కట్టప్ప తారలందరినీ పొడిచినట్టే
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న దానిపై చాలా కథలూ జోకులూ నడిచాయి. నేనే చెప్పానని సృష్టికర్త రాజమౌళి కూడా చూయింగ్గమ్ జోకేశారు. తాజాగా ఇప్పుడు బళ్లాలదేవుడు రానా కట్టప్ప ఎందుకు చంపాడో తమకందరికీ తెలుసని కొత్తగా ప్రకటించారు. కాస్త ముందో వెనకో తెలియకుండా ఎలా వుంటుంది? కాని ఇదంతా చూస్తుంటే ఒక సీరియల్ సినిమా పరిధిని దాటిన ప్రచార వ్యూహం గోచరిస్తుంది. రాజమౌళి అన్న మాట మాత్రం చాలా అర్థవంతమైంది. బాహుబలిని చంపమని కట్టప్పకు ఆయన చెప్పకపోతే అంత పనిచేయడు. కాని రాజమౌళి చెప్పని విషయం ఒకటుంది. కట్టప్ప బాహుబలినే గాక ఆ చిత్రంలో మిగిలిన పాత్రలనూ నటీనటులనూ సాంకేతిక నిపుణులనూ కూడా ఒక్క పోటు పొడిచాడు. ఏమంటే ఇంతకాలం ఇప్పుడు కూడా మొత్తం చర్చ అంతా ఆ ఒక్క పాయింటు చుట్టూనే తిప్పేశారు. దర్శకుడుగా రాజమౌళి గురించి ఎలాగూ చెప్పుకుంటారు. కాని ఈ చిత్రం కోసం రెండుమూడేళ్లు సినిమాలు వదులుకున్న ప్రభాస్,డీ గ్లామర్ పాత్రలు ధరించిన అనుష్క, తమన్నా వంటివారి గురించి చాలా తక్కువగానే చెప్పుకున్నారు. ఇప్పటికైనా వారిపైన ఫోకస్ చేయడం న్యాయం తప్ప అదేదో అపురూపమైనట్టు కట్టప్ప చుట్టూనే తిప్పేస్తే ఎలా?
