ఎందుకు నవ్వారు?

bhetala111
విసుగు చెందని విక్రమార్కుడు ఎప్పటిలాగానే చెట్టుమీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని నడవసాగాడు.
రాజా అన్న గొంతు వినిపించింది. కాకపోతే కాస్త కొత్తగా వుంది.
మిమిక్రీ ప్రాక్టీసు చేస్తున్నావా భేతాళా అని అడిగాడు.
భేతాళ కాదు భేతాళి అని మరింత మార్డవంగా వినిపించింది.
అరే ఇన్నేళ్ల నా సర్వీసులో భేతాళుడే తప్ప నువ్వెప్పుడూ తగల్లేదే? బోలెడు ఆశ్చర్యంగా అడిగాడు విక్రమార్కుడు.
అదే కదా..చచ్చిన తర్వాత కూడా మా పరిస్తితి ఆలా వుంటుంది మరి! విక్రమార్క కథల్లో ఒక్కసారైనా ఆడశవం గురించి రాయలేదు భేతాళి నిష్టూరంగా అంది.
నిజమే.. తప్పనిసరిగా తలూపాడు విక్రమార్కుడు.
సరే ఆ గొడవెందుకు గాని నేను కూడా శ్రమ తెలియకుండా వుండటానికి నీకు ఒక కథ చెబుతాను. సమాధానం తెలిసి కూడా చెప్పక పోయావో నీ తల వేయి వక్కలవుతుంది తెలుసుగా.. భేతాళి అడిగింది.
అబ్బో ఇది రోజుకు పది సార్లు వింటున్న మాటేగా.. ఇంక స్టోరీ బిగిన్జెయ్యి అన్నా డు విక్ర.
….
వేణు శీను కాలే.జీలో మంచి స్నేహితులు. అయితే ట్రాన్స్‌ఫర్ల వల్ల వేరే వేరే చోట్ల వుంటున్నారు. ఒకసారి వేణు పని మీద శీను వాళ్లింటికి వచ్చాడు.
భోజనాలయ్యాక మిత్రులిద్దరితో పాటు శీను భార్య సీత, పిల్లలు అంతా కూచుని కబుర్లు మొదలెట్టారు. సంభాషణ నెమ్మదిగా వేణు కుటుంబం వైపు మరలింది.
మీరెప్పుడూ వదినె గారిని తీసుకురాలేదు అంది సీత.
ఎక్కడమ్మా ఎప్పుడూ ఏవో పనులు… అన్నాడు వేణు.
అయినా మీరు వచ్చినప్పుడు తీసుకురావచ్చు గదా..
ఇద్దరం వచ్చేస్తే ఇల్లు ఎలా నడుస్తుంది?
పోనీ మీరు వెళ్లి ఆంటీని పంపించండి అంకుల్‌ అంది శీను కూతురు.
సరిపోయింది.. తను ఒక్కతే రాగలిగితే అంతకన్నానా? వాళ్ల పుట్టింట్లో కూడా నేను దించి రావలసిందే.. గొప్పగా చెప్పాడు శీను.
అప్పుడు సీత బిగ్గరగా నవ్వింది..
భేతాళి హఠాత్తుగా కథ అపేయడంతో ప్రశ్న సంధిస్తుందని సిద్ధమై పోయాడు విక్రమార్కుడు.
రాజా. వేణు చెప్పిన దాంట్లో పెద్ద వింతేమీ లేదు కదా,, సీత ఎందుకు అంతగా నవ్వింది? ఈ ప్రశ్నకు జవాబు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల వేయి వక్కలవుతుంది..అని భేతాళి అనేలోగానో
‘అదంతా చెప్పనవసరం లేదులే.. ఎంతో అభ్యుదయంగా మాట్టాడే వేణు తను లేకపోతే భార్య ప్రయాణాలు చేయలేదన్న భావాన్ని ఇతరులకు చెప్పడం చూసి ఆమెకు నవ్వొచ్చింది. చాలా మంది అలానే అంటుంటే వింటూ వుంటుంది గనక ఈయన కూడా ఇంతేనా అన్న అనుకుని వుంటుంది. ఒక వేళ ఆయన భార్య వంటరిగా వెళ్లలేనంటే ధైర్యం ఇచ్చి పంపించాలి గాని తను పెద్ద తోడు ఇస్తున్నట్టు ఫీలై పోవడాన్ని ఆమె ఎగతాళి చేసిందన్న మాట
విక్రమార్కుడు ఉత్సాహంగా చెప్పుకుపోతుంటే భేతాళి శవంతో సహా చెట్టుపై కెక్కింది.
………
మళ్లీ దాన్నిదించి భుజాన వేసుకుని బయిలు దేరాడు విక్రమార్కుడు. షరా మామూలుగా భేతాళి కదిలింది.
రాజా పురుషుడవైనప్పటికీ వున్న సంగతి వున్నట్టు చెప్పావు. సంతోషం. అందుకే నీకు మరో మంచి కథ చెబుతాను. వింటూ శ్రమ మర్చిపో అంది.
కానిరు అన్నాడు విక్ర.
రమేష్‌, కామేష్‌ దూరపు చుట్టాలు. పెద్దగా కలుసుకోరు. ఒక వ్యవహారం విషయమై కామేష్‌ ఇంటికి వచ్చాడు రమేష్‌. ఇద్దరూ కలసి వెళ్లి బ్యాంకులో డిపాజిట్టు కట్టి రావాలి.
తీరా బయిలు దేరే ముందు చూసుకుంటే ఒక కాగితం కనిపించలేదు.
అరే ఇంటిదగ్గర మర్చిపోయాను అంటూ ఫోన్‌ చేశాడు రమేష్‌.
కాస్సేపట్లో వచ్చేస్తుందిలే మరేం పర్వాలేదు అని చెప్పాడు.
పదిహేను నిముషాల్లో రమేష్‌ కూతురు స్వప్న ఆ కాగితాలు తీసుకొని రావడంతో సమస్య పరిష్కారమైంది. వూపిరి పీల్చుకున్న కామేష్‌ ఆమెను పలకరించాలనుకున్నాడు.
ఏమ్మా నీవొచ్చావ్‌? మీ తమ్ముడు లేడా? అని అడిగాడు
ఆయన మాటకు జవాబు చెప్పకపోగా పగలబడి నవ్వింది స్వప్న.
ఆహా? ఎగతాళిగా వూ కొట్టాడు విక్ర.
అడిగిన దానికి చెప్పే బదులు ఆ అమ్మాయి ఎందుకలా నవ్విందో..
చెప్పమంటావ్‌ అంతేగా?
తెలిసిందిగా చెప్పెరు? అంది భేతాళి
బయిట పనులు ఏవైనా మగపిల్లలే చేయాలి తప్ప అమ్మాయిలు చేయలేరన్న రమేష్‌ ఆలోచనకు ఆమెకు నవ్వొచ్చింది. తన కంటే చిన్నవాడైన తమ్ముడు చేయగలిగిన పని తను చేయలేనను కోవడం చూసి అంతగా నవ్విందన్న మాట.. కరెక్టేనా అని విక్ర అడిగేలోపునే భేతాళి తుర్రున చెట్టుపై కురికింది.
భేతాళుడి కన్నా భేతాళి స్పీడు ఎక్కువగా వుందే అనుకుంటూ విక్రమార్కుడు మళ్లీచెట్టుదారి పట్టాడు.
………….
ఆంజనేయులు, పరంధామయ్య ఒకే ఆఫీసులో పనిచేస్తారు. పరంధామయ్య ఈ మధ్యనే మరో వూరి నుంచి బదిలీ మీద వచ్చాడు గాని ఆంజనేయులు ఎప్పటి నుంచో అక్కడే వున్నాడు. ఫ్యామిలీని తీసుకురావాలంటే ఇల్లు కుదరక అవస్త పడుతున్న పరంధామయ్య అతనికి ఆ పని పురమాయించాడు.
ఏదో ఇల్లు ఖాళీ వుందని తను ఇంటికి వెళ్లాక ఆంజనేయులు ఫోన్‌ రావడంతో ఉదయం రాగానే ఆ సంగతి తెలుసుకుందామని ఆశగా వచ్చాడు ఆంజనేయులు.
‘నాకూ డీటైల్స్‌ తెలియదయ్యా.. ఇప్పుడే అడిగిచెబుతానుండు. అని సెల్లుతీసి నెంబర్లునొక్కాడు ఆంజనేయులు.
ఆ, ఇల్లుందన్నారు కదా,, వివరాలు తెలుసుకున్నారా? ఏమిటీ; మీరే వెళ్లి చూసొచ్చారా? మీకు నచ్చితే ఇ క తిరుగేముంటుంది? ఇలాటి విషయాల్లో మీరు కొట్టిన పిండి కదా.. సరే తనతో మాట్లాడి చెబుతానండీ..అని ఫోను ఆఫ్‌ చేశాడు పరంధామయ్య.
ఏమంటాడు ఓనర్‌ గారు? ఆదుర్దాగా అడిగాడు ఆంజనేయులు.
ఓనర్‌ గారేమిటయ్యా, మాట్లాడింది మా ఆవిడతోనైతే? ఆశ్చర్యంగా అన్నాడు పరంధామయ్య..
ఇప్పటి వరకూ మీరు మాట్డాడింది మీ భార్యతోనా? అని నోరు తెరిచాడు ఆంజనేయులు.
అతనికి జవాబు చెప్పకపోగా పొట్టచెక్కలయ్యేలా నవ్వడం మొదలెట్టాడు పరంధామయ్య.
ముచ్చటైన మూడో కథను మురిపెంగా వింటున్న విక్రకు బ్రేకు వేస్తూ –
రాజా స్టోరీలో మునిగిపోయి నా సంగతే మర్చిపోయావే? మరి ఈ మూడోకథలో పరంధామయ్య ఎందుకు నవ్వాడు? తన భార్యకు తాను ఫోన్‌చేస్తే ఆంజనేయులు అతనే ఓనరు అనుకున్నందుకా? మరెందుకు? ఠక్కున చెబితే నేను చెట్టెక్కేస్తా.. భేతాళి తొందర పెట్టింది.
భేతాళి నీ తెలివి తేటలు నా దగ్గర చూపించొద్దు. నీ మాటలకు మోసపోతాననుకోవద్దు. పరంధామయ్య నవ్వింది అందుకు కాదు.తను ఫోన్‌లో అండీ అండీ అని మర్యాదగా మాట్లాడాను కాబట్టి అవతల వున్నది భార్య కాదని నిర్ధారణకు వచ్చిన మిత్రున్ని చూస్తే అతనికి నవ్వొచ్చింది. భార్యలు భర్తలను బహువచనంతో మర్యాదగా మాట్టాడాలి గాని భర్తలు పొరబాటున కూడా అండీ అనడం అతను వూహించలేకపోయాడన్నమాట. సమస్య ఏమంటే భార్యా భర్తలు ఎవరైనా సమానమేనని అలాటి వారికి అర్తం కాదు..
రాజుకు మౌన భంగం కలగ్గానే భేతాళి చెట్టెక్కడానికి సిద్ధమైంది.రాజా స్త్రీ పురుషుల మధ్య తేడాలకు సంబంధించిన ఇలాటి కథలు నా దగ్గర లెక్కలేనన్నివున్నాయి. నీవు బతికినంత కాలం వాటికి సమాధానాలు చెప్పినా సరిపోవు. ఇంతకూ ఈ ఆఖరి ప్రశ్నకు జవాబు చెప్పేసి వెళ్లిపో..
ఈ రోజు నేను ఇవే కథలు ఎందుకు చెబుతున్నాను?
భేతాళి ఆడపిల్లల దినోత్సవం సందర్బంగా ఇవన్నీ చెబుతున్నావని నాకు తెలియదనుకున్నావా అని తిరిగి చూసే సరికి భేతాళి మాయమై పోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *