హెచ్‌సియులోనూ గర్వభంగం.. ఇకనైనా జ్ఞానోదయం?
ప్రగతిశీల విద్యార్థి నేతలకూ సామాజికంగా అణగారిన తరగతుల పిల్లలకూ దేశభక్తి లేదన్నట్టు దేశమంతా గగ్గోలు పెట్టిన కాషాయ కూటమి మొన్న జెఎన్‌యులో లాగే ఇప్పుడు హెచ్‌సియులోనూ కుప్పకూలింది. లేనిపోని ఫిర్యాదులతో అసత్యారోపణలతో రోహిత్ వంటి ప్రతిభావంతుడి ప్రాణహరణానికి,దీర్ఘకాలిక నిర్బంధాలకూ కారణమైన శక్తులను విద్యార్థులు నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. దీనంతటికి ఆధ్వర్యం వహించిన అఖిలభారత విద్యార్థి పరిషత్(ఎబివిపి) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క స్థానం తెచ్చుకోలేకపోయింది. ఎస్‌ఎప్‌ఐ నాయకత్వంలోని సామాజిక ఐక్య కూటమి అద్యక్ష స్థానంతో సహా అన్ని ప్యానల్ పోస్టులనూ కైవశం చేసుకోగలిగింది. ఈ సంఘటనలో ఇంకా బిఎస్‌ఎప్, డిఎష్‌యు,టిఎస్‌ఎఫ్,టీవీవీ వున్నాయి. గురువారం రాత్రి జరిగిన ఏడు రౌండ్ల ఓట్ల లెక్కింపులో ప్రతిసారీ ఇదే కూటమి జయభేరి మోగించింది. హెచ్‌సియు స్టూడెంట్స్ యూనియన్ అద్యక్షుడుగా కులదీప్ సింగ్ నాగి ఎన్నికయ్యారు. ఎబివిపి అభ్యర్థి విజయకుమార్‌పై ఆయనకు 53 ఓట్ల ఆధిక్యం రాగా అంబేద్కర్ స్టూడెం
ట్స్ అసోసియేషన్‌్(ఎఎస్‌ఎ) మూడో స్థానంలో నిలిచారు. ఇంకా ప్రధాన కార్యదర్శిగా సుమన్ డుమెరా, సహాయ కార్యదర్శిగా పిల్లి విజయకుమార్, ఉపాద్యక్షుడుగా భూక్య సుందర్ తదితరులు విజయం సాధించారు. 57 కౌన్సిలర్ స్థానాల్లోనూ 37 ఈ సంఘటనకే దక్కాయి. వామపక్ష విద్యార్థి సంఘాలూ, దళిత సంఘాలు కలసి దేశ ద్రోహులను ప్రోత్సహిస్తున్నాయని పార్లమెంటు స్థాయిలో అప్పటి ఆ శాఖా మంత్రి సృతి ఇరానీ ఆరోపించారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో సహా బిజెపి ప్రజాప్రతినిధులూ నాయకులూ ఈ దుష్ప్రచారంలోనూ కక్షసాధింపులోనూ రకరకాల పత్రాలు బనాయించారు. చివరకు రోహిత్ కులంపైనా పంచాయితీ చేశారు. తెలుగు పెద్దన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు వచ్చిన ప్రతిసారీ ఆ చదువుకునే పిల్లలపై దుమ్మెత్తిపోశారు. ఆయనకు అస్మదీయుడుగానే అప్పారావు విసి పీఠం పొందగలిగారని సంఘ పరివార్ వర్గాలే వాపోయాయి. మరి ఇవన్నీ అయ్యాక ప్రజాస్వామిక విద్యార్థి సంఘాలు ఇంత ఘన విజయం సాధించాయి గదా.. ఓట్లేసిన వారూ దేశద్రోహులేనా? లేక తిట్టిపోసిన వారే ద్వేష జీవులా? ఏమైతేనేం గెలిచిన వారికి అభినందనలు. హెచ్‌సియులో న్యాయం జరగాలనీ ప్రశాంతత రావాలని ఆకాంక్ష. విద్యాసంస్థల్లో విష ప్రచారాలు ఎబివిపిని నిలబెట్టడం కోసం అడ్డదోవలూ విరమించేలా కనువిప్పు కలుగుతుందని ఆశిద్దాం.


