9/11 .సౌదీ యువరాజు హస్తంపై సాక్ష్యం

అమెరికా ఇస్లామిక్ టెర్రరిజాన్ని ఖండించడం, ఇప్పుడు ఐఎస్‌ఐఎస్ తీవ్రవాదంపై యుద్ధ ప్రకటించడం .. ఆ పేరుతో ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్,లిబియా, సిరియా తదితర దేశాలపై దాడులు చేయడం బాగానే వుంది. కాని వాస్తవానికి బిన్‌లాడెన్‌తో మొదలు పెట్టి ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తున్న సౌదీ అరేబియా రాజకుంటుంబాన్ని ఎందుకు పట్టించుకోదు? ఆఖరుకు బిన్‌లాడెన్ కూడా రాజవంశీకుడే. ప్రపంచాన్నికుదిపేసిన 9/11 విమాన దాడులలో సౌదీ యువరాజు అంతేగాక అమెరికాలో వారి రాయబారి అయిన బందర్ బిన్ సుల్తాన్ పాత్రను తెలిపే పత్రాలు అధికారికంగా విడుదలైనాయి. ఇటీవల బహిర్గతం చేసిన 2002 రహస్య పత్రాలలో నాటి ఘటనలలో పట్టుబడిన ఉగ్రవాది ఒకరు పాకిస్తాన్‌లోని అబూజయద్ అనే కార్పొరేట్ ఏజంటుకు ఫోను చేసినట్టు సాక్ష్యాధారాలు లభించాయి. అబూ జయద్ అల్‌ఖైదా కోసం యువకులను రిక్రూట్ చేసేవాడు. ఇంతకూ అతను పనిచేసే కంపెనీ యజమాని మరెవరో కాదు బందర్ బిన్ సుల్తానే! ఈయన అమెరికాలోనే 1883 నుంచి 2005 వరకూ అంటే దాడి తర్వాత మరో నాలుగేళ్లపాటు రాయబారిగా వున్నారు. రోనాల్డ్ రీగన్‌నుంచి జూనియర్ బుష్ వరకూ నలుగురు అద్యక్షులతో పనిచేశారు. అతను చాలా సమర్థుడని సిఐఎ కితాబులిచ్చింది. మరి అంత ముఖ్యుడైన వ్యక్తికి చెందిన కంపెనీ అధికారి ఇలాటి కీలకసందర్బంలో పట్టుపడితే అమెరికా ఎందుకు ఉపేక్ష వహించింది?ఇంతవరకూ ఈ విషయమై విడుదల చేసిన పత్రాలలో బిన్‌సుల్తాన్ నెంబర్లు వివరాలు మాత్రం గోప్యంగా అట్టిపెట్టింది. మామూలుగా బహిర్గత పరిచే రహస్య పత్రాలలోని ఈ ఆధారాలను సిఎన్‌ఎన్ వార్తాసంస్థ బయిటపెట్టింది.దీనికి సంబందించిన మొత్తం 28 పేజీలు ఇప్పుడు లభించాయి. సౌదీ రాజకుటుంబం లేకుండా బిన్‌లాడెన్ అల్ ఖెయిదా గాని ఇప్పుడు ఐఎస్‌ఐఎస్ గాని వుండవని గతంలో నేను రాశాను. ఇప్పుడు ఈ ఆధారాలు చూశాకనైనా అమెరికా ద్వంద్వనీతిని అర్థం చేసుకోవచ్చు.ఇప్పటికైనా నిజాలు ఒప్పుకోకపోగా యువరాజా గాని రాజ కుటుంబం గాని తెలిసి తెలిసి ఉగ్రవాదానికి సాయపడినట్టు సమాచారం లేదని సిఐఎ,ఎఫ్‌బిఐ రెండూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నది. పైగా బందర్ బిన్ సమర్థతను సిఐఎ విశ్లేషకుడు భూస్ రైడల్ ఆకాశానికెత్తి రాశారు. నిజానికి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లను పాకిస్తాన్ ఐఎస్‌ఐని అల్‌ఖైదాను పైకి తేవడంలో అమెరికా దాని మిత్రుల పాత్రే ప్రధానం. భస్మాసుర హస్తంలా వారిప్పుడు ఆ దేశానికే ముప్పుగా తయారైనారు. అసలు రాజరికం నుంచి బయిటకు రాకుండా మత చాందసానికి ప్రతిరూపాలుగా కొనసాగుతున్న గల్ఫ్ దేశాలపై అమెరికా ఎందుకు ఎప్పుడూ దృష్టి పెట్టదు? తనను కాదనే ఇరాక్ లిబియా వంటి దేశాలపైనే ఎందుకు కత్తికడుతుంది? చమురు పెత్తనం కోసం అంతర్జాతీయ ఆదిపత్యం కోసం.. అంతే! అలాటి అమెరికాతో కలసి టెర్రరిజంపై పోరాటం అని మనం ప్రకటిస్తుంటాం. ఇంతకన్నా బూటకం ఏముంటుంది?