ఎన్డీటీవీపై ఆంక్షల ఆపుదల!
ఏవో ఆరోపణలతో ఎన్డీటీవీని నవంబరు9న ఒకరోజు ఆపుచేయాలని ఆదేశాలిచ్చిన మోడీ ప్రభుత్వం సమాచార ప్రసార మంత్రి వెంకయ్య నాయుడు కొంత వెనక్కుతగ్గారు. పఠాన్ కోటలో పాకిస్తాన్ దుండగుల ప్రవేశంపై వార్తాకథనం ప్రసారంలో దేశభద్రతా సూత్రాలనూ మీడియా నియమావళిని ఉల్లంఘించినట్టు ఆ ఛానలపై ఆరోపణ. అయితే తాము అందరూ చూపిందే తప్ప అదనంగా ఏమీ ఉల్లంఘించింది లేదని చానల్ యాజమాన్యం పదేపదే చెప్పింది. ఈ విధంగా ప్రసారాల నిలిపివేత మీడియా స్వేచ్చపై దాడిఅనీ ఎమర్జన్సీని గుర్తు చేస్తోందని ప్రతిపక్షాలూ మీడియా సంఘాలూ విమర్శించాయి. అయినా కేంద్రం మొండి వైఖరి మానలేదు. పైగా దేశభక్తికీ దీనికి ముడిపెట్టింది. వెంకయ్యనాయుడు హైదరాబాదులోనే మాట్లాడుతూ విషయాలు సరిగ్గా తెలియని వారే ఈ నిలిపివేత ఆదేశాలను విమర్శిస్తున్నారని విరుచుకుపడ్డారు. అంతేగాక గతంలో యుపిఎ హయాంలోనే 23 సార్లు మీడియా ప్రసారాలను నిలిపివేశారని అతకని వాదన చేశారు. ఏమంటే ఆ నిలిపివేతలు అసభ్య ప్రసారాలు నైతిక నియమాల ఉల్లంఘనకు సంబంధించినవి. వాటికీ తమ నిర్ణయానికి తెలిసికూడా పొతనలేని పోలిక తీసుకొచ్చారు. పైగా వాటికంటే ఇది ప్రమాదకరమని ఏకపక్షంగా నిర్ధారణలు ప్రకటించారు. వాస్తవానికి ఎన్డిటివి ప్రసారాలపై ప్రభుత్వ నిర్ణయం లేదా దాని చెప్పుచేతల్లో వుండే నియంత్రణా సంస్థ నిర్ణయం అంతిమం కావడం ఆందోళనకరం. ఇలా అయితే నచ్చని ప్రసారాలన్నిటినీ ఏదో ఒక పేరుతో అడ్డుకునే ఆపేసే ప్రమాదం ఏర్పడుతుంది. ఇప్పటికే ఆ ధోరణులు కనిపిస్తున్నాయి కూడా. తమకు అనుకూలంగా మాట్లాడే ఆర్నాబ్ గోస్వామి వంటివారికి అసాధారణ భద్రత కల్పించి, నచ్చకపోతే చానళ్లనే నిలిపేయడం ఎలాటి న్యాయం?
వాస్తవానికి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్లలో ఈ తరహా ప్రసారాల నిలిపివేత ప్రజలు చూశారు. నిరసించారు కూడా. తప్పులు జరిగితే సరిదిద్దడం వేరు, ప్రసార స్వేచ్చకు ఆటంకం కలిగించడం వేరు. దీనిపై ఎన్డిటివి సుప్రీం కోర్టుకు వెళ్లింది. పిటిషన్ విచారణకు స్వీకరించిన నేపథ్యంలోనే వెంకయ్య నాయుడు తమ శాఖ నిర్ణయం అమలును ఒకరోజు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఎన్డిటివి అధినేత ప్రణరు రారు కూడా ఆయనను కలిసి చర్చలు జరిపారు. తమ శాఖతో మరోసారి మాట్లాడతానని వెంకయ్య చెప్పారట. దీన్నిబట్టి చూస్తే ఒకడుగు వెనక్కు వేసినట్టే చెప్పాలి.
