దీని భావమేమి ‘అమర’నాథ!

4-krishna-river-bank-thulluru-andhra-new-capital

 

 

  • ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి స్టార్టప్‌ క్యాపిటల్‌ నిర్మాణ కాంట్రాక్టు నిబంధనలపై ఇప్పుడు దేశీయ కంపెనీల నుంచి అసంతృప్తి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సింగపూర్‌ కన్సార్టియం సమర్పించిన స్విస్‌ ఛాలెంజ్‌ ప్రీ బిడ్‌ సమావేశం నిర్వహించినప్పుడు ఈ కంపెనీలు చాలా సందేహాలు లేవనెత్తాయి. ఎల్‌ అండ్‌ టి, షాపూర్జి పల్లోంజి, రాంకీ, ఆదిత్యా హౌజింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, అలయన్స్‌ ఇన్‌ఫ్రా, జిఐఐసి, చైనా ఫస్ట్‌ మెటలర్జికల్‌ కంపెనీల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సిఆర్‌డిఎ కమీషనర్‌ చెరుకూరి శ్రీధర్‌, అదనపు కమీషనర్‌ రామ్‌మనోహరరావు, వై. నాగిరెడ్డి ప్రభుత్వం తరుఫున మాట్లాడారు. స్టార్టప్‌ ఏరియాలో స్థలాన్ని ఎలా కేటాయిస్తారు? ప్రభుత్వానికి ఈ స్థలంపై పూర్తిగా హక్కులు ఉన్నాయా? ఉంటే మాకు ఎలా బదాలియిస్తారు అని కంపెనీల ప్రతినిధులు ప్రశ్నలు వేశారు. డెవలప్‌మెంట్స్‌ పూర్తి అయిన తరువాత భూమి ఎవరి చేతిలో ఉంటుంది? ఎలాంటి ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని కూడా అడిగారట.చాలా కాలంగా ఈ సమస్యలోనే ప్రభుత్వం మునిగితేలుతుంది కానీ అధికారులు మాత్రం ఈ ప్రశ్నలకు జవాబులు వెంటనే చెప్పలేక పోయారు. రాసిస్తే రెండు రోజుల్లో సమాధానం ఇస్తామని తెలిపారు. అలాగే నిర్మాణాలకు పెట్టుబడులు ఎలా వస్తాయనే ప్రశ్న కూడా ఎదురైంది. ఇన్నాళ్లుగా తర్జనభర్జన జరుపుతున్న క్రిడా అధికారులు ఇలాంటి ప్రాథమిక ప్రశ్నలకు కూడా వెంటనే జవాబులు చెప్పకపోవడం చెప్పింది అసమగ్రంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇప్పటికే స్వీకరించిన కన్సార్టియం స్విస్‌ ఛాలెంజ్‌ లో ప్రతిపాదనలు ఆర్థిక ఆఫర్లు ప్రభుత్వం రహస్యంగానే అట్టిపెట్టింది. ఈ గోప్యత సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకమని తెలిసినా వైఖరి మార్చుకోలేదు. ఇప్పుడు కంపెనీల ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి కూడా వెంటనే సిద్ధపడలేదు. దీని భావమేమి అమరనాథ!
  • ఇదిలా ఉంటే ప్రపంచ బ్యాంకుకు కూడా రాజధాని నిర్మాణంపై సందేహాలు కలిగాయి. రఘు కేశవన్‌ నాయకత్వంలోని ప్రపంచ బ్యాంకు బృందం ఆ ప్రాంతంలో ప్రధాన సమస్యగా ఉన్న వరద ముంపు నివారణకు ప్రణాళిక ఏమిటని క్రిడా అధికారులను ప్రశ్నించింది. ఈ సమస్య తీవ్రంగానే ఉంటుందని కూడా వారు అభిప్రాయపడినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే రెండుసార్లు సమావేశమైన ప్రపంచ బ్యాంకు బృందం మరిన్ని వివరాలు అందించాకే తమ నివేదిక తయారు చేయగలమంటూ మరింత వ్యవధి తీసుకుంటున్నది.
  •  భూసమీకరణకు సంబంధించిన బదలాయింపు పత్రాలు సమగ్రంగా లేకపోవడం కూడా నిర్మాణాలకు ఆటంకమవుతున్నది. రాయపూడి, మందడం, తుళ్లూరు, వెంకటాయపాలెం, కృష్ణాయపాలెం వంటి గ్రామాల్లో భారీ భవంతులు కట్టకపోతే నగర కళ రావడం లేదని ప్రభుత్వం ఆందోళన చెందుతున్నది. అయితే గ్రామ కంఠాల సమస్య పరిష్కారం కాకుండానే నిర్మాణాల కోసం తొందరపెట్టడం రైతుల విమర్శకు, ఆగ్రహానికి దారి తీసింది. మేమిచ్చిన భూమికి బదులు రావాల్సిన ప్లాట్లు కేటాయించాల్సింది పోయి బిల్డర్లకు ఇమ్మని వెంటబడడం ఏంటని వారు అభ్యరతరాలు పెడుతున్నారు. అయితే భవనాలు కడితే ఆదాయాలు పెరుగుతాయంటూ ప్రభుత్వం దారికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఇదే అవకాశంగా చాలా మంది బిల్డర్లు కొత్తకొత్త షరతులను ముందుకు తీసుకువస్తున్నారు. క్రిడా రైతులు నిర్మాణ సంస్థల మధ్య ఏకాభిప్రాయం వచ్చే అవకాశం ఇప్పటికైతే కనిపించడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *