చంద్రబాబుకు ఏమైంది? పాతనేతల ప్రశ్న!

babuvenky
తెలుగుదేశం అద్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో వచ్చిన అనూహ్యమైన మార్పులకు కారణమేమిటని పాత తరం నేతలు ప్రశ్నవేస్తున్నారు. లేదంటే తమలో తాము అనుకుంటున్నారు. ప్రస్తుతం ఏవో మంచి పదవుల్లోనే వుంటూ కాస్త పట్టు చూపించగల నాయకులు అధినేత అనవసరమైన వ్యవహారాలతో ఎందుకు హైరాన పడుతున్నారని ఆశ్చర్యపోతున్నారు. వైసీపీ నాయకులు కొందరు బాహాటంగానే ఇదంతా ఏదో వ్యాధి ఫలితమని ప్రచారం చేస్తున్నారు గాని దాన్ని ఎవరూ నిజమనుకోవడం లేదు. కాకుంటే గతంలోని స్తిమితం ఓర్పు నేర్పు తగ్గి వృథా వ్యవహారాలు పెరిగాయని పార్టీ వారే వాపోతున్నారు. వయసును గమనించని పరుగులు తీయడం వల్ల మానసికంగా శారీరకంగా అలసి పోవడమే గాక అతిశయోక్తులతో కాలం గడపాల్సి వస్తుందంటున్నారు. ‘గతంలో ఏదైనా చెబితే వినేవారు.విమర్శలకు ఎక్కువ విలువ నిచ్చేవారు. ఇప్పుడు మాట్టాడే సమయమే ఇవ్వరు. ఇచ్చినా వినరు’ అని ఒక సూపర్‌ సీనియర్‌ నాయకుడన్నారు. మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి సుజనాచౌదరి, ఎంపి సిఎంరమేష్‌లు మరోవైపు బిజెపి సీనియర్‌ నేత వెంకయ్య నాయుడు మాటలు తప్పమరెవరివి వినే పరిస్థితి కనిపించడం లేదట. వెంకయ్యకు మోడీ దగ్గర పెద్ద పట్టు లేకపోయినా అక్కడ ఏదో చూపించుకోవడం కోసం చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చిపగ్గాలు వేస్తూ అంతా తన గొప్పగా చెప్పుకుంటున్నారట. ప్రత్యేకహౌదా విషయంలో కూడా చేయాల్సినంత చేయలేదని ఢిల్లీ వ్యవహారాలతో బాగా సంబంధం వున్న నాయకులొకరు వ్యాఖ్యానించారు. గతంలో వామపక్షాల మద్దతు, యునైటెడ్‌ ఫ్రంట్‌ పాలన వున్నప్పుడు చంద్రబాబుకు వున్న గౌరవం, కనీసం మొదటి ఎన్‌డిఎ కాలంలోని పట్టు కూడా ఇప్పుడు లేకుండా పోయాయని మరోవైపున ముఖ్యమంత్రిని అదుపులో పెట్టడం తన ఘనతగా వెంకయ్య అధిష్టానానికి చెప్పుకుంటున్నారని ఆయన వివరించారు. అమరావతి విషయంలో ఇంత గందరగోళం గజిబిజి ఎందుకు పెట్టుకున్నారో అంతిమంగా ఎవరికి లాభమో అర్థం కావడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. అయితే మరోవైపున యువతకేమైనా స్వేచ్చ నిస్తున్నారా అంటే లోకేశ్‌ స్పీడు తగ్గిందంటూ ఆయనే వ్యాఖ్యానిస్తారని తను ఏదైనా చేయబోతే బ్రేకులు వేస్తారని కూడా తెలుగు దేశం కీలక నేతల కథనం. దీనంతటిలోనూ అభద్రత కొట్టవచ్చినట్టు కనిపిస్తున్నదనే నిజాన్ని కూడా వారు ఒప్పుకుంటున్నారు. ఎన్నికలు దగ్గరయ్యే కొద్ది ఇది మరింత పెరగవచ్చని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *