కొత్త పరిష్కారాలు చూపని అపెక్స్‌ సమావేశం

21brk-92bనదీజలాలకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్‌ తెలంగాణ ముఖ్యమంత్రులూ నీటిపారుదల మంత్రులూ అధికారులతో కేంద్ర జలవనరుల మంత్రిఉమాభారతి నిర్వహించిన సమావేశం అనుకున్నట్టే ముగిసింది. ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖర రావులతో పాటు హరీష్‌ రావు, దేవినేని ఉమామహేశ్వరరావులు అధికారులు హాజరైన ఈ సమావేశం సుప్రీం కోర్టు ఆదేశాలపై జరిగిన లాంఛనంగానే ముగిసింది. ఇరు పక్షాలూ తమ వాదనలకు కట్టుబడి వుండటం వల్ల కొత్త మలుపులేమీ వుండబోవని ముందుగా అనుకున్నదే. మూడు విషయాలపై అంగీకారం కుదిరిందని ఈ రోజు మీడియాతో ఉమాభారతి చెప్పిన అంశాలు మౌలికమైనవి గాని తక్షణ పరిష్కారాలు గానీ కాదు. మొదటిది- ఎవరు ఎన్ని నీళ్లు వాడుకున్నారో ఖచ్చితంగా లెక్క కట్టేందుకు టెలిమెట్రి విధానం ప్రవేశపెట్టడం. రెండవది- నదీ జలాల లభ్యత తీరుతెన్నులపై ఒక సంయుక్త నిపుణుల కమిటీ నియామకం. మూడవది- ఇందుకు సంబంధించిన సమగ్ర పరిష్కారసూత్రాల కోసం ట్రిబ్యునల్‌ను కోరడం.
ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండేళ్ల తక్వాతైనా ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం కావడం,కొంతైనా ఉమ్మడిగా ప్రకటించడం మంచివిషయమే. కాని ఇందులో కొత్తదనమేదీ లేదు.టెలిమెట్రి తప్పదని గతంలోనే నదీజలాల నిర్వహణబోర్డు ప్రకటించింది. ఇక నిపుణులు ఎప్పుడూ చర్చిస్తూనే వుంటారు. ఇప్పుడు సంయుక్త కమిటీ అని కేంద్ర ప్రతినిధి వుంటారని చెప్పడం అదనం. అంతిమంగా ట్రిబ్యునల్‌ ఆదేశాల కోసం చూడవలసిందే. నిర్దిష్ట ప్రాజెక్టుల వివాదాలపై ప్రశ్నలకు ఉమాభారతి సమాధానం దాటేశారు. మరో రెండు అంశాలపై అంగీకారం కుదరలేదని చెప్పారు. కావేరీ నదీజలాల వివాదం వంటివి సాగుతున్నప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌ తెలంగాణలు కలసి చర్చించుకోవడం పట్ల ఆమె హర్షం ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *