కెటిఆర్+జిహెచ్ఎంసి చేయాల్సింది…
బుధవారం వర్షం ధాటికి హైదరాబాదు అతలాకుతలమైపోయింది. ఢిల్లీ, ముంబాయి, చెన్నై వంటి మహానగరాలకూ లేదా అభివృద్ధి చెందిన దేశాలకూ ఈ దుస్థితి తప్పడం లేదు గనక మనమే వెనకబడ్డామని విచారించాల్సిస పనిలేదు. కొత్తగా జరిగిందీ కాదు. కాకపోతే హైర్ అప్పరెంట్ కెటిఆర్ ప్రత్యక్ష బాధ్యత వహించి ప్రముఖంగా కనిపిస్తున్నప్పుడు ప్రజలను అమితంగా బాధించే అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిందే. డ్రైనేజీ వ్యవస్థ బాగుకు ఎన్నివేల కోట్లు కావాలి ఎన్నేళ్లకు అవుతుంది అనేది దీర్ఘకాలిక సమస్య. కాని తక్షణ పరిష్కారాలు స్వల్పకాలిక మార్గాలు యుద్ధ ప్రాతిపదికన విస్త్రతంగా ఎందుకు చేపట్టకూడదు? మొత్తం డ్రైనేజీ పాయింట్స్ గుర్తించి వారం రోజుల పాటు సిబ్బందినీ సహాయకులనూ కాంట్రాక్టు వర్కర్లనూ ఇంకా స్వచ్చందంగా వచ్చేవారిని దింపితే సగమైనా బాగుపడదా? కావాలంటే సిబ్బందికి అదనంగా చెల్లించవచ్చు. స్థానికుల సహాయం కోరితే యువత ముందుకు రారా? పరిస్థితి బాగవుతుందంటే కొద్దో గొప్పో విరాళాలు ఇవ్వడానికి కూడా ప్రజలు వెనుకాడకపోవచ్చు. ఎటొచ్చి మన సంప్రదాయిక పాలక వ్యవస్థ అలాటి ఆలోచనలు చేయదు. ఆదేశాలు సమీక్షలు ప్రచారాలు వీటితోనే సరిపోతుంటుంది. ఈ లోగా విపత్తులు పునరావృతమవుతుంటాయి.ఒకోసారి వూహించిన దానికంటే ఎక్కువ నష్టం కలగొచ్చు. స్వచ్చహైదరాబాద్ సంగతి ఎలా వున్నా రక్ష హైదరాబాద్ తక్షణావసరం. మేయర్ రామ్మోహన్, కమిషనర్ జనార్థనరెడ్డి కూడా ప్రత్యేక దృష్టితో ఆలోచించి అడుగులు వేయాలని కోరుకుందాం.
