కేంద్ర బిజెపికి టిడిపి కాపు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రయివేటు బిల్లు అనుకున్నట్టే చర్చకు రాకుండా పోయింది. ఈవిషయం మనం ముందుగానే చెప్పుకున్నాం. నిన్న కూడా మాట్లాడుకున్నాం. ఇందుకు కేంద్రంలోని బిజెపి వ్యూహాత్మకంగా అడ్డుపడిందనేది అందరికి అగుపించిన దృశ్యం. అనివార్యమైన పరిస్థితుల్లో ఈ బిల్లుకు మద్దతునిస్తామని ప్రకటించిన తెలుగుదేశం కూడా తప్పించుకోవడానికి దీనివల్ల అవకాశం లభించింది. వాస్తవంగా టిడిపి-బిజెపి కూటమి ఎత్తుగడ కూడా అదేనని అనుకుంటున్నదే. ఆప్ ఎంపీ భగవంత్‌మాన్ దుస్సాహసాన్ని సాకుగా చేసుకుని ఉభయసభల్లో రభస సృష్టించడం పథకం ప్రకారమే జరిగింది. ప్రత్యేక హౌదా నిరాకరిస్తున్నది బిజెపి అయితే ఆ సమస్యపై సన్నాయి నొక్కులతో సరిపెడుతున్నది తెలుగుదేశం. కనుకనే బిల్లు చర్చకు రాకుండా చేసిన బిజెపిని వదిలిపెట్టి కాంగ్రెస్‌పైనే తెలుగుదేశం విమర్శకు సాగిస్తున్నది. అధికారంలో ఉన్నవారు వెల్‌లోకి వెళ్లి రభస చేయడం అసాధారణం. వారే కోరుకుంటే కాంగ్రెస్ అడ్డుపడినా నిక్షేపంగా చర్చ చేపట్టే వారు. కాంగ్రెస్ గత తప్పిదాలను సాకుగా చూపించి ప్రభుత్వం నడిపించే బిజెపిని కాపాడడం ఆశ్చర్యకరం.అభ్యంతరకరం. తెలుగుదేశం ఈ విషయంలో పట్టుదలగా లేదుగనకే విమర్శ కాంగ్రెస్‌పైకి తిప్పింది. కేంద్ర రాష్ట్రాలలో కలిసి పాలన చేస్తున్న రెండు పార్టీల దోబూచులాటకు ఇది తాజా నిదర్శనం. సిపిఎం నేత సీతారాం ఏచూరి మాత్రం ప్రత్యేక హౌదా ఇవ్వాలని ఖచ్చితంగా మాట్లాడారు. తెలుగుదేశం మద్దతు చెప్పిన తరువాత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సందిగ్ధ సంకేతాలు ఇచ్చారు. రాజ్యసభలో శుక్రవారం మధ్యాహ్నం మాత్రం అదికూడా వారం విడిచి వారం మాత్రమే ప్రయివేటు బిల్లులు చర్చకు వస్తాయి. ఆ సమయంలో సెలవులుంటే వెనక్కి పోతాయి. మరి ఈ ప్రత్యేక దోకా ఈసారి ఏ రూపంలో ఉంటుందో చూడవలసిందే.
