జయ ఆరోగ్యం- మాజీ ఎడిటర్‌ సాక్ష్యం!

women-pray-for-the-recovery-of-jayalalithaa_295dee4a-8af0-11e6-8186-8729fcb8a174-1
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితి ఇంకా అనిశ్చితంగా అయోమయంగా వుంది. అధికారిక సమాచారం నిగూఢంగానూ అతి పరిమితంగానూ వుంటున్నది. ఈ విషయంలో తాము సాధికార సమాచారం కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని హిందూ రీడర్స్‌ ఎడిటర్‌ పన్నీరు సెల్వన్‌ స్పష్టంగా రాశారు. కాని చిత్రంగా ఆ పత్రిక మాజీ ఎడిటర్‌ మాలిని పార్థసారథి మరుసటి రోజునే ఒక ట్వీట్‌ చేస్తూ జయలలిత ఆరోగ్యం మెరుగుపడిందని తను చాలా కీలకమైన వర్గాల ద్వారా దృవీకరించుకున్నట్టు తెలిపారు. దీన్ని ఆ పత్రిక నివేదించలేదు. గత కొంతకాలంగా హిందూ యాజమాన్య కుటుంబంలో విభేదాలు తెలిసిన విషయాలే. మాలిని ప్రత్యేకాసక్తి ప్రదర్శించడమే గాక జయలలిత సేవలు తమిళనాడుకు అవసరమంటూ మరింత మొగ్గు కూడా చూపించారు. ఈ విధంగా చూస్తే ఆమె అన్నాడిఎంకె రాజకీయ ప్రచారానికి అనుకూలంగా వ్యవహరించారని చెప్పాలి. ఇక అపోలో ఆస్పత్రి నివేదిక ప్రకారం జయలలిత కొద్దిసేపు వెంటిలేటర్‌ లేకుండా కూడా వుండగలిగారట. అంటే మిగిలిన సమయమంతా దానిపైనే వుంటున్నారని అర్థం చేసుకోవచ్చు. సామాన్యుల భాషలో వెంటిలేటర్‌పై ఇన్నిరోజులు వుండటం అంటే చాలా సీరియన్‌ కేసని అర్థం. ఆ విధంగా వుండి కూడా బయిటపడి వారు కనిపిస్తుంటారు గాని సమస్య సంక్లిష్టమే అన్నది స్పష్టమవుతుంది.ఈ లోగా షీలా బాలకృష్ణన్‌ అనే మాజీ ఐఎఎస్‌ అధికారి జయలలిత ప్రత్యేక కార్యదర్శి కథ నడిపిస్తున్నట్టు చెబుతున్నారు.మంత్రులు కూడా ఆమె దగ్గరే ఆదేశాలు తీసుకుంటున్నారట. ఇంకా చాలా కాలం జయలలిత కోలుకోలేని పరిస్థితిలో తాత్కాలిక ఏర్పాటు చేసుకోగల అంతర్గత ప్రజాస్వామ్యం అన్నాడిఎంకెలో కనిపించడం లేదు. కేంద్రం ఎలాగూ తన పాత్ర నిర్వహించడం లేదు. ప్రతిపక్ష డిఎంకె నాయకుడు స్టాలిన్‌ మాత్రం మరోసారి జయ ఆరోగ్య వివరాలు వెల్లడించాలని గట్టిగా కోరారు. మీరు వెళ్లి పరామర్శిస్తారా అని అడగ్గా ఆమె కలుసుకునే స్థితిలో లేరని పరోక్షంగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఒక మహిళ తీవ్ర వ్యాధితో చికిత్సలో వుంటే ఫోటో విడుదల చేయాలని డిఎంకె అద్యక్షుడు కరుణానిధి కోరడం న్యాయం కాదని పాలకపక్షీయులు అంటున్నారు. ఈలోగా కావేరీ జలాలు తదితర సమస్యలపై ఏవో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా పనులు ఆగడం లేదనే సంకేతాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. కాని జయలలిత ఇప్పట్లో పాత పద్ధతిలో పాలించలేరని మాత్రం తేలిపోయింది. ఆమె పరిస్తితి అసలే విషమించే అవకాశం కూడా చాలా వుండొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *