స్విస్‌కు హైకోర్టు ఛాలెంజ్!అయినా సర్కార్ నో ఛేంజ్!!
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో స్విస్‌ఛాలెంజి విధానం అనుసరించడంపై హైకోర్టు స్టే విధించింది. ఇటీవల ఓటుకు నోటు కేసులో స్టేతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వూరట లభించితే ఈ స్టేతో ఉద్రిక్తత పెంచుతున్నది. ఆదిత్య కన్‌స్ట్రక్షన్స్, ఎవీఎన్ ఇంజనీర్స్ అనే ప్రైవేటు సంస్థలు దాఖలు చేసిన కేసులో అక్టోబరు 31 వరకూ కోర్టు స్టే విధించింది. అంటే అప్పటి వరకూ స్విస్ చాలెంజి హడావుడి ఆపాల్సి వుంటుంది. స్విస్ చాలెంజి పద్ధతి వల్ల చాలా ఇబ్బందులు నష్టాలు వున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి విజరు కేల్కర్ అద్యక్షతన గల నిపుణుల కమిటీ గతంలో ఎప్పుడో తేల్చిచెప్పింది. అందులోనూ రాజధాని వంటి బృహత్తర చారిత్రిక నిర్మాణానికి ఈ పద్ధతి ఎంత మాత్రం సరిపడదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. అయినా చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా ఆ దిశలోనే అడుగులు వేసింది. పైగా స్విస్‌సూత్రాల ప్రకారం మొదట బిడ్ దాఖలు చేసిన కంపెనీ షరతులు ప్రతిపాదనలు ఇచ్చే వాటా వంటివి ఆన్‌లైన్‌లో పట్టాల్సి వుండగా అందుకూ నిరాకరించింది. సింగ్‌బ్రిడ్జిసెంబ్ కార్ప్‌కు ఎంత వాటా ఇచ్చేది గోప్యంగా వుంచి ఇతరులను బిడ్స్ దాఖలు చేయాలని లాంచనంగా ఆహ్వానించింది. దీనిపై వచ్చిన విమర్శలను బేఖాతరు చేసింది. హైకోర్టు దీనిపై అక్షింతలు వేసిన తర్వాతనే ఆ వివరాలు బయిటపెట్టడానికి సిద్ధమైంది. అయితే ఇప్పటికి అన్ని వివరాలు వెల్లడించకపోవడంతో పారదర్శకత మృగ్యమైంది. హౌకోర్టు ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకోసం అటార్జీ జనరల్ ముకుల్ రోహ్తగి రంగ ప్రవేశం చేసినా కోర్టు సంతృప్తి చెందలేదు.చివరకు నెలన్నర గడువుతో స్టే విధించింది. దీంతో ఇప్పటి వరకూ వచ్చిన విమర్శలు నిజమై ప్రభుత్వం ఇరకాటంలో పడిపోయింది. అనేక అవకతవకలు అస్పష్టతలు వున్నందునే కోర్టు ఇలా చేసిందనేది స్పష్టం.
అమరావతి నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర బిజెపి అనేక విమర్శలు చేస్తున్నా కేంద్రం మౌనం వహించడానికి కారణం వారూ ఇదే విధానాన్నిఅనుసరించడమే. మధ్య ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ వంటి బిజెపి పాలిత రాష్ట్రాలే దీన్నిఅధికంగా అనుసరిస్తున్నాయి. 2006లో గుజరాత్ ప్రభుత్వమే స్విస్‌చాలెంజి విధానాన్నిమరింత వ్యాపారానుకూలంగా మార్చింది. మోడీ ప్రధాని అయ్యాక దేశంలో 400 రైల్వే స్టేషన్లనూ 18,673 కిలోమీటర్ల జాతీయ రహదారులను స్విస్ చాలెంజి కింద కట్టబెట్టడానికి కేంద్రం చర్యలు తీసుకున్నది. ఆ సమయంలోనే 2015 జులై 16న ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్విస్‌చాలెంజి అంటే ఒక కంపెనీ తనకు తాను ముందుకు వచ్చి ప్రతిపాదన సమర్పించడం అని వివరించారు. అది వెల్లడి చేశాక అంతకన్నా మెరుగ్గా ఎవరైనా ప్రతిపాదనచేస్తే వారికే కాంట్రాక్టు అప్పగించాల్సి వుంటుందని కూడా తెలిపారు. ఈ కనీససూత్రాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పాటించలేదు. ఇప్పుడేమో కోర్టు ఆదేశాలపై ఆ పార్టీ ప్రతినిధులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని ఆలస్యమైపోతుందని ఆవేపడుతున్నారు.
కోర్టులో ఇంతగా ఆక్షేపణలు ఎదురైనా స్టే జారీ చేసినా కాస్తయినా పునరాలోచించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడం లేదు. తమ విధానంలో ఏ లోపం లేదని వీటికి బాధ్యత వహిస్తున్న మంత్రి వర్యులు నారాయణ సమర్థించుకున్నారు. సింగపూర్ సంస్థకు ఈ విషయంలో చాలా అనుభవం వుందని పొగడ్డలు గుప్పించారు. బిడ్ వివరాలు క్వాలిఫై అయిన వాళ్లకే తెలియజేస్తామని కూడా మరోసారి చెప్పారు. ఇక రాజధాని వ్యవహారాలలో రాజకీయంగా తలమునకలవుతున్న మరో మంత్రి పత్తిపాటి పుల్లారావు ఈ స్టేపై అప్పీలుకు వెళ్లే ఆలోచన వుందన్నారు. కాని నారాయణ ఆ విధమైన సూచన చేయలేదు. అక్టోబరు 31 వరకు అమలులో వుండే మధ్యంతర ఉత్తర్వులు మాత్రమేని కొట్టిపారేశారు. ఒకవేళ ఆ తర్వాత తుదితీర్పు కూడా అలాగే వస్తే.. నారాయణ.. నారాయణ
