ఒప్పందం హర్షనీయం.. ప్రచారంలో అతిశయం..

గోదావరి జలాలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడనవీస్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఒప్పందం కుదర్చుకోవడం హర్షణీయ పరిణామం. దీర్ఘకాలంగా పెండింగులో వున్న ప్రాజెక్టులు వీటివల్ల కదలికలోకి రావడం ఆహ్వానించదగింది. గతంలో ప్రభుత్వాలు మరింత శ్రద్ద పెట్టి పూర్తిచేయకపోవడం పొరబాటే గనక ఇప్పుడు వివాదాలు అధిగమించి వీటిని త్వరితంగా పూర్తి చేస్తారని ఆశించాలి. ఈ ఒప్పందాలకోసం నీటిపారుదల మంత్రి హరీష్ రావు చాలా కృషి చేశారని ఫడనవీస్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ రోజు ఉదయం పత్రికల్లో దీనిపై పూర్తి పేజీ ప్రకటనలు చేస్తూ తెలంగాణ ఉద్యమం కెసిఆర్ నాయకత్వం తదితర చాలా అంశాలు ప్రస్తావించారు. కాబట్టి దీన్ని టిఆర్‌ఎస్ ప్రభుత్వం రాజకీయ ప్రచారానికి వాడుకోవాలనుకుంటున్న మాట స్పష్టం. రేపు ఆ బృందం తిరిగి వచ్చినప్పుడు ఘన స్వాగతం ఏర్పాటు చేయడంలోనూ ఇదే కనిపిస్తుంది. తెలంగాణ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని కెసిఆర్ ఆరోపించడాన్ని అర్థం చేసుకోవచ్చు. కాని ఇరుగుపొరుగు రాష్ట్రాలతో ఒప్పందాలు ఇదే మొదటిసారైనట్టు చరిత్ర మొదలైనట్టు చెప్పుకోవడం అతిశయోక్తి అవుతుంది. మహారాష్ట్రతోనే చాలా దపాలు చర్చలు కొన్ని అవగాహనలు వచ్చాయి. అప్పటికి ఇప్పటికి ఒక ముఖ్యమైన తేడా వుండటం సహజం. ఆంధ్ర ప్రదేశ్‌ను మొత్తంగా తీసుకున్నప్పుడు దిగువ రాష్ట్రం అవుతుంది. తెలంగాణ వరకే చూస్తే ఒక విధంగా ఎగువ రాష్ట్రంగానే వుంటుంది. గతంలో ప్రభుత్వాలకు లేని మరో సదుపాయం కెసిఆర్ ఉద్యమ నేపథ్యం. కనుకనే మేడిగడ్డ బ్యారేజీ ఎత్తు 152 నుంచి 148కి తగ్గించడానికి ఒప్పుకోగలిగారు. .గతంలో వారు ఇలాటివి చేసుకుని వుంటే తప్పక సమస్య అయివుండేది. అంతటి సాహసం వారు చేయగలిగేవారూ కాదు. కాని ఎపి మహారాష్ట్ర కర్ణాటక మూడు చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వాలు వున్నప్పుడు కూడా నదీజల వివాదాలు కొనసాగడం దారుణమే. అందువల్లనే వారి నిరసన ప్రదర్శనలు కొంచెం విచిత్రమనిపిస్తాయి. ఇప్పటికైనా జల వివాదాలు పరిష్కారం చేసుకోవడానికి ఎగువ రాష్ట్రాలతో పాటు దిగువ సోదర రాష్ట్రమైన ఎపితో కూడా కెసిఆర్ సానుకూల వైఖరితో వ్యవహరించితే వివాదాలకు అస్కారం వుండదు. సమస్యలు ఇంకా ముగిసిపోలేదని అన్నారు గనక ఆయన ఆ దిశలో ఏం చేస్తారో చూడాలి.కాకపోతే ఇప్పటికైతే ఇరు రాష్ట్రాలు నదీజలాల పంపిణీ యంత్రాంగంలో తేల్చుకోలేకపోతున్నాయనేది వాస్తవం.