మతతత్వమే,మహిళల కోసం కాదు!
ఆరెస్సెస్ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాదులో ఘనంగా జరిగాయి. కేంద్ర ప్రభుత్వానికే పథ నిర్దేశం చేసే సంస్థ గనక ఆ మాత్రం జరుపుకోవడంలో ఆశ్చర్యం గాని అభ్యంతరం గాని లేదు. ఈ సందర్భంగా కేరళలో పరిస్థితిపై తీవ్ర విమర్శ చేయడమే గాక కేంద్రం తక్షణం కలగజేసుకోవాలని కూడా కోరారు. అక్కడ సిపిఎం ఆరెస్సెస్ కార్యకర్తల మధ్య ముఖ్యంగా కన్ననూర్ జిల్లాలో హత్యలు జరుగుతున్నాయనేది నిజమే. కాని అవి ఏకపక్షంగా జరగడం లేదు. సిపిఎం కూడా చాలా ఫిర్యాదులు విమర్శలు చేస్తున్నది. ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కూడా ఈ విషయమై చర్చలు జరిపి పరిష్కరించుకోవాలని గట్టిగా కోరారు. వీటిని మొత్తంగా పరిష్కరించాలి తప్ప ఒకవైపునుంచి చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. బెంగాల్‌లో కూడా నిన్నటి తమ నేస్తం మమతాబెనర్జీ ముస్లింలపట్ల అనుకూలత కనపరుస్తున్నట్టు ఆరోపించారు. తమిళనాడుపైనా విమర్శలు చేశారు. అదే సమయంలో గోరక్షణ పేరిట గాని మరో విధంగా గాని తమ పరివార్‌కు చెందిన వారు చేస్తున్న అఘాయిత్యాలను వీసమెత్తుకూడా ఖండించలేదు. ప్రధాని మోడీతో సహా అందరినీ కూచోబెట్టి సమీక్షించి ప్రోగ్రెస్ రిపోర్టు బాగుందని కితాబిచ్చిన ఆరెస్సెస్ మేము ఈ ప్రభుత్వాన్ని నడపడం లేదని బాధ్యత నుంచి తప్పుకోవడం హాస్యాస్పదమే. నడిపించేవారిని నడుపుతున్నామనైనా ఒప్పుకోవాలి కదా?
ఇక్కడ చెప్పదలచిన ముఖ్య విషయం అది కాదు. తలాక్ తలాక్‌పై మహిళా విముక్తి కోసమే పరితపించిన ఆరెస్సెస్ నేతలు అది ముస్లిం మతం అంతర్గత వ్యవహారమని వారే పరిష్కరించుకోవాలని ప్రకటించారు. నిజానికి తలాక్ విధానానికి స్వస్తి చెప్పాలని అందరూ కోరారు. ప్రభుత్వం ఆ దిశలో చర్యలు తీసుకోవచ్చు. దానికి బదులు ఆచరణ సాధ్యం కాని ఉమ్మడి సివిల్‌కోడ్ నినాదం దాంతో ముడిపెట్టారు. మహిళా సంఘాలు లౌకిక పక్షాలూ సంస్థలూ తలాక్‌ను గట్టిగా వ్యతిరేకించే సరికి పరివార్ పాచిక బెడిసికొట్టింది. దాంతో ఉమ్మడి కోడ్‌పైకి చర్చ మళ్లించారు. దాని కష్ట నష్టాలు చాలా వున్నాయని వారికీ తెలుసు. మరోవైపున తాము మాత్రం మనుధర్మశాస్త్రాన్నే అనుసరిస్తామని హైదరాబాదు మీడియా గోష్టిలో ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి స్పష్టంగా ప్రకటించారు. చాతుర్వర్ణ వ్యవస్థకు, మనుధర్మశాస్త్రానికి సంబందించిన మీ వైఖరిలో మార్పు వుందా అని అడిగితే లేదని తేల్చి చెప్పారు. కాబట్టి తమ ధోరణి మార్చుకోకుండా వూరికే ఇతరమతాలపై దాడిచేస్తే ప్రయోజనమేమిటి? తలాక్‌ను తొలగించాలని అందరూ కోరుతున్నారు గనక ముందు ఆ విషయమై చర్య తీసుకోవాలని చెప్పేబదులు కోడ్ పేరిట దాటవేయడం కూడా హిందూత్వ వ్యూహంలో భాగమే
