శహబ్భాష్ ఇస్రో! అష్ట గ్రహ ప్రయోగం..

అష్టగ్రహాలు నవగ్రహాలు ఏవైనా మానవ వైజ్ఞానికి ప్రస్థానంలో ప్రయోగించవచ్చునని నిరూపించిన శ్రీహరికోట ఇస్రో శాస్త్రవేత్తలకూ సాంకేతిక నిపుణులకూ జేజేలు పలుకుదాం. ఒకేసారి ఎనిమిది ఉపగ్రహాలను ప్రయోగించడం,వాటిలో కొన్నిటిని కక్ష్యలో ప్రవేశపెట్టడం మన శాస్త్రజ్ఞుల ప్రతిభకు గీటురాయి. ఇందులో మూడు మన దేశానికి చెందినవైతే మూడు అల్జీరియావి,ఒకటి అమెరికాది,మరొకటి కెనడాకు చెందింది. ఇందులోనూ విశేషమేమంటే ప్రయోగించిన మూడు భారతీయ ఉపగ్రహాలలోనూ రెండు విద్యార్థులు చేసినవి కావడం! బాంబే ఐఐటి విద్యార్థులు రూపొందించిన ప్రథమం అనే ఉపగ్రహం విశ్వాంతరాళంలో ఎలక్ట్రానిక్ ఆవరణాన్ని అధ్యయనంచేస్తుంది. ఇక బెంగుళూరు పిఇఎస్ యూనివర్సీటీ విద్యార్థులు రూపొందించిన పిశాట్ భూమి ఫోటోలు తీస్తుంది. మరొకటి వాతావరణ అధ్యయనానికి ఉద్దేశించింది. మన శాస్త్రవేత్తల కృషి గర్వకారణమైతే విద్యార్థుల ప్రతిభాసక్తులు ఆనందదాయకాలు. ఇంత దేశీయ సామర్థ్యం గల మనం తినుబండారాలకూ పానీయాలకు కూడా విదేశీ సంస్థలపై ఆదారపడ్డం ఎంత హాస్యాస్పదం? మరెంత నష్టదాయకం? మనకు తెలియని లేదా లేని పరిజ్ఞానం కోసం విదేశాల వైపు చూడాలి గాని చిన్నచితకా వ్యాపారాలన్నిటికి ఎఫ్డిఐల పేరిట ఒప్పందాల పేరిట తలుపులు తెరిచి దేశీయ ఉపాధిని ఉత్పత్తిని దెబ్బతీసుకోవద్దని ఈ ప్రయోగాల విజయం గుర్తు చేస్తున్నది. గతంలో మన రాకెట్ ప్రయోగాలను కూడా అడ్డుకున్న అమెరికా ధోరణిని మర్చిపోవద్దని హెచ్చరిస్తున్నది.