యుపిలో తమిళనాడు- యాదవ రాజ్యంలో ముసలం
ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్ వాది పార్టీ, ప్రభుత్వం సంక్షోభంలో పడిపోయాయనే వార్తలు తమిళనాడును గుర్తు చేస్తాయి. ఉత్తర దక్షిణ భారత రాజకీయాల మధ్య తేడా గురించి ఎంతగా చెప్పినా కుటుంబాలు, ప్రాంతీయ పార్టీల పాలన పెనవేసుకుపోయిన తర్వాత ఇలాటి పరిస్థితులే వస్తుంటాయి. ఎస్‌పి జాతీయ అద్యక్షుడు అత్యున్నత అధినేత( పార్టీ వాళ్లు నేతాజి అని పిలుస్తుంటారు) ములాయం సింగ్ యాదవ్ తన కుమారుడు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ను రాష్ట్ర ఎస్‌పి అద్యక్షపదవి నుంచి తొలగించి తమ్ముడు శివ్‌పాల్ యాదవ్‌ను నియమించడం టీ కప్పులో తుపాను లాటిదేమీ కాదు. చాలా కాలంగా లోలోపల నడుస్తున్న ఘర్షణకు పరాకాష్ట. కనుకనే అఖిలేష్ అదే రోజు రాత్రి తన మంత్రివర్గంలో సభ్యుడైన బాబాయి శివపాల్ శాఖలు రెండింటిని కత్తిరించేశారు. తన ప్రకటిత కార్యక్రమాలు వేడుకలకు కూడా హాజరు కాకుండా వుండిపోయారు. అబ్బాయిపై బాబాయి కోప్పడింది లేదు గాని అది ముఖ్యమంత్రి ఇష్టం అనే వ్యాఖ్యతో సరిపెట్టారు. నిజానికి ఇక్కడ వివాదం తండ్రీ కొడుకుల మధ్యనే అంటారు. ములాయం సింగ్ కుటుంబానికి చెందిన 20 మంది పార్టీలోనూ ప్రభుత్వంలోనూ పదవులు నిర్వహిస్తున్నారు. అయిదుగురు లోక్‌సభ సభ్యులు, ఒకరు రాజ్యసభ సభ్యులు, ఇద్దరు ఎంఎల్‌సిలు, ఒక ఎంఎల్‌ఎ, ఇంకా మంత్రులు తదితరులు వున్నారు. మరి ఇంత మందిని సమన్వయం చేయడం పరస్పరం తగాదాలు రాకుండా చూడటం పెద్ద పనే.పైగా యాదవ్ వర్గాన్ని కూడా వెంటతీసుకుపోవాలి. ఈ క్రమంలో ములాయం తెరవెనక నుంచి చక్రం తిప్పుతూ వచ్చారు. అఖిలేష్ అధికారపీఠంపై వున్నా పితృదేవుని ఆజ్ఞ లేకుండా ఏమీ చేయలేని స్థితి.దీనిపై అప్పుడప్పుడూ విసుగు ప్రకటిస్తు
న్నా ఎలాగో నడిపించుకువచ్చారు. ఇప్పుడు ఆరు నెలల్లో ఎన్నికలు వుండటం రాజకీయ వేడి పెంచింది.
లోక్‌సభ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న ఎస్‌పి ఉప ఎన్నికల్లో మంచి విజయాలే సాధించింది. అయినా దానికి బిఎస్‌పి బలమైన ప్రత్యర్థిగా వుండగా బిజెపి కూడా శాయశక్తులూ కేంద్రీకరించింది.ఇలాటి సమయంలో అనుసరించాల్సి వ్యూహం అంతర్గత నియామకాలపై తీవ్ర విభేదాలేర్పడ్డాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంపికలో అఖిలేష్ స్వతంత్రంగా వ్యవహరించడం ములాయంకు మింగుడు పడలేదు. ఈ లోగా శివపాల్ యాదవ్ ప్రభుత్వంపై బహిరంగ విమర్శలు చేశారు. వాటిని ముఖ్యమంత్రి ఖండిస్తే ముఖ్యనేత మెతగ్గా తీసుకున్నారు. ముక్తర్ అన్సారీ నాయకత్వంలోని క్వామి ఏకతా దళ్‌ని తమ పార్టీలో విలీనం చేసుకుంటున్నట్టు శివపాల్ ప్రకటిస్తే అఖిలేష్ అడ్డుపడ్డారు. ఆ తర్వాతి దశలో అవినీతి ఆరోపణలపై ములాయం సన్నిహితులైన గాయత్రి ప్రజాపతితో సహా ఇద్దరు మంత్రులను అఖిలేష్ హఠాత్తుగా తొలగించడం మరింత ఆగ్రహం తెప్పించిందంటారు. పార్టీ సంప్రదాయ మద్దతు దారులను కోల్పోతున్నామనే భావన ఆయనలో ఏర్పడింది. అదే రోజు రాత్రికి అఖిలేష్ స్థానంలో శివపాల్‌ను రాష్ట్ర అద్యక్షుడుగా నియమిస్తున్నట్టు ప్రకటించారు. ఇదంతా అంతర్గత కుమ్ములాట అని వార్తలు వస్తున్నా ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకోవడమేనని ములాయం సన్నిహితులు సమర్థిస్తున్నారు. చివరకు ఈ మార్పులన్నీ కూడా ఆ పేరుతో సరిపెట్టేయొచ్చు. పైగా మీడియాలో కూడా చర్చ దీనిపై జరిగేట్టు చేసి ప్రతిపక్షాలకు ప్రచారం రాకుండా చూడొచ్చు. ఇదంతా చూస్తుంటే గతంలో తమిళనాడులో కరుణానిధి కుటుంబంలోను మనవలు మారన్‌లు, కుమారులు అళగిరి, స్టాలిన్ వంటి వారి మద్య సాగిన సమరం గుర్తుకు రావడం లేదూ? కృష్ణావతార పరిసమాప్తిలో యాదవ కులంలో ముసలం పుట్టిన కథ భారతంలో వుంది.మరి పరిపాలనా కాలం ముగుస్తుండగా ములాయం కుటుంబంలో పుట్టిన ఈ ముసలం ఏమవుతుందో? ప్రభుత్వంలో సంక్షోభం వుందేమో గాని కుటుంబంలో లేదని ముఖ్యమంత్రి అఖిలేష్ చెబుతున్నారంటే నాన్న మాట ప్రకారమే చేస్తానని చెబుతున్నారనుకోవాలా?
