టి. కాంగ్రెస్ పవర్ పాయింట్స్…
తెలంగాణ నీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు బాగా జరిగినట్టు ఈ రోజు ప్రదర్శించిన పవర్ పాయింట్ కమ్ లెక్చర్ పాయింట్స్ వెల్లడించాయి. ఇందుకోసం డా.దాసోజు శ్రవణ్ బృందం చాలా శ్రమ చేసిందని పిసిసిఅద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అభినందించారు. మొదట ఆయన, తర్వాత శ్రవణ్ వివరంగానే మాట్లాడారు. ఇది ప్రతిపక్షంగా మంచి ప్రయత్నమని చెప్పకతప్పదు. గతంలో అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ చాలా విమర్శలు మోయవలసి వుంటుంది కాని.. అదే సమయంలో వారి వాదనలు వినవలసిన అవసరం వుంటుంది. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా వారి విమర్శలకు విలువా వుంటుంది. పైగా టిఆర్ఎస్ లోగడ కాంగ్రెస్‌లో విలీనం కావడానికి కూడా సిద్ధమైంది గనక రాజకీయంగా పెద్ద విమర్శించగలిగేది వుండదు.మూడు నాలుగు విషయాల్లో కాంగ్రెస్ ప్రెజంటేషన్ బలమైన వాదనలు తెచ్చింది
1.ఇప్పటికే పూర్తయిన రంగం సిద్ధమైన ఆయకట్టును తక్కువగా చూపించడం 2. ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొద్దిపాటి ఖర్చుతో విస్తారమైన ఫలితాలు ఇచ్చే ప్రాజెక్టుల కొరవ పనులు ప్రాధాన్యతతో పూర్తి చేయకపోవడం 3. తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడంలో అసంబద్దత 4. అంతులేకుండా పెంచిన నిర్మాణ వ్యయం. వీటితో పాటే అతిశయోక్తులను కూడా కొన్నిటిని బలంగానే చూపించారు. వాప్కోస్ సంస్థ వైఎస్ రాజశేఖరరెడ్డి బెదిరింపులతో ఆయన చెప్పిన చోట ప్రాజెక్టు కట్టాలని సిపార్సు మార్చడం నిజమైతే మళ్లీ వారికే ఎందుకు ఎలా ఇస్తారని వేసిన ప్రశ్న కూడా ఆలోచించదగింది. మల్లన్నసాగర్పైన కూడా బలమైన విమర్వలే చేశారు. రాజకీయంగా తమ గురించి చెప్పుకోవడం ఎలాగూ వుంటుంది గాని ప్రభుత్వం ఆ కోణాలపై కేంద్రీకరించేబదులు వాస్తవాలు వివరించడానికి పొరబాట్లు ప్రాధాన్యతలు పున: పరిశీలించుకోవడానికి ప్రయత్నిస్తే ప్రజలు సంతోషిస్తారు. శాసనసభలో ముఖ్యమంత్రి కెసిఆర్ పవర్‌పాయింట్ అంతిమమని పట్టుపట్టేబదులు జిల్లాల విభజన వలెనే ప్రాజెక్టులపైనా అఖిలపక్షం జరిపితే బావుంటుంది. కాంగ్రెస్ సంస్తాగత వ్యవస్థను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని కూడా అర్థమవుతున్నది.
