మొక్కు సారుది- లెక్క సర్కారుది- ఇహ, పర సందేహమిది
ఒకవేళ తెలంగాణ వచ్చి తను ముఖ్యమంత్రి కాకపోయివుంటే అప్పుడు మొక్కు తీర్చేవారు కాదా?రాతిబొమ్మల కేల రంగైన వలువలు
గుళ్లు గోపురములు కుంభములును
కూడుగుడ్డ తాను కోరునా దేవుడు
విశ్వదాభిరామ వినురవేమ

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ 11కోట్లకు పైగా విలువ చేసే బంగారు కిరీటీన్ని ప్రభుత్వ బడ్జెట్‌తో వరంగల్ భద్రకాళికి సమర్పించిన సన్నివేశం ఈ పద్యాన్ని గుర్తు చేసింది. నిన్న సమయం చాలలేదు. గతంలోనూ కొన్ని మొక్కులు ఇలాగే ప్రభుత్వ ఖర్చుతో తీర్చి తిరుపతి వెంకన్న సహా మరిన్నిటికి సిద్దంకాబోతున్నారు. వేమన పద్యంలో వేసిన ప్రాథమిక తాత్విక మీమాంస అటుంచి కెసిఆర్ ప్రభుత్వ చర్యలు రెండు రకాల ప్రశ్నలకు దారితీస్తున్నాయి.
మొదటిది- రాజ్యాంగ సంబంధమైంది. ప్రభుత్వాలు మత విశ్వాసాలను అతీతంగా వుండి అందరికీ భద్రత కల్పించాలి.దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్నారే గాని దేవ పోషక అనలేదు. భక్తులు దాతలు కల్పించిన అర్పించిన కానుకలు భూ కనక వస్తువాహనాలు దుర్వినియోగం కాకుండా చూడటం, వాటిని భక్తుల సదుపాయాలకు ప్రజా సంక్షేమానికి వినియోగించడం మాత్రమే ప్రభుత్వాల బాధ్యత. ఆచార ప్రకారం పట్టువస్త్రాలు మంగళసూత్రాల వంటివి తీసుకువెళ్లడం జరుగుతుంటుంది. కాని ప్రభుత్వాధినేతలుగా వున్న ముఖ్యమంత్రులు లేదా ప్రధాన మంత్రులు చెప్పారు గనక కోట్లు కోట్లు ఆభరణాలకు వెచ్చించేందుకు రాజ్యాంగం అనుమతిస్తుందా? గతంలో ఎ క్కడైనా ఇలాటిది జరిగిందా? రేపు ఆర్థిక పరిస్థితి చూసుకోకుండా మరెవరైనా పాలకుడు కూడా ఇలాగే చేస్తానంటే ఏం జరుగుతుంది? ఒక మతం దేవత మొక్కు చెల్లిస్తే మరో మతం సంగతేమవుతుంది? అందరికీ కోట్లలో ఇస్తే ఖజానా ఏమవుతుంది?
రెండవది- విశ్వాసానికి సంబంధించిందే. భక్తి అనేది భక్తుడికి భగవంతుడికి సంబంధించింది. ఎవరైనా మొక్కుకున్నారంటే వ్యక్తిగత హౌదాలోనే తప్ప ప్రభుత్వాధినేతలుగా కాదు. పైగా ఆ సమయంలో ఆయన ప్రభుత్వంలో లేరేమో కూడా. వున్నా క్యాబినెట్ తీర్మానాలు రాజకీయాలు ఆధ్మాత్మిక ప్రపంచానికి సంబంధం లేనివి. రాజులు చక్రవర్తులు అంటే సర్వంసహాధికారులు. కాని ముఖ్యమంత్రులు అలా కాదు. ఒకరి మొక్కు ఒకరు తీరిస్తే – అది మొక్కు ఎలా అవుతుంది?ఒకవేళ తెలంగాణ వచ్చి తను ముఖ్యమంత్రి కాకపోయివుంటే అప్పుడు మొక్కు తీర్చేవారు కాదా?
వ్యక్తిగతంగా సొమ్ములేకపోతే తలనీలాలు ఇచ్చినా లేక మనస్పూర్తిగా నమస్కారం పెట్టుకున్నా అది వేరు. ఇది విశ్వాసంపై విశ్వాసాన్ని కూడా ప్రశ్నించే సమస్య. ఇది కూడా ఒక ఆధ్యాత్మిక ఉల్లంఘనమే. ఫలం పుష్పం తోయం అని వున్నది ఇచ్చుకోవడం వేరు. బంగారమైనా వజ్రాలైనా తనవి కానివి ఇవ్వడం వేరు.
అమ్మలగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అని ఇదే వరంగల బమ్మెరు పోతన వర్ణించిన దుర్గమ్మకూ ఈ మీమాంసలు తెలియనివా?