వాస్తు వలయంలో పాలకుల పాట్లు!
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సచివాలయాన్ని సంపూర్ణంగా ఉపయోగించకుండానే వదిలేస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. రాష్ట్రాధినేతగా ఎక్కడి నుంచి పాలించాలనేది ఆయన అభీష్టమే. ఆరు మాసాలుగా ఆయన మంత్రివర్గ సమావేశాల్లో తప్ప కనిపించడం లేదని అధికారులు మీడియా కూడా చెబుతున్నారు. ఇప్పుడాయన కొత్తగా కట్టిన క్యాంపు కార్యాలయానికి తరలిపోతున్నారంటున్నారు. అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. నిజానికి ఈ సచివాలయం మొదటి నుంచి సందేహాలతోనే నడుస్తున్నది. ఎర్రగడ్డలో కట్టేస్తారని చాలా వార్తలు వచ్చాయి. ఇప్పటికి ఆ ఆలోచన పూర్తిగా మానుకున్నట్టు లేదు. ఇంతకూ ఈ మార్పులకు చేర్పులకు కారణం వాస్తు విశ్వాసం కావడమే విచిత్రం. వ్యక్తులుగా ఏవైనా పాటించవచ్చు గాని ప్రభుత్వాధినేతలుగా ఇలాటి వ్యక్తిగత నమ్మకాలను కలగాపులగం చేస్తే ప్రజల్లో అలాటి భయాలు ఇంకా పెరుగుతాయి. ఇంతకూ ప్రజలు అత్యధికంగా ఓట్లేసి గెలిపించిన తర్వాత ఎక్కడ నుంచి పాలిస్తే ఏమిటి? ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లు అంటాం గాని కనిపించని శక్తులు కీడు చేయొచ్చని నమ్మడం వైజ్ఞానిక దృక్పథం ఎంతమాత్రం కాదు. ఇప్పుడు ఎపి సచివాలయం తరలిపోవడమే గాక తెలంగాణాధీశుడు కూడా రావడం మానేస్తే సచివాలయం రాజకీయ ప్రాధాన్యత కోల్పోవడం ఖాయం. అన్నట్టు చంద్రబాబు నాయుడుకు కూడా ఈ తరహా నమ్మకాలు వుండబట్టే నాగార్జునా యూనివర్సిటీలో అధికారికంగా అడుగు పెట్టకుండానే నడిపించేశారు! అమరావతిలో కూడా దోష నివారణకూ ముహూర్తబలాల కోసం పదేపదే ప్రారంబోత్సవాలు చేవారు. స్వంయకృషిని నమ్ముకుంటే ఇవన్నీ ఏమీ చేయబోవని ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన వారే ఇంత ఆభద్రతకు గురైతే ఎలా?
