అభిమానం +దురభిమానం = దురదాభిమానం
పవన్ కళ్యాణ్ తిరుపతిలో రాజకీయ సభ పెట్టడంతో ఆయన అసలు పర్యటనకు దారితీసిన సమస్య వెనకబడి పోయింది. కోలార్‌లో తన అభిమానులకూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మధ్యన తలెత్తిన వివాదంలో వినోద్ రాయల్ అనే అభిమాని హత్యకు గురైనందువల్ల ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. నాటకీయంగా బహిరంగ సభ జరుగుతుందని ప్రకటించి ఆక్కడ ప్రసంగంతో మరింత చర్చకు తెరతీశారు. దేశంలోనే సినిమా నటుల అభిమానుల మధ్య ఘర్షణ హత్యకు దారితీయడం ఇదే ప్రథమమంటున్నారు. నిజంగా ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. సినిమా పిచ్చి హీరోల క్రేజి మనకన్నా బాగా అతిగా వుండే తమిళనాడులో లేనిది తెలుగువాళ్లకు ఎందుకూ సమస్య వచ్చిందో ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ హుందాగానే మాట్లాడినా ఖచ్చితంగానూ మాట్లాడారు. ఇందుకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఆ సమయంలోనే మేమంతా బాగా కలిసి వుంటామని కూడా వివరించారు.
పైన హీరోలు దోస్తుల్లా కనిపిస్తుంటే కింద అభిమానులెందుకు కొట్టుకుంటారు? మధ్యలో మాయమై పోయిన ఈ సంసృతి మరోసారి ఎందుకు విజృంభించింది? మేము విద్యార్థులుగా వున్నప్పుడు ఎన్టీఆర్ పార్టీ ఏఎన్నార్ పార్టీ రెండే వుండేవి. తర్వాత కృష్ణ శోభన్‌బాబు వచ్చినా ఈ స్థాయిలో ఘర్షణలు వుందేవి కావు. మంచితనంతో పాటు వ్యాపార దక్షత కూడా వున్న కృష్ణ మొదటినుంచి అభిమానులను ప్రత్యేకంగా కాపాడుకుంటూ వచ్చారు. అక్కినేని కూడా వారితో సత్సంబంధాలు పాటించేవారు. ఎన్టీఆర్‌కు అంత అవసరముందేది కాదు కాని ఆయన అభిమాన సంఘాల వారు మాత్రం బాగానే పలుకుబడి చలాయించేవారు. ఒకరి పోస్టర్లపై ఒకరు పేడ కొట్టడం వారి ప్రధాన కార్యక్రమంగా వుండేది. ఉద్రిక్తత పెరక్కుండా చూడటం కోసం ఒకటి రెండు
సార్లు వారు కలసి ఫోటోలు దిగారు. ఎన్టీఆర్ సిగరెట్ తాగుతుంటే అక్కినేని అగ్గిపుల్ల గీస్తున్న ఫోటో వాటిలో ఒకటి.అయితే దానిపైనా సమస్యలు వచ్చాయి. మా హీరో సిగరెట్ మీ హీరో వెలిగిస్తున్నాడు చూడంటే మీ హీరోకు చాతకాక మా హీరో సహాయం తీసుకున్నాడని మరో వాదన. అప్పుడు గుమ్మడి అభిమానం ప్లస్ దురభిమానం ఈజ్‌ఈక్వల్ టు దురదాభిమానం అని చమత్కరించారు. అయితే వారిద్దరూ ఎంత కీచులాడుకున్నా నేపథ్యాలు ఒకటే గనక సామాజిక వర్గాల సంఘర్షణగా మారలేదు. చిరంజీవి రంగ ప్రవేశంతో అదంతా మారింది. ఆయన కుటుంబం ఒక నట నిర్మాణ సంస్థానంగా మారడం, రాజకీయాల్లోకి రావడం ఇవన్నీ అభిమానులను రెండు మూడు శిబిరాలుగా మార్చేసినట్టు కనిపిస్తుంది. ఎన్టీఆర్ అభిమానులు బాలయ్య, జూనియర్‌ల మధ్య విడగొట్టబడినట్టే మెగా అభిమానులనేవారు కూడా పరస్పరం కీచులాడుకోవదం, తర్వాత సర్దుబాటు చేయడం చూస్తూనే వున్నాం. పోటీ పెరిగిన కొద్ది హీరోలు కూడా అభిమానుల ఐడెంటిటీని గుర్తించడం, తమ ప్రచారాల్లో భాగం కల్పించడం పెరిగింది. మొన్న చిరంజీవి పుట్టిన రోజున కూడా ఇది చూశాం. నిజానికి వీరే గాక ఇంకా ఇతర హీరోలకూ అభిమానుల ప్రహసనం వుంటూనే వుంది. గతంలో వలె గాక చాలామంది హీరోలు వచ్చినా ఈ జాడ్యం కొనసాగుతున్నదంటే అందులో హీరోల నిర్మాతల ప్రయోజనాలు కూడా వున్నాయనేది స్పష్టం. రెండుకులాల విభజన కూడా తీవ్రం కావడానికి ఇది దారి తీసిన దుష్ఫలితాలే మనం చూస్తున్నాం.
ఇటీవలనే సింధు ఒలింపిక్ రజత పతకం సాధిస్తే ఆమె ఏ కులం అని వెతికిన వారు వేలల్లో వున్నారు. రాజకీయాల్లో సరేసరి గతంలో కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీ ఇటు పాలక తెలుగుదేశం, కులాల మధ్య విభజన పెరగడానికి కారణమవుతున్నాయి. ఈ క్రమంలో ముద్రగడ పద్మనాభం ముందుకు తెచ్చిన కాపు సమస్యలు వాటిపై వివాదాలు దుర్ఘటనలూ ప్రభుత్వ నిర్బంధం అన్నీ కలసి వాతావరణం కలుషితమైంది. ఆ క్రమంలో రాజకీయ సినిమా పెద్దలతో సహా బాహాటంగానే కులాల పరిభాషలో మాట్లాడుతున్నారు. బిజెపి తన మత రాజకీయాలకు తోడు ఈ కులాల పాచికలు కూడా సిద్ధం చేసుకుని వుంది. పవన్ తనపై వచ్చే ఆ తరహా ఆరోపణలను ఖండించారు. కులం సినిమా రాజకీయం వ్యాపార ప్రయోజనాలు కలగలసిన నేటి పరిస్థితుల్లో ప్రత్యేకించి యువత చాలా విజ్ఞత చూపించాలి. అప్రమత్తంగా వుండాల్సిన అవసరముంది. లేకపోతే రకరకాల స్వార్థపర శక్తులు వారిని పక్కదోవ పట్టిస్తాయి. అవాంఛనీయ ధోరణులు పెరుగుతాయి.
