ద్వంద్వనీతితో రాష్ట్రాలపై ,విపక్షాలపై దాడి

modi1111 modi222222chandy11111kegri1111

ప్రధాని నరేంద్ర మోడీపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ ఉపయోగించిన భాష సరిగ్గా లేదని బిజెపి కేంద్ర మంత్రులు విరుచుకుపడుతున్నారు. ‘ నా మాటలే బాగా లేవంటున్నారు గాని మీ చేతలు అస్సలు బాగాలేవు’ అని కేజ్రీవాల్‌ ఎదురు వడ్డించారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఒక ముఖ్యమంత్రి కార్యాలయంపై ముందస్తు సమాచారం లేకుండా సిబిఐ దాడి చేయడం నిజంగా దిగ్భ్రాంతి కరం. రాష్ట్రాల సమాఖ్య అయిన భారత దేశంలో ఈ విధంగా కేంద్రం ఇష్టానుసారం వ్యవహరించేట్టయితే కలిగే పర్యవసానాలు దారుణంగా వుంటాయి. కేజ్రీవాల్‌ ముఖ్య కార్యదర్శి రాజేంద్ర సింగ్‌పై ఎప్పటి కాలానికో సంబంధించిన ఆరోపణలపై ఈ దాడిజరిగిందని, ముఖ్యమంత్రితో గాని ఆయన పదవీ కాలంతో గాని సంబంధం లేదని సిబిఐ సమర్థించుకుంటున్నది. మరి అలాటప్పుడు ఆయననెందుకు విశ్వాసంలోకి తీసుకోలేదు? ఆయనపై కూడా అనుమానాలున్నాయా? వుంటే లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు తెలియజేసి దాడికి అనుమతి తీసుకోవాలి. అంతేగాని ఒక రాష్ట్ర ప్రభుత్వాధినేతపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఇష్టానుసారం దాడి చేయడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం. తమ చర్యకు మద్దతుగా ఏవో పొంతన లేని సెక్షన్లను సిబిఐ వర్గాలు చెబుతున్నాయి గాని అవన్నీ ముఖ్యమంత్రి కార్యాలయానికి వర్తించేవి కావు. సిబిఐ కేంద్ర ప్రభుత్వంలో భాగం అని గతంలో సుప్రీంకోర్టుకు అధికారికంగా నివేదించారు. దాన్ని పంజరంలో చిలుకు అని సుప్రీం కోర్టు అభివర్ణించింది. అలాటి చిలుక కేంద్రంలోని పాలకపక్షానికి వ్యతిరేకులైన వారిపై వినియోగించడం ఒకటైతే ఏకంగా ముఖ్యమంత్రి అధికార కార్యాలయంపైకే ప్రయోగించడం రాజ్యాంగానికి సవాలే.
మోడీ కేరళ పర్యటన సందర్భంలోనూ ముఖ్యమంత్రిని అవమానించారు. మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్‌ నాయకుడు శంకర్‌ విగ్రహావిష్కరణకు ఉద్దేశించిన సభకు ముఖ్యమంత్రి చాందీ అద్యక్షత వహిస్తాడని ఆహ్వానాలు కూడా వెళ్లిన తర్వాత ఆయనను సభనుంచి దూరంగా వుండవలసిందిగా సంకేతాల పేరుతో ఆదేశాలు పంపించారు. అంతకు ముందు ఢిల్లీలోని కేరళ భవన్‌లో గొడ్డుమాంసం వండుతున్నారంటూ హొం శాఖ పోలీసులను పంపించింది. తెలంగాణలోనూ రక్షణ మంత్రి మనోహర్‌ పరిక్కర్‌ పర్యటనపై ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం లేకపోవడంతో కెసిఆర్‌ ఆయన కార్యక్రమానికి హాజరు కాలేదు. అంతకన్నా ముఖ్యంగా కొన్ని రక్షణ స్థలాలు సమస్యల విషయమై చర్చించేందుకు సమయం కోరితే ఎంతకూ అవకాశం ఇవ్వలేదు. ఆ మాటకొస్తే ఢిల్లీలోనూ పిఎంవో పెద్దగా తమకు సమయం ఇవ్వడం లేదన్న భావన తెలంగాణ ప్రభుత్వంలో వుంది. ప్రభుత్వంలో భాగస్వామిగా వున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా ఏమంత మెరుగ్గా లేదు. మొత్తంపైన బిజెపి రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాలపై ‘శీతకన్ను’ వేయడమే గాక రాజ్యాంగ బద్దమైన వాటి హక్కులను కూడా బేఖాతరు చేస్తున్నదనే భావన ఏర్పడుతున్నది.
బీహార్‌ ముఖ్యమంత్రి నితిష్‌ కుమార్‌, కూడా ఈ విధమైన విమర్శలే చేస్తున్నారు. త్రిపురలో వామపక్ష ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌ అనుభవం కూడా భిన్నంగా లేదు. పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పరిపరివిధాల రాజకీయ భంగిమలు ప్రదర్శిస్తుంటారు గాని ఈ విషయంలో ఆమె కూడా ప్రస్తుతం కేంద్రాన్ని తప్పుపడుతున్నారు.
ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి అయోగ్‌ పెట్టిన తర్వాత కేంద్ర పథకాల ద్వారా వచ్చే సహాయాన్ని చాలా వరకు కోత పెట్టారు. ఇప్పుడు జిఎస్‌టిని గనక ఆమోదిస్తే రాష్ట్రాల ఆదాయం మరింత తగ్గి కనీస అవసరాలకు కూడా అవస్థ పడే పరిస్థితి అనివార్యమవుతుంది. కాంగ్రెస్‌ను ఎలాగైనా మచ్చిక చేసుకుని ఆ బిల్లును ఆమోదింపచేసుకోవాలనే హడావుడిలో వుండి మోడీ ప్రభుత్వం. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా వుండి జిఎస్‌టిని వ్యతిరేకించిన మోడీ ఇప్పుడు తనకు నచ్చిన మార్పులు చేసి వెనువెంటనే ఆమోద ముద్ర వేయించుకోవాలనుకుంటున్నారు.
వీటన్నిటి సారాంశం ఒక్కటే- కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను ముఖ్యమంత్రులను గౌరవించేందుకు సిద్ధంగా లేదు. మోడీ గాలి ఒకసారి పనిచేసినా అత్యధికరాష్ట్రాలలో బిజెపికి స్థానం లేదు గనక ఆపరేషన్‌ అమిత్‌షా ప్రకారం వాటిపై పరోక్ష పెత్తనం చేసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటున్నది. తమ అధికార పీఠం వున్న ఢిల్లీలోనే కేజ్రీవాల్‌ సర్కారును అసలే సహించలేకపోతున్నది. ఇది ప్రజాస్వామిక వాదులు ఏమాత్రం అంగీకరించలేని ఏకపక్ష ధోరణి తప్పమరొకటి కాదు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మోడీజీ ఈ దోరణి మార్చుకోకపోతే మిత్రపక్షాలే గాక స్వంతపార్టీ ముఖ్యమంత్రులు కూడా సహించలేని స్థితి వస్తుంది.

రాజేంద్ర సింగ్‌ గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు దాడులు చేశానంటున్న సిబిఐ వ్యాపాం వంటి కేసులను ఎందుకు పట్టించుకోదు? లలిత్‌ మోడీకి సుష్మా స్వరాజ్‌ అండదండలనూ వసుంధరా రాజే భాగస్వామ్యాన్ని ఎందుకు దర్యాప్తు చేయదు? నేషనల్‌ హెరాల్డ్‌ వ్యవహారం, చిదంబరం కుమారుడిపై దాడులు సాగించవచ్చు గాని అదే కొలబద్దలు తమ వారిపట్ల ఎందుకు ప్రయోగించడం లేదన్నది కళ్లముందు కనిపిస్తున్న ప్రశ్న.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *