సంచలనాల సచివాలయలో మంచి చూడరా?

తాజాగా జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యక్తం చేసినట్టు చెబుతున్న భావాలు స్పందనలు ఒకింత ఆశ్చర్యంగా వున్నాయి. మిగిలినవి ఎలా వున్నా సచివాలయం వాస్తు సరిగ్గా లేదంటూ దాన్ని కూల్చివేయాలని నిర్ణయించడం చాలా విచిత్రం. పనివసతి కోసం,ప్రజా సౌకర్యాల కోసం లేదంటే ఆధునిక సదుపాయాల కోసం భద్రత కోసం నిర్మాణాలు మరమ్మత్తులు చేసుకోవలసిందే. నిజాం నుంచి కిరణ్కుమార్ రెడ్డి వరకూ ఈ వాస్తు దోషాల ఫలితాలను అనుభవించారని ఆయన ఏకరువు పెట్టారట. పాలకుల నిరంకుశ నిర్వాకాలు అవకాశవాదాలు ప్రజల ఉద్యమాలు అన్నిటికీ బాధ్యతను వాస్తుపైకి నెట్టేస్తే సరిపోతుందా? నిజాం వ్యతిరేక సాయుధ పోరాటం ప్రజల చైతన్యం ఫలితమే గాని వాస్తుశాస్త్రంతో సంబంధం లేదు. అయినా ఆయన రాజప్రముఖ్గానే దిగిపోయారు. బూర్గుల రామకృష్ణారావు తన పాత్ర నిర్వహించి సగౌరవంగా నిష్క్రమించారు. తర్వాత నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి,జలగం వెంగళరావు వంటివారు విపరీతమైన అధికారం చలాయించారు. ఎన్టీఆర్ సంచలన చరిత్ర సృష్టించారు. చంద్రబాబు నాయుడు ఎవరికన్నాఎక్కువ కాలం పాలించి మళ్లీ ఇప్పుడు ఏపిని ఏలుతున్నారు(ఇంకా ఈ సచివాలయంలో ఆయనకో బ్లాకుంది) వైఎస్ఆర్ తనదైన ముద్ర వేశారు. ఆయన మరణానంతరం రోశయ్య ఎవరూ అనుకోని రీతిలో ముఖ్యమంత్రి అయ్యారు. అంతకంటే అదృష్టవంతుడుగా కిరణ్కుమార్ రెడ్డి అల్లకల్లోలంలోనూ పదవీ కాలం సాగించుకున్నారు. ఇక పివి నరసింహారావు మర్రిచెన్నారెడ్డితో సహా అనేక మంది తమ తమ

చేతలను బట్టి నేతలుగా వెలుగొందారు. ఇక్కడ దెబ్బ తిన్న పివి ప్రధాని అయితే చెన్నారెడ్డి రెండోసారి సిఎం అయ్యారు. కాబట్టి వీరు అధికారంలోకి రావడంలోని విజయాన్ని వదలిపెట్టి పదవి పోయిన తీరునే గుర్తు పెట్టుకోవడం ఎలాటి తర్కం? అధిష్టానాల వల్లనో ఆత్మహత్యా సదృశ్యమైన స్యీయ తప్పిదాల వల్లనో ఆ ముఖ్యమంత్రులు దిగిపోతే భవనాలేం చేశాయి? చివరి అయిదేళ్లు రోశయ్య కిరణ్ల కష్టాలను తెలంగాణ కోణంలో అనుకూల పరిణామాలుగా చూడాలి కదా? ఎపిని పంపించి తెలంగాణ సర్కారు స్థాపించుకోవడం దోషమా; సంతోషమా?
కథకు కాళ్లు లేవు ముంతకు చెవుల్లేవు అన్నట్టే అశాస్త్రీయ విశ్వాసాలకు కూడా తర్కం వుండదు. నమ్మాలంతే. కాని ఇందుకోసం ప్రజా ధనం వందల కోట్లలో వెచ్చించడమెందుకు? డి బ్లాకును ఎల్అండ్ టి ఆధునికంగా నిర్మించడం మీడియా మిత్రులందరికీ తెలిసిన విషయమే. దాన్ని కూడా ధ్వంసం చేయాలా? వారసత్వ భవనాలను కూడా కూల్చేంత వాస్తు దృష్టి ఎలాటి చైతన్యం?
అత్యున్నత స్థానాల్లోని అధినేతలు నిర్ణేతలైతే వారిని ఎన్నుకునే ఎదిరించే ప్రజలే విధాతలు. ఇందుకు భిన్నంగా మరేదో అదృశ్యశక్తులకు అన్నీటినీ ఆపాదించి అధికారికంగా ప్రచారం చేయడం రాజ్యాంగం చెప్పే వైజ్ఞానిక స్పూర్తికి భిన్నం. కెసిఆర్ వ్యక్తిగత విశ్వాసాలు పూజాపురస్కారాలు యజ్ఞయాగాలు ఆయన ఇస్టమే గాని ప్రభుత్వానికి కూడా దాన్ని ఆపాదించడం ఏ శాస్త్రం ఆమోదించని విపరీతం. రాజధర్మం వేరు మత ధర్మం వేరు.