుకుంటాయి. అప్పుడు కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతాయి. అసలు ఇంత అధ్వాన్నంగా అసహ్యంగా అమెరికా ప్రజాస్వామ్యం దిగజారిందనే భావన ఇంకా తీవ్రమవుతుంది.ఇప్పటికే అరకొరగా వున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా ఆ ప్రభావంతో సమస్యలతో సవాలుగా మారుతుంది. దీనికి వ్యతిరేకంగా ఇస్లామిక్‌ తీవ్రవాద సంస్థలు గనక దాడి కేంద్రీకరిస్తే మరింత పెద్ద సంఘర్షణకు దారితీయోచ్చు. అందరి తరపున అద్యక్షుడిగా పనిచేస్తానని ట్రంప్‌ తొలి ప్రసంగంలో చెప్పారు గనక ఏం జరుగుతుందో చూద్దాం. ఆ తర్వాత మరిన్ని మాట్లాడుకుందాం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *