మాన్యశ్రీ వెంకయ్య నాయుడు – వ్యాసంలో వాస్తవాలు చూడుడు…

ప్రత్యేక ధోకా పేరిట ఆంధ్రజ్యోతి గమనంలో శుక్రవారం నేను రాసిన వ్యాసం మిత్రులతో పంచుకున్నాను. ఇదే పత్రికలో శనివారం(ఈరోజు) కేంద్ర మంత్రి, బిజెపి అగ్రనేత ముప్పవరకు వెంకయ్య నాయుడు కేంద్రం చేసిన సాయంపై సుదీర్ఘ వివరణాత్మక వ్యాసం రాశారు. తమ ప్రభుత్వం వ్యక్తిగతంగా తాను ఎపిపై వరాల వెల్లువ కురిపిస్తుంటే కొంతమంది రాజకీయ కారణాలతో రచ్చ చేస్తున్నారని ఆరోపించారు.చ సంచలనాత్మక ఆరోపణలు విమర్శలు చేస్తే పతాక శీర్షికలకు ఎక్కవచ్చు గాని రాష్ట్రాభివృద్ధికి ఆరోగ్య కరం కాదని తనదైన పెద్దరికపు తరహా సూక్తి ముక్తావళి వినిపించారు. ఆయన చెప్పిన దాంట్లో అన్ని కాకపోయినా కొన్ని వ్యాఖ్యలూ వాస్తవాలూ చూద్దాం
1. మొదటి పేరాలో ”….వరాల వెల్లువ కురపించడమే కాదు, వాటిని అమలు చేస్తూ వేలాది కోట్ల నిధులు మంజూరు చేస్తోంది”
ఆయన వ్యాసంలోనే మూడవ పేరా గ్రాఫులో దీనికి సమాధానం వుంది. ” కేంద్రం నుంచి ఇప్పటికే రు.8,370 కోట్ల సహాయం అందింది. ఇందులో దాదాపు 2 వేల కోట్ల ప్రత్యేక సహాయం కూడా వుంది” అంటే మామూలుగా ఇచ్చింది 6 వేల కోట్లు. ఇది ఒక ఏడాది ఇవ్వాల్సిన రెవెన్యూ లోటులో సగం కూడా కాదు!
2….. ప్రత్యేక హౌదా అన్న పదాన్ని సాంకేతికంగా ఉపయోగించలేదు.కాని ప్రత్యేక హౌదా ఇస్తే వచ్చే సాయం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ నిధులు కేటాయించింది.”
నిధులు నిజంగా ఇచ్చిందెంతో ఆయనే చెప్పారు. ఇకపోతే తానే సాధించానని చెప్పిన ప్రత్యేక హౌదా అన్న పదాన్ని ఎందుకు ఉపయోగించలేదు? దానికి మంగళం పాడడానికే కదా! నాటి ప్రధాని ప్రకటనలోని కెబికె ప్యాకేజీని ప్రస్తావించారా? టాక్స్ హాలిడేలు ప్రకటించారా? రెండు తెలుగు రాష్ట్రాల్లో వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇచ్చామనిపించుకోవడం తప్ప తీవ్రంగా దృష్టి పెట్టారా? ఇచ్చిన వాటిపై వివరాలు సేకరించారా?రాయలసీమలోనూ ఉత్తరాంధ్రలోనూ మీ పార్టీవారే చేస్తున్న విజ్ఞప్తులు ఆలకించారా?
3…14వ ఆర్థిక సంఘం సిఫార్సులతో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడి కేంద్రం చేతులు కట్టేసినట్టయింది. ప్రత్యేక సాధారణ కేటగరీ రాష్ట్రాల మధ్య ఎలాటి తేడాను చూపలేము అని అని 14వ ఆర్థిక సంఘం తన నివేదికలో పేర్కొన్న విషయం తెలిసిందే.
14 వ ఆర్థిక సంఘానికి హౌదా నిరాకరణకు ఎలాటి సంబంధం లేదనే పరమ సత్యాన్ని పదే పదే తొక్కిపడుతున్న వెంకయ్య నాయుడును విమర్శిస్తే తట్టుకోలేరు. ఎదురుదాడి చేస్తారు. అరుణ్‌జైట్లీతో కలసి తను నిర్వహించిన మీడియా గోష్టి అనంతరం విడుదల చేసిన వెబ్సైట్ ప్రకటనలో ఏముంది? 14 వ ఆర్థిక సంఘం తాను అనుసరించిన పద్ధతిని చెప్పిందే తప్ప కేంద్రం ఏం చేయాలే నిర్దేశించలేదు. .ఎలాటి తేడాను చూపలేదు అని పేర్కొందే గాని చూపలేము అని చెప్పలేదు.కేంద్రం నియమించిన సంఘం కేంద్రాన్ని ఎలా నిర్దేశిస్తుంది? నిషేదిస్తుంది?
4.(పోలవరం ప్రాజెక్టు) ఖర్చును నూటికి నూరు పాళ్లు కేంద్రమే భరించేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే 850 కోట్టు మంజూరు చేసింది.. దానితో పాటే రాష్ట్ర ప్రభుత్వమే ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టేందుకు కేంద్రం అనుమతించింది”
మొత్తం భరిస్తామంటూనే సగం పదవీ కాలంలో ఇచ్చింది 850 కోట్లు .. రాజకీయ ఒత్తిడితో రాష్ట్రానికి వదిలేశామంటారు.. రేపు వారు లెక్కలు ఇవ్వలేదని మళ్లీ కథ మొదటికి..
5. దేశ చరిత్రలో ఏ రాష్ట్రానికి చేయలేదని పదే పదే పేర్కొన్నారు
దేశ చరిత్రలో ఏ రాష్ట్ర విభజనైనా ఇలా జరిగిందా? దానికి కాంగ్రెస్‌ను ఎంత తిట్టినా మీ చేయి కూడా కలవలేదా? విద్యార్థి దశ నుంచే విభజన కోరుతున్నామని సగర్వంగా సభలో ప్రకటించిన పెద్దలు తర్వాతి ఘట్టాన్ని ఎందుకు ఆలోచించలేదు? అక్కడ కోరి తెచ్చామన్నది ఇస్తామన్నది ఎందుకు అమలు చేయడం లేదు?
6. ఆరోపణలు చేసేవారు విమర్శలు చేసే వారు తామేం చేశారు? ఎందుకిలా ఆంధ్రకు అన్యాయం చేశారో సంజాయిషీ ఇవ్వాలి.
అయ్యా విభజన తర్వాత అధికారం మీ చేతుల్లోనే వుంది. ఇతరులు ఏం చేయగలరు? దేని గురించి సంజాయిషీ ఇస్తారు? అసలెందుకివ్వాలి? అధికారం మీకిచ్చి అభియోగాలు మరొకరిపై చేయాలంటారా?
లేక తాతల నాటి చరిత్రలతో సరిపెడుతుంటారా? మాటిమాటికి ఆంధ్రాభ్యుదయం అంటూ ఇక్కడేదో అదనంగా చేస్తున్నట్టు మరో రాస్ట్రాన్ని ఇబ్బందుల్లో పెట్టే ఎత్తుగడలు ఎందుకు?
7ప్రభుత్వం నుంచి ఎవరు వైదొలగినా మరొకరు వచ్చినా ప్రయోజనం వుండదు..
ఇది టిడిపికి బెదిరింపా? వైసీపీకి హెచ్చరికా? ఉన్నా ఒకటే పోయినా ఒకటే అంటుంటే ఇంకెక్కడ ఆత్మగౌరవం? స్నేహధర్మం?
8.తెలుగుదేశం ఎన్డిఎతో తెగతెంపులు చేసుకోవాలనీ, బిజెపి తెలుగుదేశంను వదులుకోవాలని ప్రచారం చేస్తున్నారు. ఇలా చేయడం ఆత్మహత్యా సదృశ్యం అవుతుంది…
మీరు చంద్రబాబు నాయుడు పరస్పరం ఫ్రశంసించుకుంటారు. కింద మీ నాయకులు తిట్టుకుంటారు. ఒక రోజు పొగుడుతారు మరో రోజు విమర్శిస్తారు. ఈ దాగుడు మూతల వ్యవహారం మాత్రం హాస్యాస్పదం కాదా? ఆ రోజున మీరు విపిసింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించి కాంగ్రెస్‌కు కొమ్ములు తీసుకురాలేదా? ఇప్పుడు రోజూ కాంగ్రెస్‌పై దాడి చేస్తారు గాని మీరు ఉభయులూ కలసే కదా ఓటు చేసి పోటు పొడిచారు? పైగా మీరు వున్నా వూడినా ఒకటే అని పై వాక్యంలో చేసిన చులకన వ్యాఖ్య తెలుగుదేశంకు గౌరవమా?
8.కేంద్ర మంత్రి ఎపికి వచ్చిన వస్తున్న సంస్థల ఆఖరుకు రోడ్లతో సహా పెద్ద జాబితా చదివారు. సంతోషం. అవన్నీ చట్ట ప్రకారం ఇచ్చారో అపార ఔదార్య ఫలితమో వారికే తెలియాలి. జాతీయ రహదారులు ఇక్కడ వేయడం తమ బాధ్యత కానట్టు…రైల్వే జోన్ వివాదంపైనా సరైన వివరణ వుండదు. 24/7విద్యుత్ మా గొప్ప అని రెండు ప్రభుత్వాలు చెబుతుంటాయి.
9. అమరావతికి కేటాయింపులను గురించి చెబుతూ ” ఖర్చును బట్టి తదుపరి సాయం విడుదలవుతుంది అన్నారు
అంటే వినియోగించలేదా? లేక దుర్వినియోగం జరిగిందని భావిస్తున్నారా? మొన్నటి ప్రకటనలో దాన్నెందుకు నొక్కి చెప్పలేదు? ఇక్కడ మీ రాష్ట్ర శాఖ గగ్గోలు పెడుతున్నా మీరెందుకు ప్రశంసలతో సరిపెట్టేస్తుంటారు?
10.చివరగా వెంకయ్య నాయుడు వ్యాసంలో అవాస్తవాలు అర్థసత్యాలు ఇంకా వున్నాయి. ఇప్పటికి ఇవి చాలు. చివరగా ఒక్క ముక్క- అసలు హౌదా/ ప్యాకేజీపై అరకొర ప్రకటన చేయడానికే అర్థపాలనా కాలం సరిపోయిందంటే ఇదేనా తమ ప్రత్యేక దృష్టి? మంచిది.
మీ వరాల వానకు వేల వేల వందనాలు.