జీయర్‌ తలకిందుల తర్కం, నాయకుల భక్తి పరవశం

chinajear12kl
నవంబరు ఆరున అంగరంగవైభోగంగా జరిగిన త్రిదండి చిన జీయర్‌ స్వామి షష్టిపూర్తి ఉత్సవాల్లో ఇద్దరు గవర్నర్లు, ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు కేంద్ర మంత్రులూ ఇంకా అనేకమంది ప్రజాప్రతినిధులు మాజీ ప్రస్తుత అధికారులు పాల్గొనడం గతంలో లేని కొత్త వరవడి. ఇది వరకు సత్యసాయిబాబాకు లేదంటే కంచిస్వాములకు మాత్రమే పరిమితమైన ఈ తరహా వేడుకలను ఇప్పుడు చినజీయర్‌కు కూడా జరిపారంటే భావి కాలంలో ఆయన దేశ రాజకీయ యవనికపై ప్రత్యక్షంగానో పరోక్షంగానో కీలక ప్రభావం ప్రసరించనున్నారన్నమాట. రెండు మూడు మీడియా సంస్థలూ దీన్నికి ముందూ వెనకా కూడా చాలా గొప్పగా ప్రచారమిచ్చాయి. కాబట్టి ఇదేదో యాదృఛ్చికంగా జరిగింది కాదని చాలా శక్తులూ సంస్థలూ ఆయన వెనక మొహరించబడి వున్నారని స్పష్టమవుతుంది. దీనికి ముందే ఇచ్చిన ఇంటర్వ్యూలలో స్వామీజీ ప్రస్తుత ప్రధాని మోడీకి నూటికి నూరు మార్కులేసి ఆకాశానికెత్తేశారు.(అన్నట్టు పరిపూర్ణానందస్వాములైతే మోడీమీద ఒక పుస్తకమే రాశారు) దేశభక్తి దేశ భద్రత అంటూ ఇహలోక విషయాలు వాకృచ్చారు. దేశం గురించి చిన జీయర్‌ మాట్లాడినా ఆధ్యాత్మికంగా ఆయనను అధినేతలు కొల్చినా వ్యక్తిగతమైతే ఫరవాలేదు గాని ప్రభుత్వ హౌదాలో పాల్గొనడమే సమస్య. వారు వచ్చి ఆయనను అంతగా పొగిడేయడం ద్వారా ఒక అధికార ముద్ర వేస్తారు. తర్వాత వారి చుట్టూ చేరాలని చెప్పడానికి ఇది బాగా ఉపయోగమవుతుంది. ధనస్వాములు కాంట్రాక్టర్లు, రాజకీయ ఘనాపాటీలు వెళ్తుంటే మామూలు మధ్యతరగతి కూడా అనుసరిస్తారు. పేదా సాదా తమ తంటాలు తాము పడతారు. వీరి రాజకీయాలను వారు పొగడ్డం, వారి ధార్మికతను వీరు కీర్తించడం ఒక పరస్పర ప్రచార ప్రక్రియగా మారిపోవడం రాజ్యాంగ బద్దమేనా? ఉదాహరణకు సాయిబాబా చుట్టూ దేశాధినేతలు రాష్ట్రాధినేతలు కొందరు ఇతర దేశాల వారు కూడా వచ్చేవారు.తీరా ఆయన ప్రశాంతి నిలయంలో హత్యలు జరిగితే అడిగేవారు గాని చర్య తీసుకునేవారు కాని లేకుండా పోయారు. అది నిగూఢంగానే ముగిసిపోగా నాటి రాష్ట్రపతి శంకర్‌ దయాళ్‌ శర్మ ఏదో కవరింగ్‌ కామెంట్లు చేశారు! ఆఖరుకు ఆ సాయిబాబా అంతిమ దశ ఎంత అనుమానాస్పదంగా దుర్భరంగా జరిగిందో చూశాం. అప్పుడు ఈ ప్రభుత్వాలు కూడా నిస్సహాయంగా వుండిపోయాయి. అంటే అవసరం తీరిపోయిందన్నమాట. నిత్యానందస్వాములు, ఆశారాం బాపూలు, పిరమిడ్‌ స్వాముల లీలలన్నీ చూశాము.కంచి స్వామి కేసు విచారణ కొట్టివేత చూశాం. కనుక ప్రభుత్వాధినేతలు కాస్త జాగ్రత్త వహించడం మంచిది కదా.
కంచి స్వాములు జియర్‌ స్వాముల వంటి వారి పద్ధతి వేరే కావచ్చు గాని వారి చుట్టూ వుండే వాతావరణంలో పెద్ద తేడా ఏమీ లేదు. అవే ప్రవచనాలు అవే ప్రహసనాలు. లేకుంటే సర్వసంగ పరిత్యాగులు అంతటి ఆర్బాటాలను అనుమతించడమే వూహకందనిది. భక్తులు చేస్తామంటే కాదనడానికి మేమెవరం అన్న స్వామీజీ ఎవరి వీరందరిని తన భక్తులుగా భావిస్తున్నారా? అంటే వారు దైవ స్వరూపులా? అవతార పురుషులా? అదే నిజమైతే వారికి ఈ లౌకిక వేడుకల అవసరం వుందా? భక్తులు చేస్తామంటే మాత్రం మాటిమాటికి మందహాసం చిలికిస్తూ ఆద్యంతం ఆస్వాదించడంలో అలౌకికత ఏమైనా అగుపించిందా అంటే అదీ లేదు. స్వాముల వారి సేవలను చెప్పారు మంచిదే గాని దానికి అపరభగవంతులు కావనసరం లేదు, మామూలు మనుషులు కూడా తమదైన మేరకు చేస్తూనే వుంటారు. ఇక్కడ దాతల దగ్గర తీసుకుని కొంత దానం చేయడం మాత్రమే జరుగుతుంది.సకల సదుపాయాలతో పూజా పురస్కారాలతో తులతూగే అవకాశమూ లభిస్తుంది. తన శిష్యులు రాజాస్థానాలలో పొందే స్వర్గసౌఖ్యాలను చూస్తే బుద్ధుడు తలపట్టుకుని వుండేవాడని ఆయన వారసులు రాసిన గ్రంధాలు చెబుతాయి.
యజ్ఞం చేస్తే వాన తప్పక పడుతుందని స్వామీజీ చెప్పింది జరిగిందని ముఖ్యమంత్రి చెప్పడం రాజ్యాంగంలోని వైజ్ఞానిక స్పూర్తికి సరిపోతుందా? వాస్తుప్రకారం సచివాలయం పడగొట్టే ప్రభుత్వం అగ్నిప్రమాదాలను సాకుగా చూపడం నిజం కాదా? ఇక్కడే చట్టానికి వ్యక్తిగత విశ్వాసాలకు మధ్య వుండాల్సిన తేడాకు ఇదే ఉదాహరణ. స్వామివారి సామాజిక సృహ గురించి చాలా చెప్పారు గాని ఆ వేదిక మాత్రం దానికి నిదర్శనంగా లేదు. మానవసేవే మాధవ సేవ అన్న వివేకానందుడ నినాదంలో మానవత్వం వుంది. దీన్ని తిరగేసి మాధవ సేవలో మానవ సేవ చూడమని చెప్పడం ఏం తర్కం?ఇక మాధవ సేవ చేయాలంటే ఆలయాల బయిట రేట్టు ప్రకటించి మరీ వసూలు చేస్తుంటే పేద భక్తులు ఏం చేయాలి? ఆర్కే ఇంటర్వ్యూలో ఇళ్లకు వచ్చినందుకు డబ్బులు తీసుకునే స్వాముల గురించి చేసిన వ్యాఖ్యలు బాగానే వున్నాయి గాని ఈ స్వామివారు కూడా దానికి అతీతతం కాదని నాకు ప్రత్యక్షంగా తెలుసు.

అవన్నీ అలా వుంచితే అధికారహౌదాలో ఆయనపై భక్తి ప్రకటించి ప్రచారం చేసి పెట్టే ప్రక్రియ మాత్రం మంచిది కాదు. చట్టబద్దమూ కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *