మెట్రో రహస్యం, అమ్మకం దుస్సాధ్యం

lnt-metrorail-hyderabad-girder

హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టును అమ్మేయాలని ఎల్‌అండ్‌టి నిర్ణయానికి వచ్చినట్టు ఆంధ్రజ్యోతి పతాక శీర్షికలో కథనం ఇచ్చింది. ఆ మరుసటిరోజునే సంస్థ ఉపాద్యక్షుడు ఎస్‌ఎన్‌సుబ్రహ్మణ్యం 67 శాతం పని పూర్తయినట్టు సంపూర్తి చేయడానికి తాము కట్టుబడివున్నట్టు ప్రకటించారు. వాణిజ్య పత్రిక లైవ్‌ మింట్‌ ఆంధ్రజ్యోతి వార్తను ఒకటికి రెండు సార్లు ఉటంకిస్తూ ఈ వివరణ ప్రచురించింది. ఎల్‌అండ్‌టికి మెట్రో భారంగా కనిపిస్తున్నదీ నిజమే. అమ్మకం వీలైతే వదిలించుకోవాలని చాలా కాలంగా చూస్తున్నదీ నిజమే. కాని దాన్ని కొనేవారెవరూ లేరు. సిద్ధమయ్యే అవకాశాలు కూడా లేవు. 16,375 కోట్ల ఖర్చుతో 72 కిలోమీటర్ల దూరం 2017 జులై నాటికి పూర్తి కావలసిన ఈ ప్రాజెక్టును 2018 డిసెంబరుకు అంటే దాదాపు 2019లో పూర్తి చేస్తామని గతంలో మెట్రో ఎండిసిఇవోగా పనిచేసిన వి.బి.గాడ్గిల్‌ 2106 మే నెలలో దిగిపోతూ ప్రకటించారు. ఆయన స్థానంలో శివానంద్‌ నింబర్గి బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆ తర్వాత కాలంలో ఒకటికి రెండు సార్లు మెట్రోసమస్యలపై కథనాలు వస్తూనే వున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్‌ అసెంబ్లీముందు, సుల్తాన్‌ బజార్‌ వంటిచోట్ల అలైన్‌మెంట్‌ మార్చాలని ఆదేశించడంతో ఆలస్యం జరిగితే కెటిఆర్‌ జోక్యం చేసుకుని మళ్లీ దారికి తెచ్చారు.అయినా ఇంకా చాలా పని మిగిలే వుంది. ఇంతకూ మెట్రో ప్రాజెక్టు సమస్య ఏమిటి?
hyderabad-metro-9_13809519214387_hmr_project దీనిపై ఆర్థిక నిపుణుడు, ఇప్పుడు ఎపి ప్రభుత్వంలో ఒక కీలకస్థానంలో వున్న ప్రముఖుడు అసలైన కారణం చెప్పారు. మెట్రో దానికదే ఎప్పుడూ పెద్ద లాభదాయకం కాదు.దానితో ముడిపడిన భూమితో రియల్‌ ఎస్టేట్‌ లాభాలు పొందవచ్చన్న ఆశ దీని వెనక వుంది. వైఎస్‌రాజశేఖర రెడ్డి హయాంలో దాదాపు 1200 ఎకరాల వరకూ ఎల్‌అండ్‌టికి భూమి వచ్చేలా అవగాహనతో మొదలైంది. తర్వాత అది అనేక విధాల తగ్గి ఇప్పుడు 500 ఎకరాల పై చిలుకు మాత్రమే వచ్చేలా వుంది. ఇదైనా ఎలా ఉపయోగించుకోవాలి ఏ మేరకు లాభం వస్తుంది తెలియని స్థితి. వైఎస్‌ఆర్‌ నుంచి కెసిఆర్‌ వరకూ వచ్చిన ఈ మార్పు ఎల్‌అండ్‌ టికి ప్రాణ సంకటంగా మారింది. నిజంగా అంత రియల్‌ ఎస్టేట్‌ లాభాలు ఇవ్వాల్సిన పనిలేదు. అయితే ఇంతవరకూ వచ్చాక వాళ్లు అమ్ముతామన్నా కొనే వారు ఎక్కడా దొరకడం లేదు. కాబట్టే కట్టుబడివున్నామని కట్టే వెళతామని చెబుతున్నారు. కాని నిజంగా అయితే అది అనివార్యంగా పూర్తి చేయడమే గాని ఆసక్తితో కాదు. అని ఆయన వివరించారు. ఎల్‌ అండ్‌ టి ప్రతినిధులుకూడా ఈ ప్రాజెక్టుపై ఒకటికి రెండు సార్లు తమ నిరుత్సాహాన్ని నీరసాన్ని కూడా వె ల్లడించారు. తన పదవీ కాలంలో పూర్తి చేయలేకపోయిన ఒకే ఒక ప్రాజెక్టు ఇదేనని గాడ్గిల్‌ వ్యాఖ్యానించారు. అయితే ఈ మొత్తంలో ఒక అశాకిరణం ఏమంటే ్‌ కెటిఆర్‌ వచ్చే ఎన్నికల ముందైనా మెట్రోను పూర్తి చేయించేందుకు కొంత ప్రత్యేక శ్రద్ద చూపించవచ్చనే అంచనా. మెట్రో అసంపూర్ణంగా వుండటం వల్ల రహదారులపైన రాకపోకలపైన కూడా తీవ్ర ప్రభావం పడుతున్నది. మరి ఈ చిక్కు ముడులన్నీ విడిపోవడం అంత సులభమేమీ కాదు. అయినా తప్పదు- ప్రభుత్వానికీ ఎల్‌అండ్‌టీకి కూడా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *