అటు అతి వ్యూహం – ఇటు అరాచకం


9brk50aa

ఈ రోజైనా స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టడం,కాగితాలు విసిరేయడం వంటి చర్యలు జరగకుండా ప్రత్యేక హౌదాపై చర్చ జరిపి విమర్శనాత్మకంగా వ్యవహరిస్తారా అని ఉదయం నాతో పాటు చర్చలో పాల్గొన్న వైసీపీ ఎంఎల్‌ఎను అడిగాను,. ఎప్పుడైనా అసాధారణ పరిస్థితులుంటే నిరసన తెల్పడం రభస చేయడం సహజమే గానిఅదే ఒక విధానంగా మారిపోతే ప్రభుత్వం కన్నా ప్రతిపక్షానికే ఎక్కువ నష్టం కదా అని కూడా ప్రశ్నించాను. చర్చకు ప్రభుత్వం సిద్ధపడటం లేదనీ, ప్రకటన చేస్తామంటున్నారని, ఆ తర్వాత చర్చకు నిబంధనలు ఒప్పుకోవని నిరాకరించడం చాలాసార్లు జరిగిందని ఆయన జవాబిచ్చారు. నిజానికి అప్పటికే శాసనమండలిలో ప్రకటన చేయడం, చర్చ కూడా జరిగిపోయాయి. మరి అదే పద్ధతి శాసనసభలో ఎందుకు జరగదని ప్రభుత్వం వాదించింది. ఏమైతేనేం షరా మామూలుగా ఉభయ పక్షాలు దూషణలకే ప్రాధాన్యత నిచ్చాయి. ఈ క్రమంలో వరుసగా రెండో రోజు వైసీపీ ఎంఎల్‌ఎలు స్పీకర్‌పైకి దూసుకెళ్లడం మైకు విరిచేయడం, దాని వైరు ఎవరి మెడకోచుట్టడానికి ప్రయత్నించడం ఇవన్నీ అవాంచనీయ పరిణామాలు. రాష్ట్ర ప్రజలు చర్చ జరగాలని విషయాలు బయిటకు రావాలని కోరుతుంటే ఈ విధంగా రచ్చతో రభసతో సమయం వృథా చేసుకోవడం వాతావరణం కలుషితం కావడం ఎవరికి ఉపయోగపడదు, ఒకవేళ ప్రభుత్వం వ్యూహాత్మకంగానే తమకు అవకాశం నిరాకరిస్తున్నదని ప్రతిపక్షం భావిస్తే అప్పుడు మరింత చాకచక్యంగా చర్చ జరిపి పాలకపక్షాన్ని ఇరుకున పెట్టాలితప్ప ఆ వ్యూహానికి లోనవడమెందుకు? 9brk104a
వైసీపీ నేతలు సభా వ్యూహం విషయంలో పదేపదే పొరబాట్లు చేస్తూ వాయిదా వేసేందుకు కారణాలందిస్తున్నారు. అప్పుడప్పుడూ అరాచకం అంచులకు చేరుతున్నారు. గతంలోనూ కొన్ని శిక్షణా చర్యలకు గురైన ఉదాహరణలున్నాయి. ఇది గొప్ప ప్రతిఘటన అని వారు భావిస్తున్నారేమో గాని చూస్తున్న ప్రజలు మాత్రం అయోమయానికి గురవుతున్నారు. ఒక వేళ చర్చను అనుమతించడం లేకపోతే మౌనంగా నిరసన తెల్పడం వాకౌట్‌ చేసి బయిట ఆందోళన చేయడం వంటి అనేక పద్ధతులున్నాయి. ఈ ప్రభుత్వం తప్పులు సమర్థించడానికి లేదుగాని ప్రతిపక్షం అనుసరిస్తున్న వ్యూహం కూడా లోపభూయిష్టమైనదని చెప్పక తప్పదు. సమర్థులైన వక్తలను నియోగించి వరుసగా మాట్లాడించవచ్చు. జోక్యం రూపంలోనే చాలా సమాచారం చేరవేయవచ్చు. అదేమీ లేకుండా పదే పదే వెల్‌లోకి దూసుకువెళ్లడం ఒకటైతే నేరుగా స్పీకర్‌ టేబుల్‌ను చుట్టుముట్టడం మైకు విరిచేయడం వంటివి సరికాదు.
ఉమ్మడి రాష్ట్రం చివరి దశలో టిఆర్‌ఎస్‌ సభ్యులు ఆందోళన చేశారంటే వారా సభ మాత్రమే గాక రాష్ట్రం కూడా రద్దు కావాలని కోరుకుంటున్న అసాధారణ పరిస్థితి. ఇప్పుడు అదే హరీష్‌ రావు సభా వ్యవహరాల మంత్రిగా వుండి టిఅసెంబ్లీలో ఎలాటి విజ్ఞప్తులు చేస్తుంటారో చూడొచ్చు. ఒక వేళ వైసీపీ గనక ఆ తరహా చర్యలతో ప్రజలను ఆకర్షించగలననుకుంటే లేదా మెప్పించగలననుకుంటే మాత్రం పొరబాటు అవుతుంది. ప్రత్యేక హాదాపై ప్రకటన తర్వాత చర్చ చేద్దామంటే ప్రయత్నించి చూడలానికి అభ్యంతరముండాల్సిన పనిలేదు. మాట తప్పితే అప్పుడే చూడొచ్చు. అలాగే ప్రభుత్వ పెద్దలు కూడా ప్రతిదానిపై పట్టుదలకు పోయి ప్రతిష్టంభన పెంచే బదులు పట్టువిడుపులు చూపించి చర్చలకు సిద్ధం కావాలి తప్ప వారి అపరిపక్వతను ఆధారం చేసుకుని అన్నిటినీ నెట్టుకుపోవాలనుకోవడం సరికాదు. ఈ పరస్సర కుస్తీలో సమస్యలపై చర్చ మట్టికొట్టుకుపోవడం నిజంగా బాధాకరం. మిగిలిన కాలమైనా సభ సార్థకమవుతుందా? ఉభయులపై ఆధారపడి వుంటుంది. నాకు తెలిసి కాగితాలు విసిరేయాలని మైకులు విరిచేయాలని ఎవరూ చెప్పరు. చెప్పకుండా చేసేవారిని అదుపుచేయవలసిన బాధ్యత నాయకులదే కదా! ఒకవేళ తమకేదైనా జరిగిందని ఫిర్యాదులుంటే తప్పక వాదించవచ్చు. దానికిది సమాధానం కాదు.
ప్రత్యేకహౌదాకోసం పోరాటం మొదలవుతున్న తరుణంలో ఇలాటి ఘటనలు దాన్ని దారి తప్పించడానికి కారణమవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *