రాజధాని కిరాతకం సమాజానికి గుణపాఠం

ఉత్తర ఢిల్లీలోని బురారి ప్రాంతంలో సురేందర్ సింగ్ అనే ఆగంతకుడు కరుణ అనే టీచర్‌ను దారుణంగా నడిరోడ్డుమీద 20 సార్లు పొడిచి చంపాడు. అది బిజీగా వుండే రోడ్డు. అప్పుడు చుట్టూ కొందరున్నారు గాని ఎవరూ అడ్డుపడేందుకు సిద్దం కాలేదు. ఈ హంతకుడు ఆమెను ఏడాడిగా వెంటాడి వేధిస్తున్నాడు. ఆమె నిరాకరించింది. కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. అయినా వారు పట్టించుకోలేదు. తను ఆమెను కసిగా పొడిచి పొడిచి కాళ్లతో కొట్టి దుండగులతో కలసి పారిపోయాడు.
దేశంలో ఇలాటి ఆగంతకుల దాడి ఘటనలు గత ఏడాది 1124 నమోదయ్యాయి. ఢిల్లీలోనే రెండు రోజుల కిందట ఇలాటి మరో హత్య జరిగింది.
ఈ ఘటనలు సిసిటివిలో చూడొచ్చు. వెంటాడ్డం ప్రేమించామనడం, తెగించి ప్రాణాలు తీయడం యాసిడ్ పోయడం వంటివి చాలా దారుణమైన ఘటనలు. ఇవే గాక బహిరంగంగా స్త్రీలను హింసించే వేధించే ఘటనలు ఏవైనా సరే ఎవరైనా అడ్డుకోవచ్చు. వారి సంబంధమేమిటని సంకోచించనవసరం లేదు. అలాగే సామూహికంగా అడ్డుపడితే దుండగులు ఎంతవారైనా చేయగలిగింది వుండదు.
నా వరకు నేను గత రెండేళ్లలో స్త్రీలను హింసించే లేదా బాధించే మూడు నాలుగు ఘటనలు చూసి అడ్డుకొన్నప్పుడు ఫలితం కనిపించింది. ఆ మహిళలు కాస్త ఉపశమనం పొంది తప్పించుకోవడం, బాధించే వారు ఏవో సాకులు చెప్పినా ఆ పనులు మానేయడం కనిపించింది. వారిని తర్వాత కూడా కనిపెట్టి చూడవలసి వుంటుంది గాని అన్నిసార్లు ఆ అవకాశం వుండదు.ఒకసారి బస్సులో జడ్జర్ల దాటాక ముందుసీటు యువకుడు తనతో వున్న యువతిని అదేపనిగా హింసిస్తున్నాడు.అతను గిచ్చుతుంటే ఆమె బాధతో కేకలు పెడుతున్నది. తీరా మాట్లాడితే భార్య భర్తలేనన్నారు. అయినా సరే అని మందలిస్తే సర్దుకున్నారు. ఆ సమయంలో ఆ అమ్మాయి నా ఫోన్ నెంబర్ అడిగింది. ఎవరి దగ్గరా పెన్ను లేదు. తన దగ్గర ఫోన్ కూడా లేదు. ఆ కుర్రాడి ఫోన్‌లోనే ఫీడ్ చేశారు.దానివల్ల ప్రయోజనం వుండదని తెలిసినా చేయగలిగింది లేకపోయింది. రెండు నెలల కిందట మరో కుర్రాడు ఒక అమ్మాయిని విపరీతంగా బెదిరించడమే గాక కాస్త దౌర్జన్యం కూడా చేస్తున్నాడు. అక్కడ వున్న వాళ్లు గాని దుకాణదారులు గాని పట్టించుకోవడం లేదు. నేను గట్టిగా అడిగాక సర్దుకుని వెళ్లిపోయారు. ఇలాటి ఉదాహరణలు ఇంకా వున్నాయి. దయచేసి ఎవరైనా అడగండి. మన సినిమాల్లో అమ్మాయిల వెంటపడ్డం వేధించడం పెద్ద హీరోయిజంలా చూపిస్తుంటారు.టీజింగ్ సాంగులు పెడుతుంటారు. మరీ ముఖ్యంగా తమిళం కొంతవరకూ తెలుగు సినిమాల్లో వాళ్లనే అమర ప్రేమికులుగా చూపిస్తుంటారు. పైగా తమిళంలోనైతే వారిని భగజీవులుగా ఎక్కడ లేని సానుభూతితో చూపిస్తుంటారు.ఇలాటి ఘటనలకు అది కూడా కారణమే.