ప్ర’పంచ’ నగరం చంద్రబాబు అతిశయం
వచ్చే దసరా నాటికి రాజధాని అమరావతికి పూర్తి రూపం తీసుకువస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు రాసిన లేఖలోనూ కొన్ని మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోనూ తెలిపారు. అందరూ హర్షించారు. ఇది రాజధాని అవసరాల రీత్యానే గాక రాజకీయంగానూ తప్పని సరైన ప్రకటన. ఈ ప్రభుత్వం ఎన్నికై ఇప్పటికి సగం పదవీ కాలం పూర్తయింది. గత కొన్నేళ్ల దేశ పరిణామాలను గమనిస్తే మూడేళ్ల తర్వాత నుంచి ఎన్నికల జ్వరం పట్టుకోవడం కద్దు. విభజిత రాష్ట్రాభివృద్ధి, ముఖ్యంగా రాజధాని నిర్మాణం చేయగల అనుభవశాలి అన్నది చంద్రబాబు విజయానికి దోహదం చేసిన అంశాల్లో ముఖ్యమైంది. కాని ఆయన దాన్ని అందరి భాగస్వామ్యంతో ఏకాభిప్రాయంతో ముందుకు తీసుకుపోయేబదులు ఏకపక్షంగా తన ద్వారానే జరిగిందనిపించుకోవడానికి ప్రాధాన్యతనిచ్చారు. కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడం, బిజెపి భాగస్వామిగా వుండటం, ఏకైక ప్రతిపక్షంగా వున్న వైసీపీకి కొన్ని పరిమితులు ప్రతికూలతలు వుండటం ఆయనకు కలిసివచ్చింది.
జగన్‌పట్ల వున్న వైముఖ్యం కారణంగా ఆయన రాజధానిని పూర్తిగా ప్రభుత్వ వ్యవహారంగా ఇంకా చెప్పాలంటే తన చుట్టూ వున్న బృందానికే పరిమితం చేశారు. భూ సమీకరణకు రైతులు సహకరించినా కేంద్రం దాదాపు 2000 కోట్లు వివిధ రూపాల్లో ఇచ్చినా సింగపూర్‌తో సింక్ చేసుకోవడంలోనూ కాంట్రాక్టర్లను ఎంపిక చేసుకోవడంలోనూ జాప్యం జరిగింది. ఆలస్యంగా వెలగపూడిలో నిర్మించిన సచివాలయం తాత్కాలికమా కాదా అనేది కూడా తర్జనభర్జనగా మారింది. సీడ్ క్యాపిటల్, స్టార్టప్ కాపిటల్,నవ నగరాలు, ఇలా రకరకాల పేర్లతో గజిబిజి ఏర్పడింది. వున్న మాట చెప్పాలంటే సింగపూర్ నుంచి కూడా ఆయన ఆశపడిన ఆసరా ఏమీ లభ్యం కాలేదు. సామాజిక ఆర్థిక నేపథ్యాల కారణంగా చాలామంది రైతులు భూములు సమీకరణలో ఇచ్చినా ఆ వేగం నిర్మాణ ప్రణాళికలో ప్రతిబింబించలేదు. చెప్పాలరట చాలామంది ే తెలుగుదేశం నాయకులకూ మంత్రులకూ కూడా ఈ విషయంలో స్పష్టత లేదు.
జరగవలసిన ఆలస్యం జరిగాక ఇప్పుడు కూడా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వమే పాలనా భవనాల నిర్మాణం చేస్తుండటం గమనించదగ్గ విషయం. అంటే అంతగా సింగపూర్ చుట్టూ చేసిన ప్రదక్షిణలు, పెంచుకున్న భ్రమలు నెరవేరిందేమీ లేదు. బహుశా వాటిని వచ్చే ఎన్నికల తర్వాతకు వాయిదా వేసుకోవాల్సిందే. ఈ లోగా ప్రభుత్వం తన వంతుగా కార్యాలయాలు శాసనసభ హైకోర్టు రాజ్‌భవన్ కొన్ని క్వార్టర్లు ఇత్యాదులు కడుతుంది. ఈ కార్యకలాపాలతో భూముల విలువ పెరుగుతుంది. అప్పుడు సింగపూర్ బాబులు రంగ ప్రవేశం చేస్తారు. ఆ పెరిగిన రేట్లతో తమకు రావలసింది తీసుకుని అమ్ముకోవడం మొదలు పెడతారు. వారిది అమ్ముడయ్యేవరకూ మిగిలిన భూమి అమ్మడానికి వుండదు. ఒకవేళ వారికి అనుకున్న ప్రతిఫలం రాకపోతే గడువును పెంచాలి. షరతులు మార్చాలి. వారికి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వతమే సిద్ధం చేసి అప్పగించాలి.
ఇక మరోవైపున ఇచ్చిన భూమికి ప్రతిఫలంగా ప్లాట్లు వచ్చిన రైతులు ఏం చేయాలి? వారికి వారు కట్టుకునే పరిస్తితి వుంటే లేక అవసరం లేకపోతే ఆగొచ్చు. కాని వారిని కూడా అసోసియేషన్లుగా చేర్చి కమర్షియల్ కాంట్రాక్టుల కింద నిర్మాణాలు చేసుకునేలా ప్రోత్సహిస్తారు.కొంతమంది అలా ఇచ్చిన తర్వాత చిన్న చితక ఎలాగూ వంటరిగా చేయలేరు గనక అప్పగించకతప్పదు. పైగా వారినుంచి ఆ ప్టాట్లు నయానో భయానో కొనుగోలు చేయడం లేదా ఒప్పందాల్లో ఇరికించడం కూడా జరిగిపోతుంది. ఆ విధంగా రాజధాని రియాల్లీ షో రెండవ ఘట్టం నడుస్తుంది. ఇందులో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ పాలక పక్ష ప్రముఖులు కథ నడిపిస్తారు. ఇప్పటికే వారిలో చాలా మంది పెద్ద మొత్తంలోనే భూములు తీసుకున్నారు.
ఏది ఏమైనా మేము 45 లక్షల చదరపు అడుగులకు పైగా నిర్మాణాలు చేస్తాం అని ఒక ప్రభుత్వ ముఖ్యుడు మొన్న చెప్పారు. అసెంబ్లీ సచివాలయం రాజ్‌భవన్ వంటివి కట్టడం అంటే అందరూ అన్నట్టు కనీస నిర్మాణాలతో అడుగులేయడమే.కావాలంటే విజయవాడ సమీపంలో ఎక్కడైనా వంద ఎకరాల్లో ప్రాథమిక వ్యవస్థ ఎప్పుడో నిర్మించి వుండేవాళ్లం. కాని గొప్ప నగరం కావాలని ఇంత శ్రమ పడ్డాం అని చంద్రబాబు తన ఇంటర్వ్యూలలో చెప్పారు గాని నిజంగా వారు కట్టే భవనాలు గాక మిగిలిన ప్రాంతం అంత వేగంగా అభివృద్ధి చెందడానికి ప్రాతిపదిక లేదు. ప్రపంచ సంస్థలన్నీ వచ్చి పెట్టుబడులు పెట్టవలసిన అవసరం పెట్టే పరిస్థితి కూడా హఠాత్తుగా వూడిపడదు. హైదరాబాదు మహానగరానికి అనుబంధంగా సైబరాబాద్ నిర్మించడం, మధ్య తరహా నగరమైన విజయవాడ గుంటూరుల మద్య ఏమీ లేనిచోట నిర్మించే రాజధానిని ప్రపంచనగరం చేయడం పూర్తిగా భిన్నమైన విషయాలని చంద్రబాబుకు బాగా తెలుసు. కాని ఈ ప్రచార యుగంలో ప్రజలను ముఖ్యంగా తనను బలపర్చేవారిని ఆకట్టుకోవడానికి ఆయన ఇవన్నీచెబుతుంటారు.ఇప్పటికి హైదరాబాదే పూర్తిగా విశ్వనగరం కాలేదంటుంటే ఇంకా అంకురార్పణే జరగనిచోట అతిశయోక్తులెందుకు?
అమరావతి మహానగరంగా మారడం అనేది విజయవాడ గుంటూరులతో జరిగే అనుసంధానంపై ఆధారపడి వుంటుంది.గతంలో విజిఎంటి అంటూ విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి కలిపి 1979లో మర్రి చెన్నారెడ్డి హయాంలోనే ఒక సంస్థ ఏర్పాటు చేశారు. కాని ఇప్పటికి అది జరిగిందేమీ లేదు. ఇప్పుడు కూడా ఏదో నాటకీయమైన అభివృద్ది జరిగిపోతుందనుకోవడానికి ఆధారమేమీ లేదు.ఆశపడవచ్చు గాని అమరావతి ప్రపంచంలోని అయిదు గొప్పనగరాల్లో ఒకటి అయ్యే అవకాశం వుందని చెప్పడం చాలా అతిశయోక్తి. అంతకంటే ముఖ్యమంత్రి వాస్తవాలు చెప్పి చేయగలిగింది చేయడం శ్రేయస్కరం. జనాభా ఉత్పత్తి ఒక స్థాయిలో పెరిగితే గాని మహానగరాలు రూపొందవు.పైన చెప్పిన ప్రభుత్వ బాధ్యుడే ఒక మాట చెప్పారు. బేసిక్ పాపులేషన్ పెరిగే వరకూ పనులకోసం అక్కడకు వలసలు వచ్చే పరిస్థితి ఏర్పడే వరకూ మహానగరం విశ్వనగరం ఆశలు నెరవేరవు అన్నారంతే.
