దళిత ఆగ్రహం – ఎన్నికల గ్రహణం

Dalits beaten up GUJARAT
గోవధ ఆరోపణతో గుజరాత్‌లోని ఉన్‌ ప్రాంతంలో దళితులను దారుణంగా హింసించిన సంఘటన బిజెపికి పెద్ద సవాల్‌గా తయారయింది. ఇదే తరుణంలో ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి బిఎస్పి అధినేత మాయావతిని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయాశంకర్‌ అసభ్య రీతిలో నిందించడం పెను దుమారం సృష్టించింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ తీవ్ర స్థాయిలో నిరసన ప్రదర్శనలు, బంద్‌లు జరుగుతున్నాయి. ఎన్నికలకు వెళ్లాల్సిన రెండు చోట్ల పరిస్థితి చుక్కెదురు కావటం ప్రధాని మోడి, అధ్యక్షుడు అమిత్‌ షా ద్వయానికి ప్రాణసంకటం అవుతున్నది. అందులోనూ గుజరాత్‌ను మోడి పాలనలో దేశానికే ఆదర్శంగా చిత్రించి ప్రధాని పీఠం వరకు నడిపించారు. అలాంటి చోట దళిత వర్గాలపై అత్యాచారాలు, అమానుషాలు జరగడం దేశాన్ని ఉడికిస్తోంది. ఆరాష్ట్రంలో మొదటి నుంచి దళితులపై అత్యాచారాలు అధికంగానే జరుగుతున్నాయి. 2014లో 1130 అత్యాచారాలు జరిగాయి. ఈ రెండేళ్లలో అవి అయిదు రెట్లు పెరిగి 6655కు చేరినట్టు లెక్కలు చెబుతున్నాయి. బిజెపి పాలనలోనే ఛత్తీస్‌గడ్‌ చిన్న రాష్ట్రం అయినప్పటికీ 3వేల అత్యాచారాలు జరిగాయి. ఈ వివరాలు, వివాదాల మధ్య బిజెపి రాజకీయ ఇరకాటంలో పడిపోయింది. యూపీలోని దాద్రి ఘటనకు సంబంధించి హత్యకు, దాడికి గురైన కుటుంబంపైనే గోవధ కేసు పెట్టించడం తీవ్ర విమర్శకు దారితీస్తోంది. మాయావతిపై వ్యాఖ్యలు చేసిన నాయకుడిని పదవి నుండి తప్పించారు గాని ఆయన అసలు పత్తాలేకుండా అదృశ్యం కావడం అంతుపట్టని వ్యవహారమైంది. జాతీయ పత్రికలన్నీ దళితులలో పెల్లుబికిన నిరసన శాసనసభ ఎన్నికల్లో బిజెపికి నష్టదాయకమని వ్యాఖ్యానించాయి. దెబ్బమీద దెబ్బ అంటూ నేను రాసిన పోస్టు ఆ పార్టీ వీరాభిమానులకు నచ్చలేదు గాని ఆ తరువాత మరిన్ని దెబ్బలు తగలడం నిజం. గురువారం నాడు హిందూ, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, టైమ్స్‌, హిందూస్థాన్‌ టైమ్స్‌ వంటి పత్రికలన్నీ బిజెపి సవాళ్లపైనే శీర్షికలు ఇచ్చాయి. కనుక కాదనలేని వాస్తవాలను ఒప్పుకోవడం, తప్పులు దిద్దుకోవడం శ్రేయస్కరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *