పాక్‌ఫోన్‌కు రెస్పాన్స్‌-అంతర్జాతీయ మద్దతు తీరు

pm-modi-7591సెప్టెంబరు 18 తర్వాత మొదటి సారి భారత దేశం పాకిస్తాన్‌ ఫోన్‌కు స్పందించింది. ప్రధాని భద్రతా సలహాదారు ఇప్పుడు గొప్పగా ప్రచారం పొందుతున్న అజిత్‌ దోవెల్‌ పాక్‌ భద్రతా సలహాదారు నాసిర్‌ జునూజాతో మాట్లాడారు.భారతదేశానికి వ్యతిరేకంగా టెర్రరిస్టు కార్యకలాపాలు నిలిపేసేందుకు పాకిస్తాన్‌ సిద్ధమైతేనే ఇరుదేశాల మధ్య చర్చలు సాధ్యమని గట్టిగా చెప్పారట. అయితే ఇది ఎలాగూ ఒప్పుకునే అంశం కాదు. పాక్‌ గత చరిత్రా అలా లేదు. అయినా ఇండియా నుంచి అధికారికంగా ఈ మాట వెళ్లడం ఆసక్తికరం.

నిజం ఏమంటే సైనిక చర్యల విషయంలో గాని విదేశాంగ వ్యూహాల్లో గాని స్పష్టత స్థిరత్వం లేవు. ఏకపక్షంగా అమెరికాకు లోబడిపోవడమే జరిగింది. అమెరికా వైఖరి మారిందని మోడీ కితాబిచ్చారు గాని వాస్తవానికి ఆయన కోరుతున్నట్టు పాక్‌ను టెర్రరిస్టు దేశంగా ప్రకటించే ఆలోచన లేదని అమెరికా తేల్చిచెప్పేసింది. పాకిస్తాన్‌తో తమ సంబంధాలు యథాతథంగా కొనసాగుతాయనీ ప్రకటించింది. ఈ విషయంలో మొదట సానుకూలంగా స్పందించిన రష్యా కూడా ఇండియా అమెరికా చుట్టూ తిరగడం చూసి మారిపోతున్నది.చైనాకు మనకూ వైరుధ్యాలు పాక్‌తో స్నేహం వున్నా ఈ వివాదం విషయంలో మొదట సంయమనం ప్రదర్శించింది. కాని చైనాను దెబ్బ తీసేందుకు భారత్‌ను వాడుకోవాలని అమెరికా వ్యూహాలు అమలు చేస్తున్నట్టు కథనాలు వచ్చాక అది మరింత ఆచితూచి స్పందించడం మొదలుపెట్టింది. ఏతావాతా చైనాతో పాటు రష్యా కూడా పాకిస్తాన్‌కు కొంత దగ్గరయ్యే స్థితి రావడానికి మోడీ ప్రభుత్వ విధానం కారణమైంది. ఈనాటి అంతర్జాతీయ పొందికలో భారత చైనా రష్యాల కలయిక గొప్ప ఫ్రభావం చూపిస్తుందని అందరూ ఆశిస్తున్నదానికి భిన్నంగా పాక్‌ రష్యా చైనాల కలయికకు దోహదం కలిగింది. అమెరికా పాలకులు భారత్‌ను దువ్వుతూనే పాక్‌తో ప్రగాఢ సంబంధాలు కొనసాగుతాయనే ప్రకటించారు ఆఫ్ఘనిస్తాన్‌ మనకు మద్దతు ప్రకటించడం నిజమే అయినా దేశంలో ప్రభుత్వం పట్టు బలహీనపడి తాలిబాన్ల పునరుద్ధరణ సూచనలు బలపడుతున్నాయి.ఇలాటప్పుడు మరోసారి అమెరికా పాక్‌పై ఆధారపడ్డం అనివార్యంగా జరుగుతుంది. గనక చివరకు చూస్తే మనకు అదనంగా పెరిగిన మద్దతు లేకపోగా పాక్‌వైపు మొగ్గు పెరిగింది. దీనంతటికి మోడీ ప్రభుత్వ పోకడలే కారణం. సార్క్‌ సమావేశాలకు హాజరుకాకపోవడం గొప్పగా చెప్పారు గాని అలీనోద్యమ సమావేశాన్ని కూడా తొలిసారి భారత ప్రధాని ఎగ్గొట్టారనేది అంత ప్రచారం పొందని నిజం. విదేశాల సంగతి అటుంచి ఈ మొత్తం పరిస్థితి దిగజారడానికి ఒక ముఖ్య కారణమైన జమ్మూకాశ్మీర్‌ ప్రజలపై నిర్బంధం నిలిపివేసి విశ్వాసంలోకి తీసుకోవాలనే ఆలోచనా లేదు. పంజాబ్‌,యుపి ఎన్నికలలో గెలవడం మరీ ముఖ్యంగా యుపిలో పార్లమెంటు ఎన్నికల నాటి బలం నిలుపుకోవడం అత్యంతకీలకం గనక మోడీ ప్రభుత్వం సైన్యం చాటున రాజకీయ హైన్యం ప్రదర్శిస్తూనే వుంటుంది. అది ప్రతిపక్షాలకు అపాదిస్తూ ఎదురుదాడులు చేస్తుంది. దేశం మాత్రమే గాక ప్రపంచమంతా చూస్తున్న ఈ ద్వంద్వ రాజకీయం ఎంతో కాలం నడవదు. నడిస్తే నస్టమూ తప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *