బాహుబలి2 .. భారతం లైన్స్..
బాహుబలి 2 ద కంక్లూజన్( నిజానికి ఇది బిగినింగ్ స్టోరీ) ఫస్ట్‌లుక్ అంటూ జరిగిన హడావుడికి తగినట్టే కళ్లు మిరుమిట్లు గొలిపే రీతిలో విడుదల చేశారు. ఆకాశంలోంచి అమరేంద్ర బాహుబలి యుద్ధ వేషంలో చూస్తుంటే కింద యువ బాహుబలి క్రోధారుణ నేత్రాలతో ్ల తెంచుకున్న సంకెల గొలుసుతో సహా నడిచిపోతున్న చిత్రం ఈ ఫస్ట్‌లుక్. దీనిపై వ్యాఖ్యానించేందుకు ఏమీ లేదు. అవసరం కూడా లేదు. కాని దీన్ని చూస్తే మాత్రం ఒక విషయం తెలుస్తుంది. యువ బాహుబలి ప్రతీకారం తీర్చుకోవడానికి పరాక్రమం చాటుకోవడానికి బయిలుదేరాడని. అయితే దానికి ముందు జరిగిన కథను చూపించడం ఎలాగూ వుంటుంది. యాక్షన్ సీన్స్ చాలా ఎక్కువగానూ వూహించలేని స్థాయిలో వున్నాయని ప్రతినాయకుడు ప్రభాస్ ముందే చెప్పేశారు గనక లేదా అధికారికంగా లీక్ చేశారు గనక ఈ భాగంలో విజువల్ ఫీస్ట్కన్నా ఫిజికల్ ఫైట్స్క ఎక్కువ సమయం కేటాయించి వుంటారనుకోవచ్చు. ఎలాగూ హీరో గెలవాలి గనక ముగింపుపై పెద్ద వూహలక్కరలేదు. ఆ మలుపులను ఎలా మలచారన్నదే చూడవలసింది.
ఒక విధంగా ఇది కుదించిన లేదా కొన్ని పాత్రలు ఒకటిగా మలచిన మహాభారతమే. బిజ్జల దేవుడుగా నాజర్ దృతరాష్ట్రుడైతే అమరేంద్ర బాహుబలి పాండురాజు. అతను చేసుకున్న దేవసేనగా అనుష్కలో కుంతి ద్రౌపది ఇద్దరూ వుంటే శివగామిగా రమ్యకృష్ణ ఈర్ష్యాసూయలకు లోనైన నాటి గాంధారితో పాటు పశ్చాత్తాప ధోరణికి కూడా ప్రతినిధి అనుకోవచ్చు.ఇక భల్లాల దేవుడుగా రానా స్పష్టంగా దుర్యోధనుడే. కట్టప్పగా సత్యరాజ్ భీష్ముడు కమ్ కర్ణుడు లాగా చూడొచ్చు. ఇలాగే మిగిలిన పాత్రలూ.. మన కథలన్నీ చాలావరకూ రామాయణ మహాభారతాలనుంచి వచ్చేవననడానికి ఇదో ఉదాహరణ. వాస్తవానికి రామాయణ భారతాలు కూడా అన్నదమ్ముల ఆస్తిపంపకాల కథలే!
బాహుబలి ప్రచారానికి రాజమౌళి ఏం ఖర్చుపెట్టాడన్నందుకు అగ్రదర్శకుడు దాసరి నారాయణరావుపై అంతా విరుచుకుపడిపోయారే గాని ఆయనన్న దానిలో నిజం లేకపోలేదు. ఏమంటే రాజమౌళి ఈనాటి మీడియా స్వభావాన్ని చక్కగా ఉపయోగించుకుని ముందస్తుగానే బోలెడు ప్రచారం పొందగలిగారు. ఇది బాగా ఇవ్వకపోతే మనకే నష్టం అన్న భావం తీసుకువస్తే మీడియా తనకు తనే పోటీపడి ప్రచారమిస్తుంది. బాహుబలి బ్రహ్మాండమైన విజయం తర్వాత ఇది చాలా సహజంగా జరిగేదే. ఇందుకు రాజమౌళిని గాని దాసరిని గాని విమర్శించడం అర్థం లేనిపని. ఈ ధోరణిని అర్థం చేసుకోవడం ముఖ్యం. విజువల్ యుగంలో ఇదంతా మార్కెట్ ధర్మం.మర్మం. దీన్ని ప్రభాస్ పుట్టిన రోజుతో ముడిపెట్టడం స్నేహాభిమానాల సూచనే గాక అతని భవిష్యత్తుకూ దోహదంచేసే పని. సో ఆల్ ద బెస్ట్. 2017 ఏప్రిల్ 28న విడుదయ్యేవరకూ ఇలాటి ప్రచారపు మెరుపులు మరెన్ని వుంటాయో!