చిరంజీవిపై వూహాగానాలు నిరాధారమే
వాళ్లు వైసీపీలో చేరతారు, వీళ్లు చేరతారనే కథనాలు చాలా వస్తున్నాయని గతంలో చెప్పుకున్నాం.ఇప్పుడు ఈ కథనాల గాలి తెలుగుదేశంవైపు మళ్లినట్టుంది. మెగాస్టార్ చిరంజీవి టిడిపిలో చేరవచ్చునని చెప్పడం ఇప్పుడున్న రాజకీయ వాస్తవాలనూ సామాజిక సమీకరణలనూ పూర్తిగా విస్మరించడమే అవుతుంది. నా ఉద్ధేశంలో ఎన్నికలు చాలా దూరంలో వుండగా ఆయన ఇప్పుడు నిర్ణయం తీసుకోవలసిన అవసరం వుండదు. రెండవది- కాపుల సమస్యలపై ముద్రగడ పద్మనాభం ఆందోళనను గట్టిగా బలపర్చడమే గాక కుల ప్రముఖుల సమావేశానికి కూడా ఆయన ఒకటికి రెండు సార్లు హాజరైనారు. అంతకు ముందు పరామర్శించేందుకు వెళ్లి నిర్బంధంలో వున్నారు. ఆ సమస్యలేవీ ఇంకా పరిష్కారం కానేలేదు. ఈ లోగానే ఆయన టిడిపిలో చేరిపోతారనే కథలు నిరాధారంగా వున్నాయి. పైగా ఇప్పుడు తన చిత్రం పూర్తి చేసుకుని మళ్లీ మెగాస్టార్‌గా మెరవడంపైనే చిరు సర్వశక్తులూ పెట్టినట్టు కనిపిస్తుంది.రామ్ చరణ్ విమానసంస్థకు ప్రభుత్వం నిధులు కేటాయించడం వల్ల ఈ వూహాగానాలు మొదలై వుండొచ్చు. తమ్ముడు జనసేన అద్యక్షుడు పవన్‌కళ్యాణ్ ప్రభావాన్ని పరిమితం చేసేందుకు కూడా ఇవన్నీ చలామణి చేస్తుండవచ్చు. ఏమైనా ఇప్పట్లో చిరంజీవి టిడిపలో చేరే అవకాశం వుండదు. అవసరం అసలే వుండదు. చేరినా ఇక్కడ నాయకత్వం లేక ఢిల్లీలోనూ ప్రత్యేకత లేక ఆయన ఎందుకు అనామకంగా వుండిపోవాలనుకుంటారు? ముఖ్యమంత్రి కాలేకపోతే అగ్రనటుడుగా మిగిలిపోవడమే మెరుగనుకుంటారు.
