వెలగపూడికి ఉద్యోగులు.. అధీనంలోనే భవనాలు
2016 అక్టోబరు మూదవ తేదీ నుంచి ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం అంటే పరిపాలన నూతన రాజధాని అమరావతి ప్రాంతంలోని వెలగపూడి నుంచి ప్రారంభం కానున్నది. 60ఏళ్ల పాటు హైదరాబాదులో హుస్సేన్ సాగర తీరం నుంచి సాగిన రాజకీయ చరిత్ర శతాబ్దాల కిందటి రాజధాని అమరావతికి మరలిపోవడం జ్ఞాపకం పెట్టుకోవలసిన ఘట్టమే. ఈ ఏడాది జూన్ 1 నుంచి పలు దఫాలు ఈ తరలింపు తేదీలు ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చివరగా అక్టోబరు3ను ఖరారు చేయడమే గాక స్వయంగా తన కార్యా
లయాన్ని కూడా తరలిస్తున్నారు . రాజ్యాంగ రీత్యా హైదరాబాదు 2024 వరకూ ఉమ్మడి రాజధాని గనక ఎపికి ి కేటాయించిన భవనాలను అప్పుడే తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించడం లేదు. నామకార్థపు సిబ్బందితో భారీ ఫైళ్ల కట్టలతో ఈ భవనాలు ఎపి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగుతాయన్నది ఇప్పటికి వున్న అవగాహన. అసంఖ్యాకమైన అధికారిక ఫైళ్లలో అత్యధికభాగం డిజిటలైజ్ చేయడం, కాల పరిమితి ప్రకారం ధ్వంసం చేయడం జరిగిపోయింది.కనుక ఎపిలోని సచివాలయంలో ఈ పేపర్ల ద్వారా పనిజరిగితే హైదరాబాదులో ఒరిజినల్స్ వుంటాయన్నమాట.
మొత్తం 22వేలమందికి పైగా ఎపి సచివాలయ సిబ్బంది అధికారులు వుంటే వీరిలో దాదాపు సగభాగం పదవీ విరమణ చేశారు. ఇంచుమించు 12 వేలమంది దశలవారిగా తరలిపోయిన పోతున్నట్టు చెప్పాలి.వీరికి తగిన ఇంటి వసతి వ ంటివి లేని మాట నిజం. ఇందుకోసం భారీ వ్యయంతో ప్రైవేటు భవనాలను తీసుకున్నా అద్దెలు భరించలేని స్థాయిలో వున్నాయి. కుటుంబాలతో బదిలీ కాలేని వారిని దృష్టిలోపెట్టుకుని వారానికి అయిదురోజుల పని విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది.. ఇవన్నీ ఎన్ని చేసినా హడావుడి తరలింపు వల్ల ఉత్పన్నమైన సమస్యలు వుండనే వుంటాయి.
ఒకసారి విభజనంటూ జరిగిపోయిన తర్వాత భౌగోళికంగా ఆనుకుని వుండని హైదరాబాదు నుంచి పరిపాలన నడపడం అవసరం లేనిదే గాక అవాస్తవికంగానూ వుంటుంది. ఎపిలో ఎటు వైపు నుంచి చూసినా 200కిలోమీటర్లపైమాటే. అధికారులు ఒకచోట అధినేతలు ఒకచోట వుండటం వల్ల అనుదిన సమస్యలు ఎదురవుతాయి. కనుక రాజధానిని త్వరితంగా తరలించడంలో తప్పులేదు. కాని ఇందుకు అనుసరించిన విధానం మాత్రం సమగ్రంగా సక్రమంగా లేదు. వెళ్లేచోట ఏర్పాట్టు నిర్మాణాలు కూడా అంతంతమాత్రంగా అది కూడా హడావుడిగా జరిగాయి. ఆధునిక సాంకేతిక యుగంలో ఒక ముందస్తు ప్రణాళికతో ఈ పనిచేసి వుంటే బావుండేది. నిజానికి ఇప్పటికి హైదరాబాదే చట్టబద్దమైన రాజధానిగా (డీజ్యూరీ) వుంటుంది. అమరావతి వాస్తవిక రాజధాని(డీ ఫ్యాక్టో) మాత్రమే. దూరం విషయం తీసుకుంటే రాయలసీమ జిల్లాలకు మరీ ముఖ్యంగా కడప అనంతపురంలకు బాగాదూరం పెరుగుతుంది. దీన్ని వేగంగా ప్రయాణించేందుకు ఏవేవో దారులు రైళ్లు బస్సులు వేస్తామన్నప్పటికి ఇప్పటికి జరిగింది లేదు. ఇక ఉద్యోగులు కుటుంబాలు పిల్లల చదువులు భార్యాభర్తల నియామకాల వంటి అంశాలు క్లిష్టంగానే వుంటాయి.ఇలాటి సందర్బాల్లో వ్యక్తిగత సమస్యలు ప్రధానం కాదని చెప్పినా ప్రభుత్వం ముందే వీటికి సరైన పరిష్కారాలు చూడవలసిందే.