నిత్య సాహిత్య సంచారి డా.అద్దేపల్లి
ప్రగతిశీలతకు ప్రతిభకు మారుపేరైన కవి విమర్శకుడు ఉపన్యాసకుడు డా.అద్దేపల్లి రామమోహనరావు మరణవార్త తెలుగుసాహిత్య ప్రపంచానికి ఒక పెద్ద దిగ్భ్రాంతి. ఎందుకంటే ఎనభై ఏళ్లు చెబితే తప్ప నమ్మలేనంత హుషారుగా వుండేవ్యక్తి ఆయన. శ్రీకాకుళం నుంచి చిత్తూరు,హైదరాబాదు నుంచి అదిలాబాదు వరకూ చిన్న పెద్ద తేడా లేకుండా సాహిత్య కారులందరికీ ఆత్మీయంగా మసులుతూ స్నేహం పంచినె అక్షర యోధుడు. గత నవంబరు29న విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గురజాడ శతవర్ధంతి సభలకు ఆయన అనారోగ్యంతో రాలేకపోయినట్టు చెప్పారు. నాకుతెలిసి ఆయన అనారోగ్యం వల్ల ఒక సభకు రాకుండా ఆగిపోవడం అదే మొదటిసారి, చివరి సారి. 80 జన్మదినోత్సవం ఈ మధ్యనే జరుపుకొన్నారు. విశాఖలో సిపిఎం మహాసభల సందర్భంగా పుస్తక మహౌత్సవంలోనూ కలసి వున్నాము. తూర్పుగోదావరి జిల్లా సాహితీ స్రవంతి మహాసభ జరిగి అద్యక్షుడుగా ఎన్నికైనారు. గత అక్టోబరులో మా ఇంటికి వచ్చి వెళ్లారు. మరి ఇంతలోనే అస్వస్థత ఏమిటని విచారిస్తే హఠాత్తుగా ప్రొస్టేట్ కాన్సర్ బయిటపడిందని చెప్పారు. అందరికీ చెప్పి ఆందోళన పర్చడం ఇష్టం లేక ఈ సమాచారం కుటుంబ సభ్యులకే పరిమితం చేశారని అద్దేపల్లికి అతి సన్నిహితుడైన స్రవంతి మిత్రుడు గనారా (నాగేశ్వరరావు) చెప్పారు. అద్దేపల్లి ఒక్కసారిగా దెబ్బతినడం పట్ల ఆపలేని దు:ఖం వ్యక్తపర్చారు. అదే రోజు ఆయన కుమారుడు రచయిత అద్దేపల్లి ప్రభు ఫోన్లోకొంత మె రుగ్గా వున్నట్టు చెప్పడంతో మళ్లీ ఆశ కలిగింది. కాని మూడు రోజులలోనే ఆయన ఆఖరిశ్వాస విడిచారు.
. నిత్యసాహిత్య సంచారి, నిరంతర రచనాశీలి, నిఖిల సజ్జన సన్మిత్రుడు.. నిబద్ద సామ్యవాద భావుకుడు.. అద్దేపల్లి రామమోహనరావును గురించి సభల్లో తరచూ ఇలా వర్ణిస్తుండేవాణ్ణి. ఇవన్నీ అక్షర సత్యాలే తప్ప ఏవీ అతిశయోక్తులు కాదు. యాభైలనాటి చాలా మంది సాహిత్య కారుల లాగే ఆయన కూడా ప్రాచీన ముద్ర నుంచి ప్రగతి వైపు నడిచారు. ఒక పద్య కావ్యం కూడా రాసిప్రచురించిన అద్దేపల్లి తర్వాతి కాలంలో వచనకవిగా స్థిరపడ్డారు. రక్తసంధ్య, మధుజ్వాల, అంతర్జ్వాల,గోదావరి నా ప్రతిబింబం, అయినా ధైర్యంగానే, పొగచూరిన ఆకాశం.ఆకుపచ్చని సజీవ సముద్రంనా నేల వంటి అనేక కవితా సంపుటాలు ఆయన వెలువరించారు. ఆయన రాసిన ప్రతి కావ్యంలోనూ ప్రజల పట్ల ప్రజా ఉద్యమాల పట్ల ఆర్ద్రత సౌహార్ద్రతల మేళవింపు వుంటుంది. ‘నువ్వు ఆర్యుడవైతేనేమిటి, ద్రావిడుడవైతేనేమిటి నీ వొంట్లో బహుళజాతి రక్తం ప్రవహిస్తున్నప్పుడు’ అని ప్రశ్నించిన సాహసి. ‘అట్లాంటిక్ తీరం నుంచి ి వచ్చిన రెండు గ్లోబల్ అడుగులు’ ‘తలమీద అడుగులు పెట్టుకునే పరాధీనత మాత్రం అప్పుడూ ఇప్పుడూ మేడిన్ ఇండియాయే’ అని ఆక్షేపిస్తాడు. ‘గోదావరిలో నీళ్లు తీసుకున్నాను.. నా ముఖం కనిపించలేదు..వీరేశలింగం కనిపించాడు’ అని చారిత్రిక వారసత్వాన్ని చెబుతాడు.
అద్దేపల్లి సాహిత్య సంస్థలన్నిటికీ సన్నిహితంగా మెలిగారు. అస్తిత్వ ఉద్యమాలు వచ్చినప్పుడు వాటిపట్ల సానుకూలత వహించారు. వివిధ సాహిత్య పరిణామాల మధ్య అద్దేపల్లి విమర్శకుడుగా తన ప్రత్యేకత కాపాడుకొన్నారు. సైద్ధాంతిక నిబద్దతతో పాటు సాహిత్య శిల్పం గురించిన అవగాహన కూడా ముఖ్యమని ఎప్పటికప్పుడు విశ్లేషించేవారు. యువకవులకు పరిశోధకులకు సూచనలు చేయడం,అధ్యయన తరగతులు ఇవన్నీ ఆయన నిత్యకృత్యాలు. ఇంత చేసినా ఎక్కడా భేషజం పటాటోపం వెతికినా వుండవు.
‘శ్రీశ్రీ కవితాప్రస్థానం’ పేర శ్రీశ్రీపై తొలి పరిశీలనా గ్రంధం ఆయనదే కావడం ఒక చారిత్రిక యథార్థం. తన నేపథ్యం రీత్యా శ్రీశ్రీ కవిత్వాన్ని చూసి ప్రాచీన సాహిత్య ప్రమాణాలు ఎలా నిలబెట్టారో నిరూపించాడు. ఈ విమర్శనాశైలి సరికాదని రారా ధ్వజమెత్తాడు.. ఈ క్రమంలోఆయన సాధించిన ఒక సాహిత్య విజయం వుంది. ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయెను పేకమేడలై అని దేశచరిత్రలు లో శ్రీశ్రీ చేసిన ప్రయోగం శ్రామిక శక్తికి ప్రతీకగా చెబుతుండేవారు. కాని ఆయన తతిమ్మా అన్న మామూలు అర్థంలోనే ఆ ప్రయోగం చేశారని అద్దేపల్లి తేల్చారు.ఆ విశ్లేషణ సరి కాదని రారా వాదన. చివరకు శ్రీశ్రీ అద్దేపల్లితోనే ఏకీభవించారు.. జాషవా పద్యాలంటే అద్దేపల్లికి మరీ ఇష్టం. ఆయనపై రాసిన పుస్తకాన్ని ఇటీవలే పునర్ముద్రించాము.
చాలా మంది రచయితలు రాతగాళ్లమే గాని కూతగాళ్లం కాదని చెబుతుంటారు. కాని అద్దేపల్లి మంచి వక్త. సాంసృతిక కాలుష్యం గురించిన ఆయన ఉపన్యాసం ఉర్రూతలూపుతుంది. పద్యాలు పాటలు శ్రావ్యంగా ఆలపించగల గాత్రం. ‘ నే సలాము చేస్తా ఈ జనానికి పేదవాడికోసం పోరు చేసేవాళ్లకు’ అనే మకుటంతో రాసిన గజళ్లు అలా తీగసాగుతుంటాయి. ఈ ధనమంత పోనీ యవ్వనమంత పోనీ ఆ నాటి బాల్యాన్ని ఒకసారి రానీ అని పాడుతుంటే ప్రతివారూ చిన్నపిల్లలై పోవలసిందే!.
చిక్కడపల్లి నుంచి ఢిల్లీ వరకూ చాలా చోట్లకు ఆయనతో కలసి వెళ్లిన నాకు ప్రతిచోటా ఆయన కోసం కుర్రాళ్ల నుంచి ఐఎఎస్‌ల వరకూ సాహితీ మిత్రులు రావడం చాలా ఆనందం కలిగించేది. లోతైన విషయాలు చర్చించిన ఆ విమర్శకుడు అరక్షణంలో ఆ వచ్చిన యువకవులతో కలసి కబుర్లలో మునిగిపోయి కేరింతలు కొట్టేవారు. అంత నిర్మలమైన వ్యక్తిత్వం ఆయనది. ఆరు దశాబ్దాల సాహిత్య యాత్రలో తనకు విస్తారమైన స్నేహ సంబంధాలు, పేరు ప్రతిష్టలు, పరిచయాలు వున్నా స్వంతానికి వాడుకోని విలక్షణ వ్యక్తి అద్దేపల్లి. కొంత మంది సాహిత్యకారుల లాగా ఆయన బిరుదుల కోసం పదవుల కోసం ఎన్నడూ ఆరాటపడలేదు. ‘కళాత్మకంగా’ బతికే చాలామందికి వుండే వ్యసనాలు వ్యామోహాలు దరికి రానివ్వని అద్దేపల్లి నిండు కుటుంబీకుడు. ఆయనకు నలుగురు కుమారులు. వామపక్ష ఉద్యమాలతో సంబంధం వున్నవారే. భార్య చాలా కాలం పాటు అస్వస్తుతతో వుంటే ఈ పర్యటనల మధ్యనే దగ్గరుండి సేవ చేసి కొంత మెరుగుపడినందుకు సంతోషించారు. ఇంతలో అనుకోని విధంగా ఆయనకు కాన్సర్ ఆలస్యంగా ్ట బయిటపడి అది వేగంగా ప్రాణాలు హరించేసింది.
అద్దేపల్లి అంత్యక్రియలు జనవరి 14న కాకినాడలో జరిగాయి. ఆయనకు తుదినివాళి సమర్పించినప్పుడు ఒక పెద్దదిక్కును కోల్పోయిన భావన అందరిలో కదలాడింది. అయితే ఎనభై ఏళ్ల పాటు క్రియాశీలంగా గడిపి ఏ బాధ పడకుండా పోయాడన్నది కాస్త ఉపశమనం అనిపించింది.
మేేసలాము చేస్తాం అద్దేపల్లికి.. చైతన్య స్నేహం పంచి వెళ్లేవాడికి
– తెలకపల్లి రవి.

నిజంగా అద్దేపల్లికి ఘన నివాళి. యువకుల్లో యువకుడు, పెద్దల్లో పెద్ద.
nijanga addepalliki ghana nivaali. yuvakullo yuvakudu, peddallo pedda.